అతివలపై సైబర్‌ నేరాల ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

New Technology For Complaining About Harassments On Women - Sakshi

అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లపైనా ఫిర్యాదు చేయొచ్చు

ఠాణాలకు వెళ్లకుండానే బాధితులు నేరుగా కంప్లైంట్‌ చేసే చాన్స్‌

cybercrime.gov.inను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర హోంశాఖ  

సాక్షి, హైదరాబాద్‌ : మహిళలపై అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లు సహా వారిపై జరిగే సైబర్‌ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు లేదా ఫిర్యాదుదారులు పోలీసు స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారానే ఫిర్యాదు చేసేందుకు  cybercrime.gov.in వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేస్తే తమ పేరు బయటపడి పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధిత మహిళలు ఫిర్యాదులకు ముందుకు రావట్లేదని గుర్తించిన హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

సోషల్‌ మీడియా ద్వారా వచ్చే వేధింపులే కాకుండా గ్యాంగ్‌రేప్‌లు, అత్యాచారాలు, ఫొటోల మార్ఫింగ్, లైంగిక దూషణల సందేశాల వంటి వాటిపైనా ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సంఘటన జరిగిన ప్రాంతం, తేదీ, నిందితులు వివరాలు తెలిస్తే వారి పేర్లు, చిరునామాలు, తెలియకపోతే సోషల్‌ మీడియాలోని సంబంధిత నిందితుల ఖాతా పేర్లు, కంటెంట్, వాట్సాప్‌ మెసేజ్‌లు, మెయిల్స్, స్నాప్‌చాట్‌ వివరాలను వెబ్‌సైట్‌లోని రిపోర్టింగ్‌ ఆప్షన్‌ ద్వారా ఎంట్రీ చేయాలి. అలాగే బాధితులు ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తారో పేర్కొనాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా అశ్లీల వెబ్‌సైట్‌కు సంబంధించి కూడా ఫిర్యాదు చేయాల్సి వస్తే దానికి సంబంధించిన యూఆర్‌ఎల్‌ లింక్‌ను ఫిర్యాదుకు జతపరచవచ్చు. 

పర్యవేక్షణ, సహకారం... 
సైబర్‌ క్రైమ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయగానే సంబంధిత అధికారులు ఆ ఘటనకు సంబంధించిన రాష్ట్రంలోని పోలీస్‌ అధికారులు, సంబంధిత జిల్లా ఎస్పీకి సమాచారం అందిస్తారు. అంతేకాకుండా ఫిర్యాదుదారుల వివరాలు బయటకు తెలియకుండా చూసుకోవాలని సూచిస్తారు. సోషల్‌ మీడియా ద్వారా వేధింపులు జరిగితే సంబంధిత ఐపీ అడ్రస్, ఎక్కడి నుంచి, ఎవరు ఆపరేట్‌ చేస్తున్నారన్న విషయాలను సైతం ఈ విభాగం అధికారులు సంబంధిత పోలీసులకు మెయిల్‌ ద్వారా పంపిస్తారు.

ఫిర్యాదుదారులు వారు చేసిన ఫిర్యాదును ట్రాక్‌ చేసుకునే అవకాశం కూడా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇందుకోసం ఫిర్యాదుదారులు తమ పేరు, మొబైల్‌ నంబర్‌ను వెబ్‌సైట్‌లో పేర్కొనాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావడం ద్వారా ఫిర్యాదు పురోగతిని తెలుసుకోవచ్చు. పోలీస్‌ అధికారులు దర్యాప్తు నిమిత్తం సంబంధిత బాధితురాలు/బాధిత చిన్నారుల ఇంటికి వెళ్లి ఆధారాలు, వాంగ్మూలాలు సేకరించాల్సి ఉంటుంది. 

సైబర్‌ దోస్త్‌ సైతం..
దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాల నియంత్రణ, వాటి ద్వారా మోసపోకుండా ఉండేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సైబర్‌ దోస్త్‌ (@cyber dost) పేరుతో ట్విట్టర్‌ ఖాతాను సైతం ప్రారంభించారు. దీని ద్వారా అన్ని రాష్ట్రాల్లోని దర్యాప్తు విభాగాలకు, ప్రజలకు అవగాహన కల్పించడం, ఎదురయ్యే సమస్యలపై సూచనలు, సలహాలు అందిస్తున్నారు. నెటిజన్లు నేరుగా ఈ ట్విట్టర్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో అధికారులు స్పష్టం చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top