ముగింపుకొచ్చిన సాగర్‌ ఆధునీకరణ

Nagarjuna Sagar Modernization - Sakshi

రాష్ట్రం పరిధిలో 90 శాతం పనులు పూర్తి

మిగతా పనులు వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలని కేంద్రం గడువు  

ఆధునీకరణ ఫలితంగా సాగర్‌ నుంచి పాలేరుకు త్వరగా నీరు  

రాష్ట్రంలో ఈ రబీలోనే అందనున్న ప్రయోజనాలు 

2008లో వైఎస్‌ హయాంలో పనులు ప్రారంభం  

సాక్షి, హైదరాబాద్‌ :  చివరి ఆయకట్టు వరకూ నీరందించే లక్ష్యంతో పదేళ్ల కిందట ప్రపంచబ్యాంక్‌ నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్‌ ఆధునీకరణ పనులు ఎట్టకేలకు ముగింపు దశకొచ్చాయి. ఆధునీకరణ పనుల్లో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం చేయాల్సిన పనుల్లో 90 శాతం పూర్తవగా, మిగతా పనులను వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించింది. ప్రస్తుతం పూర్తయిన ఆధునీకరణ పనులతో ప్రాజెక్టు కింద గ్యాప్‌ ఆయకట్టు 25 శాతం నుంచి 5 శాతానికి తగ్గనుందని నీటి పారుదల వర్గాలు వెల్లడిస్తున్నాయి.  

పదేళ్లకు ఫలితాలు..
కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌కు వచ్చిన జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రాజెక్టు కింద మొత్తంగా 22.10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని దివంగత సీఎం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి భావించారు. ఇదే లక్ష్యంతో సాగర్‌ ఆధునీకరణ పనులకు 2008లో శ్రీకారం చుట్టారు. రూ.4,444.41 కోట్ల అంచనాలతో పనులను ప్రారంభించారు. ఇందులో వరల్డ్‌ బ్యాంకు నుంచి 48 శాతం నిధులు అందనుండగా, మిగతా 52 శాతం నిధులను రాష్ట్రం సమకూర్చాల్సి ఉంటుంది.

కాలువలు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలను ఆధునీకరించడం ద్వారా సుస్థిర పద్ధతిలో సాగునీటి విడుదలను మెరుగు పరచడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, వ్యవస్థాగత సామర్థ్యాన్ని పటిష్టపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పనుల వ్యయంలో తెలంగాణ వాటా కింద రూ.2,100 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ వాటా కింద రూ.2,344 కోట్లు కేటాయించారు. తెలంగాణ పరిధిలో ఎడమ కాలువ, డిస్ట్రిబ్యూటరీల ఆధునీకరణ పనులు రూ.1,838.40 కోట్ల మేర అంటే దాదాపు 90 శాతం వరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది.

మిగతా 10 శాతం పనులను వచ్చే జూలై నాటికి పూర్తి చేస్తామని ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం పూర్తయిన పనుల ప్రయోజనాలు ఈ ఏడాది రబీ నుంచే అందనున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పరిధిలో సాగర్‌కింద 6,40,814 ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, ఇందులో నీరందని ఆయకట్టు 1.64 లక్షల ఎకరాల మేర ఉంది. ప్రస్తుతం ఆధునీకరణ పనులతో ఈ గ్యాప్‌ ఆయకట్టు 33 వేలకు తగ్గే అవకాశం ఉంది. ఈ పనులతో సాగర్‌ నుంచి పాలేరు రిజర్వాయర్‌కు నీరు చేరుకునేందుకు పట్టే సమయం 72 గంటల నుంచి 48 గంటలకు తగ్గనుంది. ఇక 31.5 కిలోమీటర్ల మధిర బ్రాంచి కాల్వ పరిధిలో 14.5 కిలోమీటర్ల మేర లైనింగ్‌ చేయడంతో ఆ కాల్వ కింద 58,895 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే వెసులుబాటు లభించనుంది.  

పనుల సాగదీతతో ఏపీకి నష్టం..
విదేశీ ఆర్థిక సహాయం(ఈఏపీ)తో చేపట్టిన ప్రాజెక్టుల పనులను కేంద్ర ఆర్థిక శాఖ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ), ప్రపంచ బ్యాంకు ఇటీవల సమీక్షించాయి. ఇందులో భాగంగా నాగార్జునసాగర్‌ ఆధునీకరణ పనులపై సమీక్షించిన ప్రపంచ బ్యాంకు, డీఈఏ.. 2009 నుంచి ఇప్పటి వరకు డాలర్‌తో రూపాయి మారక విలువ మార్పుల వల్ల అదనంగా రూ.1,500 కోట్ల మేర నిధులు ఇచ్చేందుకు అంగీకరించాయి.

ఇందులో తెలంగాణ వాటా కింద రూ.500 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ వాటా కింద రూ.1,000 కోట్లు వస్తాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో నాగార్జునసాగర్‌ ఆధునీకరణ పనుల్లో ప్రగతి లేకపోవడంపై డీఈఏ, ప్రపంచ బ్యాంకు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలని ఆ రాష్ట్ర సర్కార్‌ చేసిన ప్రతిపాదనను ప్రపంచ బ్యాంకు తోసిపుచ్చింది. 2018 జూలైలోగా పూర్తి చేసిన పనులకు మాత్రమే నిధులు ఇస్తామని తేల్చి చెప్పింది. దీనివల్ల రూ.1,000 కోట్లకు పైగా నిధులను ఏపీ ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top