ఫిర్‌ ఏక్‌బార్‌ మోదీ సర్కార్‌ 

Nirmala Seetharaman in the Hyderabad election campaign - Sakshi

దేశ సుస్థిర పురోగతికి నరేంద్రుడే సరైన వ్యక్తి 

హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో నిర్మలా సీతారామన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పాలనతో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని గాడిలో పెడుతున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్ఘాటించారు. దేశ రక్షణ, దేశంలో సుస్థిర, సమగ్ర ప్రగతి సాధ్యం కావాలంటే ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ నినాదాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం సైనిక్‌పురిలోని హెచ్‌ఎంటీ బేరింగ్స్‌ కమ్యూనిటీ హాలులో విశ్రాంత సైనికుల కుటుంబాలు, మేధావుల సదస్సులో.. సాయంత్రం హైటెక్‌ సిటీలోని బుట్ట కన్వెన్షన్‌లో తెలంగాణ ఫర్‌ మోదీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెషనల్స్‌ మీట్‌లో ఆమె పాల్గొని ప్రసంగించారు.

వాజ్‌పేయి సర్కారు దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లిందని.. తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ కూటమి దేశంలో ప్రజలకు పప్పుధాన్యాలు కూడా దొరకకుండా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. ‘పప్పుధాన్యాల గురించి మాట్లాడుకోవటం చిన్నవిషయంగా అనుకోవచ్చు. కానీ శాఖాహార ప్రొటీన్‌ అందించే వివిధ రకాల పప్పుధాన్యాల కోసం జనం హాహాకారాలు చేశారు. దాదాపు 80లక్షల టన్నుల పప్పు కొరత కారణంగా.. దిగుమతుల కోసం ఇతర దేశాలవైపు చూసే దుస్థితిని కాంగ్రెస్‌ సర్కారు తీసుకొచ్చింది. కానీ.. ఇప్పుడు ఒక్క పప్పు ధాన్యాలే కాదు, ఎన్నో నిత్యావసరాలకు మన దేశం స్వయం సమృద్ధిగా మారింది. ఇది మోదీ పాలన విధానాల ఘనత’ అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.  

శక్తివంతమైన భారత నిర్మాణంలో..  
ప్రపంచంలోనే మనం శక్తిమంతంగా మారేలా ఆయన చేస్తున్న కృషికి ప్రజలు మరోసారి బాసటగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ముంబై పేలుళ్లు జరిగినప్పుడు నాటి సర్కారు నిస్తేజంగా ఉండిపోయిందని, పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని సైన్యం ప్రకటించినా ప్రభుత్వం మిన్నకుండి పోయిందని ఆమె గుర్తుచేశారు. అదే పుల్వామాలో దాడి జరిగితే, సైన్యానికి మోదీ స్వేచ్ఛనిచ్చారని, ఫలితంగానే మన సైనికులు బాలాకోట్‌లో మెరుపుదాడి చేసి పాక్‌కు గట్టి హెచ్చరిక ఇవ్వటంతో ఆదేశం దిగొచ్చిందన్నారు. ముంబై దాడి తర్వాత నాటి ప్రభుత్వం ఇలాగే ప్రతిస్పందించి ఉంటే పుల్వామా ఘటన జరిగేదే కాదన్నారు.

శత్రుదేశానికి చిక్కిన మన పైలట్‌ను సగర్వంగా తీసుకురాగలగటం మోదీ విజయమన్న నిర్మల.. మన నేతలు కొందరు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను గొప్పవాడిగా కీర్తిస్తున్నారని మండిపడ్డారు. సరిహద్దుల్లో సైనికులు ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంటే.. వారిని అవమానించేలా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఆర్మీ చీఫ్‌ను ‘సడక్‌ కా గూండా’(వీధి రౌడీ) అని.. ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ను అబద్ధాల కోరని దూషించిన విషయాన్ని నిర్మలా సీతారామన్‌ గుర్తు చేశారు. ఎన్నో యుద్ధాల్లో మన సైనికుల సంస్మరణ కోసం మోదీ ప్రభుత్వం ‘జాతీయ యుద్ధ స్మారకం’ను సిద్ధం చేసి దేశభక్తిని చాటుకుందన్నారు. 

బైసన్‌ పోలో మైదానాన్ని అప్పగించొద్దు 
సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానంలో సచివాలయ నిర్మాణం సరికాదని, కిటకిటలాడుతున్న నగరంలో ఖాళీ ప్రదేశాలు అలాగే ఉండేలా చూడాలంటూ మాజీ సైనికుల కుటుంబాలు గట్టిగా డిమాండ్‌ చేశాయి. మంత్రి నిర్మాలా సీతారామన్‌ ప్రసంగం తర్వాత తమ సమస్యలను విన్నవించుకునేందుకు మాజీ సైనికుల కుటుంబాలకు అవకాశం ఇవ్వగా, అందరూ ముక్తకంఠంతో ఈ డిమాండును ఆమె ముందుంచారు. బైసన్‌ పోలో మైదానంలో సచివాలయ నిర్మాణ ఆలోచన ఏమాత్రం సహేతుకం కాదని, ఎట్టి పరిస్థితిలో కేంద్రప్రభుత్వం అందుకు అంగీకరించొద్దని.. నినాదాలు చేశారు. సికింద్రాబాద్‌ ఏఓసీలోకి సాధారణ ప్రజల రాకపోకలపై నియంత్రణ సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. 

జమ్మూకశ్మీర్, రామమందిరంపై కేసీఆర్‌ విధానమేంటి? 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ చెబుతున్న 16 సీట్లతో ఆయనేమన్నా ప్రధాని అయ్యేది ఉందా.. అని ప్రశ్నించారు. కేసీఆర్‌ చెబుతున్న ఫెడరల్‌ ఫ్రంట్‌కు దిక్కులేదని, ఆయనది కేవలం ఫ్యామిలీ ఫ్రంట్‌ అని ఎద్దేవా చేశారు. జమ్మూ, కశ్మీర్, అయోధ్య రామమందిరంపై కేసీఆర్‌ విధానమేమిటో చెప్పకుండా ఢిల్లీని ఎలా శాసిస్తారని ప్రశ్నించారు. తెలంగాణను పోరాడి సాధించుకుంది ఒక్క కుటుంబం పాలన కోసమా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కే ఓటేస్తే ఆ కుటుంబానికి ఊడిగం చేస్తారు తప్పితే ప్రజలకేమి చెయ్యరని ఆయన పేర్కొన్నారు.  

రాఫెల్‌ కలిసిరాలేదని.. డైరీ పేరుతో.. 
డోక్లాం వివాద సమయంలో ప్రధానితో చర్చించాల్సింది పోయి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌.. చైనా అంబాసిడర్‌తో చర్చలు జరిపి దేశం పరువుతీశారని నిర్మలా సీతారామన్‌ అన్నారు. రాఫెల్‌పైనా తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్‌.. దీనికి ప్రజలు స్పందించకపోవడంతో... కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప డైరీలపేరుతో అసత్య ఆరోపణలకు తెరదీసిందన్నారు. యడ్యూరప్ప చేతిరాతపై విచారణ సంస్థలు స్పష్టత ఇచ్చినా కాంగ్రెస్‌ అర్థంలేని ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రధాని పదవికి మోదీ తప్ప సరైన నేత ఎవరూ కనుచూపుమేరల్లో కనిపించడం లేదన్నారు. మన రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేయటంతోపాటు దేశాన్ని వేగంగా ప్రగతిపథంలో నడిపిస్తున్న మోదీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో ఏర్పాటవ్వాల్సిన అవసరాన్ని అంతా గుర్తించాలని కోరారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయటమంటే.. అది మోదీకి ఓటు వేయటంగా భావించాలన్నారు.

మాజీ సైనికులకు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉందని, వారికి సంబంధించిన అన్ని పెండింగ్‌ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రయత్నిస్తోందని, కోర్టు పరిధిలో ఉన్న అంశాలు కూడా వీలైనంత తొందరగా పరిష్కారమయ్యేలా చూస్తోందన్నారు. సైనికుల ఆత్మాభిమానాన్ని నిలుపుతున్న మోదీకి మాజీ సైనికుల కుటుంబాలు అండగా ఉండాలని కోరారు. రైతులు, ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలు వారి జీవితాల్లో వెలుగు నింపుతోందన్నారు. మాజీ సైనిక కుటుంబాలకు ఎయిమ్స్‌ తరహా ఆధునిక వసతులతో కూడిన 200 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రులు అందుబాటులోకి తెస్తున్నట్టు గుర్తుచేశారు. ప్రముఖ న్యాయవాది, బీజేపీ సీనియర్‌ నేత ఎమ్మెల్సీ రామచంద్రరావును మల్కాజిగిరి ఎంపీగా గెలిపించాలని ఆమె కోరారు. సైనిక్‌పురిలో జరిగిన కార్యక్రమంలో అభ్యర్థి రామచంద్రరావుతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, మల్లారెడ్డి పాల్గొన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top