ఓయూ బడ్జెట్‌ రూ.686.77 కోట్లు 

OU Budget is Rs 686.77 crores - Sakshi

రూ.63.18 కోట్ల లోటు.. బడ్జెట్‌కు సెనెట్‌ ఆమోదం 

415 అధ్యాపక పోస్టుల భర్తీకి కేటాయింపులు 

క్యాంపస్‌లో వీసీ, రిజిస్ట్రార్‌కు కొత్త నివాస భవనాలు 

నాలుగు కొత్త హాస్టల్‌ భవనాల నిర్మాణం 

తెలంగాణ, అంబేద్కర్‌ అధ్యయన కేంద్రాల ఏర్పాటు 

హైదరాబాద్‌: శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీ వార్షిక బడ్జెట్‌ అభివృద్ధిదాయకంగా ఉందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం అన్నారు. శనివారం వర్సిటీ పాలనా భవనంలో రామచంద్రం అధ్యక్షతన జరిగిన సెనెట్‌ సమావేశంలో వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. గత ఏడాదిగా ఓయూలో చేపట్టిన పనులు, శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇటీవల సాధించిన న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్, స్వయంప్రతిపత్తి తదితర అంశాలను ప్రస్తావించారు. అనంతరం రూ.686.77 కోట్ల అంచనా, రూ.63.18 కోట్ల లోటుతో 2018–19 సంవత్సరానికి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావు ప్రవేశపెట్టిన ఓయూ వార్షిక బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు వీసీ ప్రకటించారు. ఓయూలో 415 అధ్యాపక పోస్టుల భర్తీకి వార్షిక బడ్జెట్‌లో రూ.34.06 కోట్లు కేటాయించారు. త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు పెంచిన 75 శాతం వేతనంపై బడ్జెట్‌లో నిర్ణయం తీసుకోలేదు. సమావేశంలో రిజిస్ట్రార్‌ ప్రొ.గోపాల్‌రెడ్డి, వోఎస్‌డీ ప్రొ.కృష్ణారావు, సెనెట్‌ సభ్యులు పాల్గొన్నారు.  

మౌలిక వసతులకు పెద్దపీట 
ఓయూ బడ్జెట్‌లో భవన నిర్మాణాలకు పెద్దపీట వేశారు. రూ.40 కోట్లతో కొత్త అకాడమీ బ్లాక్, వైస్‌ చాన్స్‌లర్‌ నివాసానికి మరో భవనం, రిజిస్ట్రార్‌కు క్యాంపస్‌లో కొత్తగా నివాస భవనం, రూ.30.50 కోట్లతో యూనివర్సిటీ ఫారిన్‌ రిలేషన్‌ భవనం (యూఎఫ్‌ఆర్వో), క్యాంపస్‌లోని ఓయూ మోడల్‌ స్కూల్‌కు భవనం, రంగాపూర్‌లోని నిజాం అబ్జర్వేటరీ కేంద్రంలో కొత్త భవనాలను నిర్మించాలని నిర్ణయించారు. క్యాంపస్‌లోని ఆర్ట్స్, సైన్స్‌ కళాశాల భవనాల మరమ్మతులకు రూ.10 కోట్లు కేటాయించారు. రూ.3.22 కోట్లతో ఠాగూర్‌ ఆడిటోరియం మరమ్మతు, రోడ్లు, పాత భవనాల మరమ్మతులకు రూ.17.19 కోట్లు, సీఎఫ్‌ఆర్‌డీ (రౌండ్‌ బిల్డింగ్‌)లో మౌలిక వసతులకు రూ.2.99 కోట్లు, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అధ్యయన, పరిశోధనా కేంద్రం, తెలంగాణ అధ్యయన కేంద్రం, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. క్యాంపస్‌లో రెండు, సైఫాబాద్‌ పీజీ కాలేజీలో బాలుర హాస్టల్, కోఠి మహిళా కళాశాలలో బాలికల హాస్టల్‌ భవనాలు, సికింద్రాబాద్‌ పీజీ కళాశాలలో అకడమిక్‌ బ్లాక్‌ నిర్మించనున్నారు.  

తగ్గిన రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌లు 
ఓయూలో వివిధ కోర్సులు చదువుతున్న మెరిట్‌ విద్యార్థులకు లభించే ఫెలోషిప్‌ల సంఖ్య పెరిగింది. విద్యార్థినులకు లభించే ఇందిరాగాంధీ సింగిల్‌ గర్ల్‌ స్కాలర్‌షిప్‌లు 137కు చేరుకోగా, పీహెచ్‌డీ చేసే ఎస్సీ, ఎస్టీ పరిశోధక విద్యార్థులకు లభించే రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌ల(ఆర్‌జీఎన్‌ఎఫ్‌) సంఖ్య 8 కి తగ్గింది. వర్సిటీ మెరిట్‌ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు 426, యూజీసీ, నెట్‌–జేఆర్‌ఎఫ్‌ 54, వృత్తివిద్య పీజీ కోర్సుల్లో 19 మందికి, పోస్టు డాక్టోరల్‌ ఫెలోషిప్‌ 12 మంది, ఎమిరటస్‌ ఫెలో 5, డాక్టర్‌ రాధాకృష్ణన్‌ పోస్టు డాక్టోరల్‌ ఫెలోషిప్‌ 4, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ ఇద్దరికి లభిస్తున్నాయి. 

యూపీజీ మరో రెండేళ్లపాటు పొడిగింపు 
ఓయూకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నుంచి 2012–13 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీ విత్‌ పొటెన్షియల్‌ ఫర్‌ ఎక్సలెన్సీ(యూపీఈ) స్కీంకు ఎంపికైంది. ఈ స్కీం కింద రూ.30 కోట్లు లభించాయి. ఈ పథకం జూలై 2017లో ముగిసింది. ఓయూ పనితీరును పరిశీలించిన యూజీసీ అధికారులు యూపీఈ పథకాన్ని మరో రెండు సంవత్సరాల వరకు పొడిగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top