నాగార్జున సాగరం.. పర్యాటకుల స్వర్గధామం

Nagarjuna Sagar As A Tourism Spot - Sakshi

సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్న జలాశయం

జలాశయంలో లాంచీ ప్రయాణం ఓ మదురాభూతి

ఆధ్యాత్మికతను చాటే బౌద్ధ స్థూపం, నాగార్జున కొండ

సాక్షి, నాగార్జునసాగర్‌: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ పర్యాటకులకు స్వర్గదామంగా విరాజిల్లుతోంది. సందర్శకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, విజ్ఞానాన్ని పంచుతోంది. ఎత్తయిన గుట్టల మధ్య పచ్చని అందమైన అడవులు.. జలాశయతీరంలో హిల్‌కాలనీలో 175 ఎకరాల్లో నిర్మిస్తున్న శ్రీపర్వతారామంలో ప్రపంచంలోని అన్ని బౌద్ధరామాలకు సంబంధించిన నమూనాలు స్థూపాలు, చైత్యాలు, దక్షిణ భారతదేశంలో ఎత్తయిన బౌద్ధ మహాస్థూపం, బుద్ధుడి చరిత్ర ఈ ఆరామాన్ని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జునకొండ, సాగర్‌జలాశయం అందాలు, స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మాసనరీ(రాతికట్టడం) డ్యాం, విద్యుదుత్పాదన కేంద్రాలు ఉన్నాయి. డ్యాం క్రస్ట్‌ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ జల సవ్వడులు 560 అడుగుల పైనుంచి దిగువకు దుముకుతూ చేసే జల సవ్వడి, విన్యాసాలు ప్రతి సందర్శకుని మనోఃఫలకంపై అట్టే నిలిచిపోతాయి.

బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జునకొండ..
బౌద్ధం పరిఢవిలిన్ల నాగార్జునకొండకు వెళ్లేందుకు జలాశయంలో లాంచీ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. లాంచీ టికెట్‌ ధర పెద్దలకు రూ.180, పిల్లలకు రూ.120 ఉంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన మ్యూజియంలో రాతియుగం నాటి నాగరికతతో పాటు బౌద్ధమతానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. సింహల విహారంలో ఉన్న  ఎత్తయిన బుద్ధుడి విగ్రహం ఆనాటి నాగరికతను తెలియజేస్తుంది.

తీపిగుర్తుల అనుపు..
రైట్‌బ్యాంక్‌ నుంచి మాచర్లకు వెళ్లేరోడ్డులో 8కిలోమీటర్లు వెళితే అనుపు వస్తుంది. ఆనాడు ఆచార్య నాగార్జునుడు నడిపిన విశ్వవిద్యాలయం ఆనావాళ్లు, నేటికీ చెక్కు చెదరని రంగస్థలం తదితర ప్రాంతాలు చూడవచ్చు.

కనువిందు చేసే ఎత్తిపోతల..
హిల్‌కాలనీ నుంచి 14కిలోమీటర్లు మాచర్ల రోడ్డులో వెళ్తే ఎత్తిపోతల వస్తోంది. ఇది చూసేందుకు టికెట్‌ ధర రూ.20 ఉంటుంది.70అడుగుల ఎత్తునుంచి నీరు దిగువ లోయలోకి పడుతుంటాయి. ఆ ప్రాంతమంతా చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

బస చేసేందుకు విజయవిహార్‌..
సాగర్‌లో బస చేసేందుకుగాను తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహించే విజయవిహార్‌ అతిథి గృహం ఉంది. ఐదు నక్షత్రాల హోటల్‌ను తలపించే సౌకర్యాలు ఉంటాయి. ఇందులో గదులు ముందస్తుగానే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. సోమవారం నుంచి గురువారం వరకు ఒకరేటు, శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఒక రకమైన రేట్లు ఉంటాయి. స్టాండర్డ్‌ గదులు 20 ఉండగా అద్దె జీఎస్‌టీతో కలిపి రూ1,568, వీకెండ్‌లో రూ.2,688 ఉంటుంది. డీలక్స్‌ గదులు 8 ఉండగా అద్దె రూ.2,094 వీకెండ్‌లోరూ.3,505 ఉంటుంది. షూట్‌లు 6 ఉండగా అద్దె రూ.2,950, వీకెండ్‌లో రూ.4,368 ఉంటుంది. సమావేశాలు వినియోగించుకునేందుకు బోర్డు రూమ్‌ ఉంటుంది. 4గంటలకు రూ.4,130 అద్దె 18 శా>తం జీఎస్టీ ఉంటుంది. వివరాలకు ఫోన్‌  08680 277362, 08680 277363 నెంబర్లకు ఫోన్‌ చేయ వచ్చు.

సాగర్‌ రావడం ఇలా..
నాగార్జునసాగర్‌ హైదరాబాద్‌కు 145 కిలోమీటర్ల  దూరంలో ఉంటుంది. నల్లగొండకు 60కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి మాచర్ల, దేవరకొండ డిపో బస్సులు వచ్చి వెళ్తుంటాయి. అలాగే ఆంధ్రా వైపు వెళ్లే బస్సులు సాగర్‌ మీదుగానే వెళ్తాయి. నల్లగొండ నుంచి గంటగంటకు బస్సులు ఉంటాయి.

ఇతర కాటేజీలు..
ఇవేగాక పర్యాటక సంస్థ నుంచి అద్దెకు తీసుకుని నడుపుతున్న సిద్ధార్థ హోటల్‌లో గదులు ఉన్నాయి. 6 కాటేజీలు ఉండగా ఒక్కొక్క కాటేజీకి అద్దె రూ.2,000 ఉంటుం ది. వివరాలకు 96408 83535 ఫోన్‌ చేయవచ్చు. రైట్‌బ్యాంకులో జలాశయతీరంలో సాగర మాతా సరోవర్‌ ఉంటుంది. ఇక్కడ 40గదులు ఉంటాయి. ఏసీ, నాన్‌ ఏసీ గదులున్నాయి. భోజన సౌకర్యం ఉంటుంది. అద్దె నాన్‌ ఏసీ రూ.1000, ఉండగా.. ఏసీ రూ.1,680 ఉంటుంది. వివరాలకు 08642 242429, 96661 33142లను సంప్రదించవచ్చు.
జలాశయతీరంలో నిర్మిస్తున్న  శ్రీపర్వతారామం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top