అభ్యర్థులూ జర జాగ్రత్త!

Nominations From Monday In Telanagana Elections - Sakshi

నామినేషన్‌ సూచనలు పాటించండి

సాక్షి,సిటీబ్యూరో: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ల ప్రక్రియ అత్యంత కీలకమైంది. నామినేషన్‌ పత్రాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌ఓ) నుంచి పొంది వాటిని భర్తీచేసి, అవసరమైన జత చేసి తిరిగి ఆర్‌ఓకు అందజేయాలి. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఒక పాస్‌పోర్టు సైజు ఫొటోను ఫారం–26(అఫిడవిట్‌)పై అంటించాలి. మరో స్టాంప్‌ సైజు ఫొటోను నామినేషన్‌ పేపర్‌పై అంటించాలి. ఇంకా నామినేషన్‌కు ఏమేం కావాలంటే..  

అభ్యర్థి నామినేషన్‌తో పాటు డిపాజిట్‌గా రూ.10 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రాయితీ ఉంటుంది. అయితే, సంబంధిత కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి.
గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర రాజకీయ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థి నామినేషన్‌ను స్థానిక నియోజకవర్గంలో ఓటరుగా ఉన్న ఒక్కరు ప్రతిపాదిస్తే సరిపోతుంది.
రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసేవారు, ఇండిపెండెంట్లను స్థానిక నియోజకవర్గంలో పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి.
ఇతరులు అంటే రిజిస్టర్‌/గుర్తింపు పొందని వారు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు నామినేషన్‌ పత్రంలోని ఫారం–2బి పార్ట్‌–3లోని ‘సి’ కాలం ఎదురుగా కేటాయించాల్సిన గుర్తులను (ఎన్నికల సంఘం పంపిన ఫ్రీ సింబల్స్‌ నుంచి) మూడింటిని  ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాలి.
అభ్యర్థి స్థానిక నియోజకవర్గంలో ఓటరు కాని పక్షంలో ఓటరుగా నమోదైన నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి నుంచి ఓటరు జాబితా సర్టిఫైడ్‌ కాపీని పొంది నామినేషన్‌తో పాటు జతచేయాలి.
అభ్యర్థిని ప్రతిపాదించే వారు నిరక్షరాస్యులై, నామినేషన్‌ పత్రంలో వేలిముద్ర వేస్తే ఆర్‌ఓ ముందు మరోమారు వేలిముద్ర వేయాలి.
ఎన్నికల ఖర్చులకు సంబంధించి నామినేషన్‌ వేసే అభ్యర్థి నామినేషన్‌ వేయడానికి 48 గంటల ముందుగా తన పేరిట ఎన్నికల వ్యయం నిర్వహణ కోసం బ్యాంక్‌ ఖాతాను ప్రత్యేకంగా తెరవాలి. అంతకుముందే ఉన్న బ్యాంకు ఖాతాలు అనుమతించరు.
నామినేషన్‌ పత్రంలోని ప్రతి కాలమ్‌ తప్పనిసరిగా భర్తీచేయాలి. ఏదైనా కాలమ్‌లో భర్తీ చేయాల్సినది లేనట్లయితే ‘లేదు’, ‘వర్తించదు’ అని రాయాలి. అంతే తప్ప డ్యాష్‌(–) వంటివి నింపకూడదు. ఏ ఒక్క కాలమ్‌ను ఖాళీగా వదలకూడదు.
గుర్తింపు పొందిన జాతీయ/రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి రిజిస్టర్‌కాని, గుర్తింపు పొందని పార్టీల వారు ‘ఫారం–ఏ,బి’లను నామినేషన్ల చివరి రోజైన 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా ఆర్‌ఓకు సమర్పించాలి. సదరు ఫారాలపై ఇంక్‌తో సైన్‌ చేసి ఉండాలి.
ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం–26 నోటరైజ్డ్‌ అఫిడవిట్‌లోని అన్ని కాలమ్‌లు భర్తీచేయాలి.  
నామినేషన్‌ పత్రంలో అభ్యర్థి తనపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను పార్ట్‌–3ఏలో తప్పనిసరిగా పేర్కొనాలి.
ఎన్‌పీడీసీఎల్‌ నుంచి విద్యుత్‌కు సంబంధించి, మున్సిపాలిటీ/పంచాయితీ నుంచి నీటికి సంబంధించి, ప్రభుత్వం కేటాయించిన వసతి గృహం(క్వార్టర్‌)లో ఉన్నట్లయితే గత 10 ఏళ్లుగా ఎలాంటి బకాయిలు లేనట్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
నామినేషన్‌ వేసే సమయంలో ఆర్‌ఓ ఎదుట భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ/శపథం తెలుగు లేదా ఆంగ్లంలో చేయాలి. ప్రతిజ్ఞ తనకు నచ్చిన దేవుడి పేరిట కానీ, మనస్సాక్షిగా కానీ చేయవచ్చు.
ఆర్‌ఓకు నమూనా (స్పెసిమెన్‌) సంతకాన్ని ఇవ్వాలి. అభ్యర్థి తరఫున ఎవరినైనా అనుమతించేందుకు అది ఉపకరిస్తుంది.
తెలుగులో అభ్యర్థి పేరు బ్యాలెట్‌ పేపర్‌లో ఎలా ముద్రించాలో పేపర్‌ మీద రాసివ్వాలి.  

ఆర్‌ఓ నుంచి ఈ ప్రతులు/ధ్రువీకరణలు తప్పనిసరిగా పొందాలి..
చెల్లించిన డిపాజిట్‌ మొత్తానికి రసీదు
స్క్రూటినీకి హాజరయ్యేందుకు నోటీసు
ఎన్నికల వ్యయాలను నమోదు చేసే రిజిస్టర్‌
కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, తదితరమైనవి ముద్రించేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 127–ఏ కింద సూచనలు
ప్రతిజ్ఞ/శపథం చేసినట్లు ధ్రువీకరణ
నామినేషన్‌ పత్రంలోని లోపాలు/ ఇంకా జతచేయాల్సిన పత్రాల సూచిక (చెక్‌ మెమో)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top