‘ఔట్‌సోర్సింగ్’ వేతనాలు పెరిగాయ్


సాక్షి, హైదరాబాద్: ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపు అమల్లోకి వచ్చింది. పెరిగిన జీతం జనవరి ఒకటో తేదీ నుంచే వర్తించనుంది. ఈ పెంపుతో దాదాపు 23 వేల మంది ఔట్ సోర్సింగ్, 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు కలిపి మొత్తంగా సుమారు 53 వేల మందికి ప్రయోజనం కలుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపుపై జనవరి రెండో తేదీన జరిగిన సుదీర్ఘ కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్నట్లు ఆ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రకటించారు.



కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఉత్తర్వుల జారీ ఆలస్యమైంది. తాజాగా మూడు రోజుల కింద కోడ్ ముగిసిన నేపథ్యంలో... శుక్రవారం ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ వేతనాల పెంపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపుతో దాదాపు 23 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, మరో 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఖజానాపై ఏటా దాదాపు రూ.400 కోట్ల మేర భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం నాలుగు శ్లాబ్‌లుగా పరిగణించింది.



కేటగిరీల వారీగా పెరిగిన జీతాలను అందులో పేర్కొంది. దీని ప్రకారం ప్రస్తుతం రూ.6,700 నుంచి రూ.7,740 మధ్య వేతనమున్న ఉద్యోగులకు ఇకపై రూ. 12 వేలు చెల్లిస్తారు. రూ. 7,960 నుంచి రూ. 10,020 వరకున్న వారికి రూ. 15 వేలు... రూ. 10,900 నుంచి రూ. 13,660 వరకున్న వారికి రూ. 17 వేలు వేతనమిస్తారు. అంతకు మించి జీతం పొందుతున్నవారి విషయాన్ని జీవోలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు ప్రస్తుతం పొందుతున్న జీతంలో 50 శాతానికి మించకుండా పెంపు ఉంటుందని వెల్లడించారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు సైతం ప్రభుత్వం పెంచిన జీతాలను ఉద్యోగులకు సరిగ్గా చెల్లిస్తున్నాయా లేదా అనేదానిని అన్ని శాఖలు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top