తన్విత దత్తత కేసులో కొత్త ట్విస్ట్‌..!

 new twist in baby tanvitha adopted case - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, కొత్తగూడెం: ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన తన్విత దత్తత విషయం కొత్త మలుపు తిరిగింది. ఆడపిల్ల.. సాకలేమని అమ్ము కున్నందుకు కన్నతల్లిదండ్రులు,  చట్టబద్ధంగా దత్తత తీకోనందున పెంచిన తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తిత్వం వహించిన ఆర్.ఎం.పి. కూడా బాధ్యుడేనని తన్విత కేసులో పోలీసులు కోర్టుకు నివేదించారు. వివరాలివీ.. మహబుబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిస్టాపురం గ్రామానికి చెందిన మాలోతు భావు సింగ్, ఉమ దంపతులు తమ కూతురు తన్వితను రెండేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాజేంద్రప్రసాద్ స్వరూపలకు దత్తత ఇచ్చారు. భర్త తనకు తెలియకుండా దత్తత ఇచ్చాడని ఉమ గత నెలలో ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పోలీసులు ఈ కేసులో దర్యాప్తును చేపట్టి ఖమ్మంలోని శిశు గృహంలో ఉంచారు. ఈ క్రమంలో తల్లి ఉమ తనకే అప్పగించాలని, పెంచిన తల్లి తనకే ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. ఇదిలా ఉండగా తన్విత మహబూబాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించిందని, అక్కడే దత్తత తంతు జరిగిందని భద్రాద్రి జిల్లా పోలీసులు దర్యాప్తులో తెలపడంతో కేసును మహబూబాబాద్ జిల్లా పోలీసులకు అప్పగించారు. ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఇరువర్గాల వారిని పిలిపించి మాట్లాడారు. పోలీసులు కూడా ప్రైవేట్ ఆస్పత్రిలో విచారణ జరిపారు. చివరకు తన్విత కన్నతల్లి ఉమకు తెలిసే దత్తత వ్యవహారం జరిగిందని, దత్తత ఒప్పంద పత్రంలో ఉన్న సంతకం కన్నతల్లి ఉమదేనని నిర్ధారించారు.

బాగా చూసుకోవడం లేదనే
భావుసింగ్ , ఉమలకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందని లింగ నిర్ధారణ పరీక్షల్లో గ్రహించిన భావు సింగ్ ఆబార్షన్ కోసం ప్రయత్నించాడు. అది తల్లికి, బిడ్డకు ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. ఇదే సమయంలో ఆడపిల్ల కోసం ప్రయత్నిస్తున్నరాజేంద్రప్రసాద్ స్వరూపలకు వారి విషయం తెలిసింది. ఇందులో ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ మధ్యవర్తిత్వం వహించాడు. తన్విత జన్మించాక వారికి అప్పగించాలని ఒప్పంద పత్రం రాసుకున్నారు. దీనిపై పోలీసులు ఆర్‌ఎంపీ డాక్టర్‌తో పాటు భావు సింగ్ పై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఉమ కేసు వాపసు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. గుంటూరుకు చెందిన ఉన్నత కుటుంబానికి దత్తత ఇస్తున్నట్లు తనకు చెప్పారని.. కాని దత్తత తీసుకున్న వారు బాగా చూసుకోవడం లేదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఉమ వాంగ్మూలం ఇచ్చింది.

కోర్టు తీర్పు మేరకే అప్పగింత
దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు మహబూబాబాద్ కోర్టులో నివేదించారు. ఆడపిల్ల అని అమ్ముకున్నందుకు కన్న తల్లిదండ్రులు.. చట్టబద్ధంగా పాపను దత్తత తీసుకోనందున పెంచిన తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తిత్వం వహించిన ఆర్‌ఎంపీ కూడా శిక్షకు అర్హులేనన్న పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఖమ్మం గృహంలో ఉన్న బాలిక తన్వితను కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరికి అప్పగించమంటే వారికి అప్పగిస్తామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top