ఈసారి పాత ఫీజులేనా? 

No clarity on the appointment of chairman of the AFRC - Sakshi

ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ నియామకంపై లేని స్పష్టత

మెంబర్‌ కన్వీనర్‌ హోదాలో యాజమాన్యాలనుంచి దరఖాస్తుల స్వీకరణ

చైర్మన్‌ వస్తేనే కాలేజీల ప్రతిపాదనల పరిశీలన.. ఫీజుల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో 2019–20 విద్యా సంవత్సరం నుంచి 2021–22 వరకు వివిధ కోర్సులకు వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు ఇప్పట్లో అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలోనూ పాత ఫీజులే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫీజులను ఖరారు చేయాల్సిన ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌ నియామకంలో జరుగుతున్న జాప్యమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ ఫీజుల ఖరారు కోసం కాలేజీల రెండేళ్ల ఆదాయ వ్యయాలను, కొత్త ఫీజు ప్రతిపాదనలను ఏఎఫ్‌ఆర్‌సీ మెంబర్‌ సెక్రటరీ హోదాలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత విద్యా మండలి స్వీకరించింది. అయితే కాలేజీల వారీగా యాజమాన్యాలు సమర్పించిన ఆదాయ వ్యయాలు, వాటికి సంబంధించిన ఆడిట్‌ నివేదికలు, కొత్త ఫీజు ప్రతిపాదనలను పరిశీలించి కొత్త ఫీజును ఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌గా వ్యవహరించే హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో కొత్త చైర్మన్‌ నియామకంలో జాప్యం జరుగుతుండటంతో ప్రవేశా ల కౌన్సెలింగ్‌ ప్రారంభించేలోగా కొత్త ఫీజులను ఖరా రు చేసే అవకాశం కనిపించడం లేదు. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలో పాత ఫీజులనే అమలు చేసే అవకాశం ఉంది.  

ఎన్నికలే అడ్డంకి..: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా, డీఎడ్, ఎంటె క్, ఎం.ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజు లను ప్రతి మూడేళ్లకోసారి ఖరారు చేస్తారు. అలా ఖరారు చేసిన ఫీజులను వరుసగా మూడు విద్యా సంవత్సరాలపాటు అమలు చేస్తారు. ఇందుకోసం ఏఎఫ్‌ఆర్‌సీ దరఖాస్తులను స్వీకరించింది. అయితే ప్రభుత్వం కమిటీ చైర్మన్‌ నియామకం కోసం హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రతిపాదన పంపించాల్సి ఉంటుంది. ఆయన ముగ్గురు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జీల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. అందులో ఒకరిని ప్రభుత్వం ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌గా నియమించాల్సి ఉంటుంది. గతంలో నియమించిన చైర్మన్‌ పదవీకాలం గత అక్టోబర్‌తోనే ముగిసిపోయింది. దీంతో అప్పట్లోనే చైర్మన్‌ నియామకం చేపట్టాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో దానిపై ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో కమిటీకి మెంబర్‌ సెక్రటరీ నేతృత్వంలో దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రక్రియ కూడా గత నెలతోనే ముగిసిపోయింది. వివిధ కోర్సులను నిర్వహించే దాదాపు 1,350 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి.

ఇపుడు వాటి ఫీజులను ఖరారు చేయాలంటే ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ ఉండాల్సిందే. అప్పుడే ఆ ఫీజులకు చట్టబద్ధత. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలతో ప్రభుత్వం బిజీ అయ్యింది. ఈ పరిస్థితుల్లో చైర్మన్‌ నియామకం కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రతిపాదనలు పంపించాలంటే సీఎం ఆమోదం తప్పనిసరి. అయితే సీఎం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో ఆయన్ని కలవడం సాధ్యం కావడం లేదు. మరోవైపు ఈ నియామకానికి ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందా లేదా అన్న స్పష్టత కూడా తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యేవరకు చైర్మన్‌ నియామకం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు అయ్యాక ప్రభుత్వం చర్యలు చేపట్టినా నియామకానికి కనీసంగా 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

అప్పుడు చైర్మన్‌ వచ్చినా కాలేజీల వారీగా ప్రతిపాదనలను పరిశీలించి ఫీజులను ఖరారు చేసేందుకు కనీసంగా 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దానివల్ల ప్రవేశాలు ఆలస్యం అవుతాయి. సాధారణంగా జూన్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుంది. ఆలోగానే ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా లేదని ఉన్నతాధికారులే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి పాత ఫీజులనే ఖరారు చేసి, ఆపై విద్యా సంవత్సరానికి కొత్త ఫీజులను నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి చర్యలు చేపడితే కొత్త ఫీజుల నిర్ణయానికి అవకాశం ఉంటుందని, లేదంటే కుదరకపోవచ్చని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 2016లోనూ ఫీజుల ఖరారు సమయంలో ఆలస్యం కావడంతో అప్పట్లో ఇంజనీరింగ్, ఫార్మసీ మినహా మిగతా కోర్సులకు పాత ఫీజులనే ప్రభు త్వం కొనసాగించింది. ఇప్పు డు కూడా సాధ్యంకాకపోతే పాత ఫీజు లనే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top