గుట్టు రట్టవుతుందనే బయటపెట్టట్లేదు...

No Infrastructure Facilities For Government Hospitals In Rangareddy - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ఆరోగ్య రాజధాని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ)లో దూసుకుపోతుంటే మన ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రం ఇంకా పాత పద్ధతులనే అనుసరిస్తున్నాయి. మందులు, వైద్య పరికరాల కొనుగోలు, ఇతర అభివృద్ధి పనుల్లో పారదర్శంగా వ్యవహరించాల్సిన ఆస్పత్రులు ఆయా అంశాల్లో ఎంతో గోప్యత పాటిస్తున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం కనీసం ఆస్పత్రి పేరుతో ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయలేని దుస్థితి. వైద్య విభాగాలు, నిపుణులు, సేవల వేళలు, ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్లు కంప్యూటర్‌లో పొందుపర్చేందుకు చర్యలు చేపట్టక పోవడం హాస్యస్పదం.

ఫలితంగా మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు మాత్రమే కాదు..వివిధ సేవలు, అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపుల్లోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ విభాగంలో ఎంత మంది వైద్యులు పని చేస్తున్నారు. ఎన్ని పడకలు ఉన్నాయి. ఏఏ వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. తదితర వివరాలు బయటికి తెలియడం లేదు. నగరంలో ఒక్క నిమ్స్‌ మినహా మరే ఇతర ఆస్పత్రికి ప్రత్యేక వెబ్‌సైట్‌ లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు.  

లోపించిన పారదర్శకత...  
ప్రతిష్టాత్మాక ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా ఉస్మానియా సహా సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వం ప్రసూతి వైద్యశాల, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల, ఫీవర్‌ ఆస్పత్రి, ఈఎన్‌టీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం, సనత్‌నగర్‌లోని ఛాతి ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. గాంధీ వైద్య కళాశాలకు అనుబంధంగా గాంధీ జనరల్‌ ఆస్పత్రి కొనసాగుతోంది. వీటిలో ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి మినహా ఇతర ఆస్ప త్రులేవీ ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఖాతా తెరవలేదు.

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు ఇటీవల వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినప్పటికీ..ఆస్పత్రి చరిత్ర వంటి సాధారణ అంశాలు మినహా ఓపీ, ఐపీ, సర్జరీలు, టెండర్లు, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చలేదు. ఆస్పత్రుల్లో ఆన్‌లైన్‌ వ్యవస్థ లేక పోవడంతో అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు మొదలు విలువైన వైద్యపరికరాలు, మందుల కొనుగోలు, ఉద్యోగుల నియామకాలు, శానిటేషన్, క్యాంటిన్, పార్కింగ్‌ వగైరా కాంట్రాక్టులు, చివరకు అత్యవసర పరిస్థితుల్లో కొనుగోలు చేసే మందులు తదితర అంశాల్లో పారదర్శకత లోపించి, అక్రమాలకు తావిస్తోంది. 

నిలోఫర్‌ను వీడని నిర్లక్ష్యపు జబ్బు... 
నిలోఫర్‌ చిన్నపిల్లల ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రుల పేరుతో వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినా..ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం లేదు. నిలోఫర్‌ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ మాజీ సూపరింటెండెంట్‌ పేరు, ఫొటోలు, పాత సమాచారమే కన్పిస్తుంది. ఒక్క వైద్య సేవలకు సంబంధించిన వివరాలు మాత్రమే కాదు ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర పరిపాలనాధికారుల పేర్లు, ఫొటోలు సైతం పాతవే దర్శనమిస్తుండటం గమనార్హం. మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు కూడా ఆఫ్‌లైన్‌లో చేపడుతుండటం విశేషం. ఆరోగ్యశ్రీ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల్లో భారీగా గోల్‌మాల్‌ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి, వైద్య సేవలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు అందులో పొందుపర్చి, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన ఉన్నతాధికారులే అక్రమా లకు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top