రండి..పేకాట ఆడుకోండి!

Neighbor state clubs bumper offer to the gamblers - Sakshi

ఉచిత విమానయానం

హైక్లాస్‌ భోజనం.. వసతి ఫ్రీ 

తరలింపునకు కమీషన్‌ ఏజెంట్లు

పేకాటరాయుళ్లకు పొరుగు రాష్ట్రాల క్లబ్‌లు బంపర్‌ ఆఫర్‌  

కోరుట్ల(జగిత్యాల జిల్లా): ‘రండి మా దగ్గర నిశ్చింతగా పేకాట ఆడుకోండి. విమాన చార్జీలు మేమే ఇస్తాం. హైక్లాస్‌ భోజన వసతి కల్పిస్తాం. 3 రోజుల పాటు మా దగ్గర హాయిగా పేకాట ఆడుకుంటూ ఉండొచ్చు. కేవలం రూ. 25–50 వేలు తెచ్చుకోండి’.. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన పేకాట రాయుళ్లకు పొరుగు రాష్ట్రాల క్లబ్‌లు ఇస్తున్న బంపర్‌ ఆఫర్‌. ఈ ప్రాంతం నుంచి పేకాటరాయుళ్లను పొరుగు రాష్ట్రాలకు తరలించేందుకు ఏకంగా కమీషన్‌ ఏజెంట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  

సాగని ఆటలు! 
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ 3 జిల్లాల్లో పోలీసులు నిత్యం పదుల సంఖ్యలో పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేస్తున్నారు. లక్షల్లో నగదు స్వాధీనం చేసుకుంటూ 10 నుంచి 20కి మించి కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో స్థానికంగా పేకాట ఆడేందుకు పేకాటరాయుళ్లు సుతరామూ ఇష్టపడటం లేదు. మూడు ముక్కలాటకు అలవాటుపడ్డ కొందరు తమ అడ్డాలను గ్రామశివారుల్లోని అటవీ ప్రాంతాలు, మామిడి తోటలను అడ్డాలుగా చేసుకుంటున్నారు. పోలీసులు ఆ స్థావరాలనూ కనిపెట్టి దాడులు చేస్తుండటంతో స్థానికంగా పేకాట ఆడి కేసులు పాలుకావడం కన్నా.. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లడానికి పేకాటరాయుళ్లు మొగ్గుచూపుతున్నారు. 

కమీషన్‌ ఏజెంట్ల హవా  
ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన పేకాటరాయుళ్లు మహారాష్ట్రలోని పేకాట క్లబ్‌ల కన్నా కర్ణాటకలోని క్లబ్‌లకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న క్లబ్‌లకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి నిత్యం 350–500 మంది పేకాట ఆడేందుకు వెళ్తున్న ట్లు తెలిసింది. ఈ మూడు జిల్లాలోని కీలక పట్టణాల్లో పొరుగు రాష్ట్రాలకు చెందిన క్లబ్‌ల నిర్వాహకులు కమీషన్‌లు ఇస్తూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. పేకాట ఆడేందుకు ఒకరిని బెంగళూరుకు తీసుకెళ్తే రూ.1000 నుంచి రూ.2,500 కమీషన్‌ ఇస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లే వారిని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు తీసుకెళ్లడానికి కొందరు అద్దెకార్ల డ్రైవర్లు ఉండటం.. వీరికి ఎంతో కొంత కమీషన్‌ ముట్టడం విశేషం.  

ఆట తప్ప అంతా ఫ్రీ 
పేకాటరాయుళ్లను బెంగళూరుకు తరలించే కమీషన్‌ ఏజెంట్లు పేకాటరాయుళ్లను హైదరాబాద్‌ వరకు కార్లలో ఫ్రీగా తరలిస్తున్నారు. అక్కడి నుంచి విమాన టికెట్లు బుక్‌చేసి బెంగళూరుకు పంపుతున్నారు. కొందరు ఏజెంట్లు పేకాటరాయుళ్లతోపాటే ఉండి బెంగళూరులోని పేకాట క్లబ్‌లకు తీసుకెళ్తున్నారు. పేకాటరాయుళ్లకు బెంగళూరులోని హైక్లాస్‌ లాడ్జీల్లో వసతి, ఖరీదైన భోజనం ఉచితంగా అందిస్తున్నారు. అక్కడి క్లబ్‌లలో ఉన్న హాలులో పది నుంచి పన్నెండు టేబుళ్లు ఏర్పాటు చేసి రమ్మీ, త్రీ కార్డ్స్‌ (మూడు ముక్కలు) ఆడిస్తున్నారు. ఒక్కో ఆటకు రూ.3,000–రూ.5,000 వరకు డబ్బులు పెట్టి ఆడాల్సి ఉంటుంది. ఒక్కో టేబుల్‌ నుంచి క్లబ్‌ నిర్వాహకులు ఒక్కో ఆటకు రూ.5 వేలు తీసుకుంటున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు అక్కడే ఉండి పేకాట ఆడుతున్న వ్యసనపరులు కొందరు జేబులు గుల్లచేసుకుని వస్తుండటం గమనార్హం. మొత్తంమీద పేకాట వ్యసనం ఇతర రాష్ట్రాల్లోని క్లబ్‌లకు లాభాల పంట పండిస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top