అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు

OP Services In All Hospitals Says Etela Rajender - Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల 

8 కరోనా ఆస్పత్రులు మినహా అన్ని చోట్లా ప్రారంభిస్తాం 

లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ వైరస్‌ విజృంభించే అవకాశం 

ఇకపై కేసులు తగ్గే అవకాశం 

ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 24 నాటికి డిశ్చార్జి 

విదేశాల నుంచి వచ్చిన 26 వేల మందికి క్వారంటైన్‌ పూర్తి 

సాక్షి, హైదరాబాద్‌ : అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. కరోనా రోగులకు చికిత్స అందించే 8 ఆస్పత్రులు మినహా మిగిలిన అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంకొన్నాళ్లు లాక్‌డౌన్‌ కొనసాగిస్తే మంచిదనేది తమ అభిప్రాయమన్నారు. కేంద్రం కూడా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటోందని, అనంతరం ఓ తుది నిర్ణయానికి వస్తుందన్నారు. నెల రోజులుగా కరోనాపై నిరంతరం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ, వైద్య ఆరోగ్య యంత్రాంగాన్ని ఆయన ముందుండి నడిపిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, చికిత్స, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వంటి అంశాలపై మంత్రి ఈటల రాజేందర్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

ఓపీని ఎక్కడా ఆపొద్దు.. 
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నందున సాధారణ ఆపరేషన్లు, ఓపీ సేవలు నిలిపేయాలని మొదట్లో చెప్పాం. ఎమర్జెన్సీ వైద్య సేవలు మాత్రమే అందజేయాలని ఆదేశాలు ఇచ్చాం. అయితే సాధారణ రోగులు ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటిలోనూ ఓపీ సేవలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేస్తాం. అయితే అదెలా ఉండాలన్నదానిపై మార్గదర్శకాలు ఇస్తాం. ప్రస్తుతం కరోనా చికిత్సల కోసం కేటాయించిన 8 ఆస్పత్రుల్లో మాత్రం సాధారణ ఓపీ సేవలు అందించబోం. 

సూపర్‌ స్పెషాలిటీగా గచ్చిబౌలి ఆస్పత్రి... 
గచ్చిబౌలి కాంప్లెక్స్‌లో ప్రస్తుతం కరోనా చికిత్స కోసం 1,500 పడకలతో ఆస్పత్రి ఏర్పాటు చేశాం. అందుకు అవసరమైన సిబ్బందిని కూడా తీసుకుంటున్నాం. దాదాపు రెండు, మూడు వేల మంది సిబ్బందిని భర్తీ చేస్తాం. కరోనా నుంచి రాష్ట్రం విముక్తి అయ్యాక గచ్చిబౌలి ఆస్పత్రిని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తాం. నిమ్స్‌ను తలదన్నేలా తీర్చిదిద్దుతాం. పేదలందరికీ సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తాం. 

వైరస్‌ నియంత్రణలోకి వస్తుందన్న ఆశ... 
కరోనా వైరస్‌ రోజురోజుకూ నియంత్రణలోకి వస్తోంది. మున్ముందు కేసుల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయి. నాలుగైదు రోజుల్లో సింగిల్‌ డిజిట్‌కు రావొచ్చని అంచనా. రాష్ట్రంలో హాట్‌స్పాట్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నాం. ఇప్పటికే లక్షలాది మందిని మన వైద్య బృందాలు కలిశాయి. విదేశీ ప్రయాణ చరిత్ర ఉన్నవారిని, మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిని గుర్తిస్తున్నాయి. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారు, వారి ద్వారా మొత్తం 50 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మిగిలినవి అంతా మర్కజ్‌కు సంబంధించినవే. దేశంలో మర్కజ్‌తో సంబంధమున్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. మర్కజ్‌తో సంబంధమున్న వారందరినీ దాదాపు గుర్తించాం. ఇంకా కొన్నిచోట్ల వారితో సంబంధమున్న వారిని గుర్తించే పనిలో వైద్య, నిఘా బృందాలు నిమగ్నమయ్యాయి. 

లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మరింత ప్రమాదం... 
కేంద్రం ప్రకటించిన తేదీ నాటికి లాక్‌డౌన్‌ ఎత్తేస్తే సమస్యలు వస్తాయి. ఇప్పుడిప్పుడే వైరస్‌ బాధితులను గుర్తించడం, వారికి చికిత్స చేయడం, మరికొందరిని క్వారంటైన్‌లో ఉంచడం వల్ల పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది. పరిస్థితి పూర్తి నియంత్రణలోకి రాకుండా లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ సాధారణ స్థితి మొదలై వైరస్‌ విజృంభిస్తుంది. వివిధ రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరుగుతాయి. జనం గుమిగూడుతారు. అయితే కేంద్రం ఏం చెబుతుందో పరిశీలిస్తాం. వారు కొనసాగిస్తే మంచిదే. లేకుంటే ఏం చేయాలన్న దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పరస్పర సహకారంతో లాక్‌డౌన్‌ విజయవంతంగా నడుస్తోంది. అలాగైతేనే కరోనాపై విజయం సాధిస్తాం. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, అధిక జనాభా ఉన్న మన దేశంలో వైరస్‌ విజృంభిస్తే శవాల గుట్టలే చూడాల్సి వస్తుంది. ఇప్పటివరకైతే మూడో దశలోకి కరోనా చేరుకోలేదు. జనసమూహంలోకి వెళ్లలేదు కాబట్టి మనం ఇబ్బందుల్లో లేనట్లే. 

26 వేల మంది హోం క్వారంటైన్‌ పూర్తి.. 
విదేశాల నుంచి వచ్చిన 25,931 మంది హోం క్వారంటైన్‌ గురువారంతో ముగిసింది. వారంతా సాధారణ పౌరులుగా ఉండొచ్చు. ఇక మర్కజ్‌కు వెళ్లిన వారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారు 3,510 మంది ఉన్నారు. వారిలో కొందరికి పాజిటివ్‌ వచ్చి చికిత్స పొందుతున్నారు. మరికొందరి కరోనా పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే 1,400 మందికి నెగెటివ్‌ వచ్చింది. చికిత్స పొందుతున్నవారు, ఫలితాలు రావాల్సిన వారు మినహా మిగిలిన వారందరినీ హోం క్వారంటైన్‌కు తరలిస్తున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో క్వారంటైన్‌లో ఉండే వారు అత్యంత తక్కువ మందే. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిలో పేదలు, మధ్య తరగతి, ధనికులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్నీ కలిపి 7,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాం. ప్రస్తుతం సర్కార్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న 167 క్వారంటైన్‌ సెంటర్లలో కొన్ని మినహా దాదాపు అన్నీ ఎత్తేస్తున్నాం. మర్కజ్‌ సంబంధం ఉన్నవారిని హోం క్వారంటైన్‌లో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తాం. ఈ నెల 28 నాటికి వారందరి హోం క్వారంటైన్‌ పూర్తవుతుంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు ఈ నెల 23 నాటికి చికిత్స పూర్తయి ఇంటికి వెళ్లిపోతారు. 

వెయ్యి వెంటిలేటర్లు కొంటాం.. 
కరోనా నేపథ్యంలో వెయ్యి వెంటిలేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించాం. డాక్టర్లకు అవసరమైన కిట్లకు కొరతలేదు. ఇంకా 5 లక్షల ఎన్‌–95 మాస్క్‌లు, మరో 5 లక్షల పీపీఈ కిట్లు, 5 లక్షల గ్లౌజులు, కోటి సాధారణ మాస్కులు కొనుగోలు చేస్తున్నాం. డాక్టర్లకు షిఫ్టుల వారీగా డ్యూటీలు వేస్తాం. ఒక బ్యాచ్‌ 15 రోజులు, మరో బ్యాచ్‌ 15 రోజులు పనిచేసేలా కసరత్తు చేస్తున్నాం. సీఎం చెప్పినట్లుగా 25 వేల మంది డాక్టర్లను పూల్‌ చేసి ఉంచాం. అవసరమైతే వారి సేవలను ఉపయోగించుకునేలా సిద్ధంగా ఉన్నాం. తాత్కాలిక పద్ధతిన పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చాం. ఇంకా భర్తీ ప్రక్రియ చేయాల్సి ఉంది. 

కరోనాపై యుద్ధం.. 
ఇప్పుడు మనం కరోనాపై యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో సైనికులు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందే. వారికి భరోసా ఇవ్వడానికే నేను ముందున్నాను. నేను కనీసం మాస్క్‌ కూడా పెట్టుకోవడం లేదు. నెల రోజుల నుంచి రోజూ రాత్రి బాగా ఆలస్యంగా ఇంటికి వెళ్తున్నాను. ఉదయం 9 గంటల నుంచే సమావేశాలు, ఫోన్‌లో ఫాలోఅప్‌లు చేస్తున్నాం. ఆశ కార్యకర్తల నుంచి పై స్థాయి వరకు వైద్య ఆరోగ్య శాఖలో 80 వేల మంది కరోనాపై యుద్ధం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top