113 మందిపై అనర్హత వేటు 

Municipal elections updates In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చిలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో వార్డుకు ఎన్నికయ్యే సభ్యుడికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. వార్డులో వ్యయ పరిమితి రూ.లక్షే. దీనికి సంబంధించి ఫలితాల్లోపే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని ఎన్నికల కమిషన్‌కు అందజేయాలి. గెలిచిన సభ్యుల నుంచి కమిషన్‌ ఖర్చుల వివరాలు సేకరిస్తుంది. అయితే ఓడిన సభ్యులు కూడా వ్యయ పరిమితిని సమర్పించాల్సి ఉంటుంది. దీనికి ఎన్నికల కమిషన్‌ ఆయా సభ్యులకు నోటీసులు జారీ చేస్తుంది. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన పలువురు సభ్యులకు దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో వ్యయ పరిమితిని సమర్పించడంలో విఫలమయ్యారు. దీంతో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో వందలాది మంది అభ్యర్థులపై అనర్హత వేటు పడింది.

స్వతంత్ర అభ్యర్థులే అధికం..
సాధారణంగా ఇందులో ప్రధాన పార్టీలు కాకుండా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులే అధికంగా ఉండటం గమనార్హం. సాధారణంగా ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఆయా పార్టీల నుంచి వ్యయ వివరాలు సమర్పించే విషయంలో తగు సూచనలు, సలహాలు జారీ చేసే సీనియర్‌ నాయకులు ఉండటంతో వారు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయినా కొంతమంది ప్రధాన పార్టీ సభ్యులు కూడా వ్యయ వివరాలు సమర్పించడంలో విఫలమై డిస్‌ క్వాలిఫై కావడం గమనార్హం. కొంతమంది ఓటమి చెందడంతో ఖర్చులను సమర్పించకపోయినా ఏమి కాదులే అనుకోవడం, మరికొంత మంది రిజర్వేషన్లు అనుకూలించక తమ కుటుంబ సభ్యుల్లో ఒకరి పేరు మీదా పోటీ చేసి ఖర్చు వివరాలను సమర్పించకపోయినా పోయేదేమి లేదన్న రీతిలో వ్యవహరించడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది.

అధిక వ్యయం చేయడం, ఇతరులు దానిపై ఫిర్యాదు చేయడం వంటి కారణంగా కూడా కొంతమంది తమ వ్యయాన్ని ఎన్నికల కమిషన్‌కు సమర్పించలేకపోయారు. అదే సమయంలో సరైన అవగాహన లేక వ్యయం సమర్పించడంలో విఫలమై.. ఇప్పుడు మళ్లీ పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నా ఎన్నికల కమిషన్‌ నుంచి డిస్‌ క్వాలిఫై చేశారనే విషయం తెలిసి ఇప్పుడు మనోవేదనకు గురవుతున్నారు. ప్రధానంగా గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓట్లు సాధించిన వారు ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ తెచ్చుకొని బరిలోకి దిగాలన్న ఆశలపై ఎన్నికల కమిషన్‌ నీళ్లు చల్లినట్టయింది. 

2020 వరకు అనర్హత..
ఎన్నికల ఖర్చులు సమర్పించకపోవడంతో రాష్ట్రంలో పుర ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు పలుమార్లు ఎన్నికల కమిషన్‌ అప్పట్లోనే నోటీసు జారీ చేసింది. వారు వ్యయ వివరాలు సమర్పించడంలో విఫలం కావడంతో మూడు సంవత్సరాల పాటు డిస్‌ కా>్వలిఫై చేస్తూ గత 2017 జనవరి 16న గెజిట్‌ నం.02 జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు పోటీ చేసిన అభ్యర్థుల్లో డిస్‌ క్వాలిఫై పరంగా డిసెంబర్‌ 2019 నుంచి మొదలుకొని డిసెంబర్‌ 2020 వరకు ఉండగా ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 2020 ఆగస్టు 16 వరకు ఉండటంతో వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఈ లెక్కన మున్సిపాలిటీ ఎన్నికలు ఇప్పట్లో జరిగితే వీరు పోటీ చేసే అవకాశమే లేదు. 

వార్డుల వారీగా వేటు పడ్డ వారి సంఖ్య
ఒకటో వార్డు నుంచి 6 గురు, 2వ వార్డు నుంచి నలుగురు, 3వ వార్డు నుంచి నలుగురు, 4వ వార్డు నుంచి నలుగురు, 6వ వార్డు నుంచి ఇద్దరు, 7వ వార్డు నుంచి ఇద్దరు, 9వ వార్డు నుంచి ఐదుగురు, 10వ వార్డు నుంచి ఇద్దరు, 11వ వార్డు నుంచి ఒకరు, 12వ వార్డు నుంచి ఆరుగురు, 13వ వార్డు నుంచి ముగ్గురు, 14వ వార్డు నుంచి ముగ్గురు, 15వ వార్డు నుంచి ఒకరు, 16వ వార్డు నుంచి ముగ్గురు, 17వ వార్డు నుంచి ఒకరు, 18వ వార్డు నుంచి ముగ్గురు, 19వ వార్డు నుంచి ఇద్దరు, 20వ వార్డు నుంచి ఒకరు, 21వ వార్డు నుంచి ఆరుగురు, 22వ వార్డు నుంచి తొమ్మిది గురు, 23వ వార్డు నుంచి ముగ్గురు, 24వ వార్డు నుంచి నలుగురు, 25వ వార్డు నుంచి ముగ్గురు, 26వ వార్డు నుంచి ఆరుగురు, 27వ వార్డు నుంచి ఐదుగురు, 28వ వార్డు నుంచి నలుగురు, 29వ వార్డు నుంచి ఇద్దరు, 30 వార్డు నుంచి ఇద్దరు, 31 నుంచి ముగ్గురు, 32వ వార్డు నుంచి ముగ్గురు. 33వ వార్డు నుంచి నలుగురు, 35వ వార్డు నుంచి ఇద్దరు, 36వ వార్డు నుంచి ముగ్గురు ఉన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top