నాడు గల్ఫ్‌ కార్మికుడు.. నేడు జెడ్పీటీసీ సభ్యుడు

Past Gulf Worker Elected As Present Zptc Member In Nizamabad - Sakshi

ఏర్గట్ల మండల తొలి జెడ్పీటీసీ సభ్యుడిగా గుల్లె రాజేశ్వర్‌

కాంగ్రెస్‌ పార్టీ  ఫ్లోర్‌ లీడర్‌గా ఎంపిక

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): నిన్నటి వరకు గల్ఫ్‌ కార్మికుడిగా కొనసాగిన గుల్లె రాజేశ్వర్‌ నేటి నుంచి ఏర్గట్ల మండల తొలి జెడ్పీటీసీ సభ్యుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. జీవనోపాధి కోసం ఎన్నో ఏళ్ల పాటు గల్ఫ్‌లో పని చేసిన గుల్లె రాజేశ్వర్‌ తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికయ్యాడు. అంతేకాక జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఫ్లోర్‌ లీడర్‌గా బాధ్యతలను నిర్వహించడానికి పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఏర్గట్లకు చెందిన రాజేశ్వర్‌ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. వ్యవసాయం ఉన్నా ఉపాధి కోసం 2002లో గల్ఫ్‌ పయనం అయ్యాడు.

అక్కడ ఒక కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో కూలీగా చేరిన రాజేశ్వర్‌ తన వృత్తి నైపుణ్యంతో సూపర్‌వైజర్‌ స్థాయికి ఎదిగాడు. తాను ఆర్థికంగా స్థిరపడడంతో పాటు పది మందికి పని కల్పిం చాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి 2010లో స్నేహితులు, బంధువుల సహకారంతో సప్లయింగ్‌ కంపెనీని కువైట్‌లో ప్రారంభించాడు. మరామిష్‌ జనరల్‌ ట్రేడింగ్‌ కాంట్రాక్టింగ్‌ కంపెనీని స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు.

కువైట్‌లో తన కంపెనీ సక్సెస్‌ కావడంతో ఇటీవల దుబాయ్‌ లో కూడా మరో కంపెనీని స్నేహితుల భాగస్వామ్యంతో ప్రారంభించాడు. అయితే కువైట్‌లో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ గల్ఫ్‌ విభాగం బాధ్యతలను స్వీకరించి సేవా కార్యక్రమాలను కొనసాగించాడు. కువైట్‌లో క్షమాభిక్ష అమలు జరిగిన సమయంలో ఎంతో మంది ఖల్లివెల్లి కార్మికులు ఇళ్లకు చేరుకోవడానికి విమాన టిక్కెట్‌లను కాంగ్రెస్‌ పార్టీ నాయకుల సహకారంతో అందించి పార్టీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో అతని సేవలను ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది. ఏర్గట్ల జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయడానికి అవకాశం కల్పించగా ఆయనను జెడ్పీటీసీ పదవి వరిం చింది. జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన రాజేశ్వర్‌ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు జిల్లా పరిషత్‌లో పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గాను వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top