నివారణే మార్గం

నివారణే మార్గం - Sakshi

► గతంలో ఉమ్మడి జిల్లాలోని 17 మండలాల్లో ఎక్కువ ప్రభావం 


► తాజాగా విభాజ్య నల్లగొండలో 19 మండలాల్లో అధికం


► ఒక్క అడవిదేవులపల్లి మండలమే ఫ్లోరైడ్‌ రహితం... 


► మిగిలిన అన్ని చోట్లా ఎంతోకొంత..


► చండూరు, నార్కట్‌పల్లి, కట్టంగూరులో 9 పీపీఎం పైమాటే..


► ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్న కలెక్టర్‌


► డీఎఫ్‌ఎంసీ ఆధ్వర్యంలో వారంపాటు కార్యక్రమాలు


► నేడు 5కే రన్‌.. హాజరుకానున్న గౌరవ్‌ ఉప్పల్‌


 


చండూరు, కేతేపల్లి, మర్రిగూడ, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ, నార్కట్‌పల్లి, తుర్కపల్లిల్లో ఫ్లోరైడ్‌ పరిమాణం ఎక్కువగా ఉంది. నార్కట్‌పల్లి మండలం చౌటబాయి, గోపలాయ పల్లి, నార్కట్‌పల్లి ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ పరిమాణం 9.57 పీపీఎం నమోదైంది. ఇదే మండలంలోని ఎం.యెడవల్లిలో 5.89 పీపీఎం వరకు ఉంది. చండూరు మండలం ఉడతలపల్లి, బంగారిగడ్డ ఆవాస ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ పరిమాణం 6.44  పీపీఎం నుంచి 7.96 పీపీఎం వరకు ఉంది. పునాది ఈ ఫ్లోరైడ్‌ భూతమే. నేలతల్లి కడుపులో దాగి ఉండే ఓ మూలకం కలిగించిన నష్టాలు.. దీనివల్ల జిల్లా వాసులు పడ్డ కష్టాలు ఎంత చెప్పినా తరగనివే. ఇప్పటికీ ఈ భూతం వేధిస్తూనే ఉంది.


 


 


నల్గొండ : ఫ్లోరైడ్‌.. ఈ పదంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. లక్షలాది మందిని పట్టి పీడించిన, పీడిస్తోన్న ఈ భూతంతో జిల్లా వాసులు చేయని పోరాటం లేదు.. ఎక్కని గడప, దిగని గడపల్లేవు. ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రభావితం చేసే విధంగా 1996లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి 420 మంది ఫ్లోరైడ్‌ బాధితులు నామినేషన్లు వేసి జాతీయ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం కూడా చేశారు.


 


ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, జలసాధన సమితి వంటి సంస్థల ఆవిర్భావాలన్నింటికీ గతంలో తేలిన ప్రకారం ఉమ్మడి నల్లగొండ జాల్లావ్యాప్తంగా 59 మండలాల్లోని 1,108 హ్యాబిటేషన్లలో పది లక్షల మంది వరకు జనాభా ఈ ఫ్లోరైడ్‌ మహమ్మరిన బారిన పడిన వారే.  అంటే పాత నల్లగొండ జిల్లాలోని ప్రతి ముగ్గురి జనాభాలో ఒకరు ఈ ప్రభావానికి గురైన వారే. అందులో దాదాపు మూడు లక్షల మందికి ఫ్లోరైడ్‌ కారణంగా వచ్చే దంత సమస్యలు, ఎముకల వ్యాధులు ఉన్నాయి. అంటే ప్రతి పది మందిలో ఒకరికి ఫ్లోరోసిస్‌ కారణంగా ఆరోగ్య సమస్యలు  ఉన్నాయన్నమాట. ఈ స్థాయిలో ప్రభావితం చేసిన ఫ్లోరైడ్‌ను నిర్మూలించే పరిస్థితి లేదు.. నివారించడమే ఏకైక మార్గం. 


 


విభాజ్య నల్లగొండలో 19 మండలాల్లో..


ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌తో దశాబ్దాలుగా సహవాసం చేస్తోంది. మన నేలల్లోని రాతిపొరల్లో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉన్న కారణంగా ఆ భూమి నుంచి వచ్చే నీరు తాగినా, ఆ నీటితో వండిన, పండించిన ఆహార పదార్థాలు తిన్నా.. కాళ్లు, చేతులు వంకర్లు పోయిన దుస్థితి. ఫ్లోరైడ్‌ బాధితులను మంచాలకు కట్టేసి తల్లిదండ్రులు కూలీకి వెళ్లిన నిస్సహాయ స్థితి మనది. గతంలో అంత తీవ్రంగా లేకపోయినా.. ఇప్పటికీ మన జిల్లాలో ఫ్లోరైడ్‌ ఆనవాళ్లు ఉన్నాయి. గతంలో నిర్వహించిన సర్వేల్లో ఉమ్మడి జిల్లాలోని 17 మండలాల్లో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉందని తేలింది. అంటే మూడు కన్నా ఎక్కువ పీపీఎంలలో ఫ్లోరిన్‌ ఉండేదన్నమాట.


 


అంతకన్నా తక్కువగా 31 మండలాల్లో సమస్య ఉండగా.. కేవలం 11 మండలాలు మాత్రం ఫ్లోరైడ్‌ రహిత మండలాలుగా ఉండేవి. ఇటీవల జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత నల్లగొండ జిల్లాలోని 31 మండలాల్లో సర్వే నిర్వహించారు. ఇందులో 19 మండలాల పరిధిలో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉందని తేలింది. చండూరు, నార్కట్‌పల్లి, కట్టంగూరు మండలాల్లో అయితే తొమ్మిది కన్నా ఎక్కువ పీపీఎంలలో ఫ్లోరైడ్‌ ఉంది. మిగిలిన 11 మండలాల్లో కూడా ఫ్లోరైడ్‌ సమస్య ఉండగా.. కేవలం అడవిదేవులపల్లి మండలం మాత్రమే ఫ్లోరైడ్‌ రహిత మండలంగా తేలింది. 


 


కలెక్టర్‌ ప్రత్యేక నజర్‌


ఫ్లోరైడ్‌ భూతం జిల్లాను దశాబ్దాలుగా పట్టిపీడిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి ఉద్యమాలు జరిగినా పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఈ భూతాన్ని తరిమికొట్టేందుకు పకడ్బందీ ప్రణాళికలు లేకుండా తూతూమంత్రంగా కార్యక్రమాలు నిర్వహించేవారు. కేవలం రక్షిత మంచినీటిని తాపితే ఫ్లోరైడ్‌ను నిర్మూలించవచ్చన్న ఆలోచనలో పాలకులు ఉండేవారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం నల్లగొండ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఫ్లోరైడ్‌ నివారణకు నడుం బిగించారు.  తాను జిల్లాకు వచ్చిననాడే ఫ్లోరైడ్‌పై యుద్ధం చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగా ఆయన ఇప్పటివరకు పలు కార్యక్రమాలు చేపట్టారు. 


 


24 శాఖలతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఫ్లోరైడ్‌ మానిటరింగ్‌ సెంటర్‌ (డీఎఫ్‌ఎంసీ) ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు దీనిపై అవగాహన సైతం కల్పించారు. అదేవిధంగా.. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా జిల్లా ఫ్లోరోసిస్‌ సమన్వయ కమిటీ (డీఎఫ్‌ఎంసీ) ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల 14 నుంచి 20వరకు దాదాపు 20 కళాశాలల్లోని విద్యార్థులకు యూనిసెఫ్‌ సహకారంతో ఫ్లోరైడ్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. విద్యార్థుల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా బుధవారం నల్లగొండ జిల్లాకేంద్రంలో 5కే రన్‌ నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా కలెక్టర్‌తోపాటు దాదాపు 1000 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. 


 


ఫ్లోరైడ్‌పై పోరులో భాగస్వాములవుతున్న శాఖలు..


ఆర్‌డబ్ల్యూఎస్, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్, వైద్య శాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖలు, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ, పశుసంవర్థక శాఖ, ఉద్యాన శాఖలతో పాటు యూనిసెఫ్, ఆర్డీఓలు, కలెక్టర్, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన జిల్లా ఫ్లోరైడ్‌ నియంత్రణ కమిటీ (డీఎఫ్‌సీసీ) కూడా బాధ్యతలు పంచుకుంటున్నాయి. 


 


ఫ్లోరోసిస్‌ వ్యాధులు... రకాలు


►∙ఎముకల ఫ్లోరోసిస్‌ : ఈ వ్యాధి అన్ని వయసుల వారికి వస్తుంది. ఎముకలు నొప్పి చేయడం, కీళ్లు పట్టుకుపోవడం, వెన్నెముక ఎముకలు బిగుసుకుపోవడం ఈ వ్యాధి లక్షణాలు.


►∙దంత ఫ్లోరోసిస్‌: ఈ వ్యాధి సోకిన వారి పళ్లు పసుపు, గోధుమరంగు, నలుపు రంగులోనికి మారతాయి. పళ్లు చారలుగా కనిపిస్తాయి. 


 


ముఖ్యాంశాలు


►∙ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న నీటిని తాగడం వల్ల ఫ్లోరోసిస్‌ వ్యాధి వస్తుంది. చికిత్స తీసుకోకుండా వదిలేస్తే దంత సంబంధిత సమస్యలతో పాటు అవిటితనాన్ని కలుగజేస్తుంది. 


►∙ఆయా ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతను బట్టి నీటిలో 0.50 నుంచి 1.5 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) వరకు ఫ్లోరైడ్‌ ఉండవచ్చు. భారతదేశంలోని 19 రాష్ట్రాలలో ఫ్లోరోసిస్‌ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోనే ఫ్లోరోసిస్‌ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నది మన నల్లగొండ జిల్లాలోనే. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో కూడా ఈ వ్యాధి ఎక్కువగానే ఉంది. 



►ఫ్లోరైడ్‌ అధికంగా ఉండే పదార్థాలు భూగర్భ నీరు, టీ కషాయం, బ్లాక్‌సాల్ట్, సుపారి, సోడియం, ఫ్లోరైడ్‌ బిళ్లలు, పారిశ్రామిక వ్యర్థాలు.


∙పెద్దవయసున్న వారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, హదయ సంబంధిత జబ్బులున్న రోగులు, కిడ్నీ సమస్యలున్న వారికి ఫ్లోరోసిస్‌ సులువుగా సంక్రమిస్తుంది. 


 


►∙ఫ్లోరోసిస్‌ రాకుండా ఉండాలంటే ఫ్లోరైడ్‌ ఉన్న నీటిని తాగొద్దు.. ఆహారాన్ని తీసుకోకూడదు. బ్లాక్‌టీ, సుపారి, బ్లాక్‌సాల్ట్‌ వంటి వాటితో తయారైన పదార్థాలు, పొగాకు నమలడం, ఫ్లోరైడ్‌ ఉండే టూత్‌పేస్టులు, నోటిని శుభ్రపరిచే ద్రావకాలు తీసుకోకూడదు. ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో వంటలు చేసేందుకు అల్యూమినియం పాత్రలు ఉపయోగించకూడదు. 


 


ఫ్లోరోసిస్‌ నివారణ... నియంత్రణ చర్యలు


►∙ఫ్లోరైడ్‌ 0.5–1.5 పీపీఎం ఉన్న రక్షిత మంచినీటిని మాత్రమే తాగాలి. 


∙విటమిన్‌ ‘సీ, ఈ ఉన్న పదార్థాలతోపాటు కాల్షియం, కూరగాయలు, పండ్లు వంటి జీవక్రియ రక్షకాల ద్వారా ఈ వ్యాధి రాకుండా నియంత్రించవచ్చు. 


►∙ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, జున్ను, బెల్లం, పచ్చటి ఆకుకూరలు, జీలకర్ర, మునగకాయలు తీసుకుంటే మంచిది. 


►∙మెగ్నీషియం కోసం నువ్వులు, జొన్నలు, జీలకర్ర, మునగకాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. ∙ఉసిరి, జామ, నారింజ, నిమ్మ, టమాటోల్లో విటమిన్‌–సీ ఉంటుంది. 


►∙వెల్లుల్లి, అల్లం, ఉల్లి, క్యారట్, బొప్పాయి, స్వీట్‌పొటాటో (ఎర్రగడ్డ)లను జీవక్రియ రక్షకాలని అంటారు. ఈ పదార్థాలను తీసుకోవడం ద్వారా ఫ్లోరోసిస్‌ వ్యాధి రాకుండా నియంత్రించవచ్చు. 


 


ఆర్థిక సాయమందించేందుకు.. 


జిల్లాలో ఫ్లోరైడ్‌ తాజా పరిస్థితిని తెలుసుకునేందుకుగాను 31 మండలాల్లోని దాదాపు 10 వేల నుంచి 12 వేల నీటివనరులను పరీక్షిం చాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడ.. ఏం చేయాలన్న దానిపై పూర్తిస్థాయి కార్యాచరణ రూపొం దిస్తాం. ఫ్లోరోసిస్‌ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడంతోపాటు ఆర్థిక సాయం అందించేలా ముందుకు సాగుతున్నాం.  వ్యాధిగ్రస్తులకు రుణం ఇప్పించి.. స్వయం ఉపాధి కల్పించాలనే ఆలోచన చేస్తున్నాం. కార్పొరేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులతో మాట్లాడి వారి ఇంటి వద్దే వైద్య చికిత్సలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. -డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, కలెక్టర్‌


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top