మున్సి‘పోల్స్‌’కు సన్నద్ధం

Municipal Elections In Telangana - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుందనే ప్రచారం జరగడంతోపాటు అధికారులకు కూడా సమాచారం ఉండడంతో మున్సిపల్‌ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో కీలక ఘట్టమైన వార్డుల విభజన పూర్తి కాగా, ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తదుపరి ఏర్పాట్లు చేసేందుకు షెడ్యూల్‌ విడుదలకు సమయం పట్టే అవకాశం ఉండడంతో మిగతా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పనులు చేపట్టేందుకు అధికారులు రెడీ అయ్యారు. అయితే వార్డుల వారీగా ఓటరు జాబితా తయారీ, బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల కేటాయింపు.. తదితరావి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకదాని తర్వాత మరొకటి చేపట్టనున్నారు. 

త్వరలో ఓటరు జాబితా.. 
ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా ఆయా మున్సిపాలిటీలకు ఓటర్ల జాబితాను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఎస్‌ఈసీ నుంచి ఆయా మున్సిపాలిటీలకు ఓటరు జాబితా త్వరలో అందిన వెంటనే బల్దియాకు అధికారులు వార్డుల వారీగా ఓటర్లను విభజన చేస్తారు. వార్డుల భౌగోళిక స్వరూపం,

సరిహద్దులను దృష్టిలో              
పెట్టుకొని ఓటరు జాబితా తయారు చేస్తారు. ఆ జాబితా ప్రకారమే ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన చేపడుతారు. అనంతరం బీసీ ఓటర్లను లెక్కగడతారు. అప్పుడు ఏ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు.. వర్గాల వారీగా ఓటర్లు ఎంత మంది.. బీసీ ఓటర్లు ఎందరున్నారు.. అనే వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. అయితే ముందుగా గణనకు సంబంధించి ప్రభుత్వం నుంచి షెడ్యూల్‌ జారీ కావాల్సి ఉంది. దాని ప్రకారం ఈ ప్రాసెస్‌ చేపట్టి ఎన్నికలకు ముందు చేపట్టే రిజర్వేషన్ల ప్రక్రియకు సిద్ధంగా ఉంచుతారు.

కొత్త చట్టం ప్రకారమే.. 
గ్రామాల విలీనంతో బల్దియా ఓటర్ల సంఖ్య గతం కంటే పెరిగే అవకాశం ఉంది. ఇటీవల విడుదలైన సాధారణ ఓటర్ల తుది జాబితా ప్రకారం ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 2,25,830 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం బల్దియా అధికారుల వద్ద ఉన్న జాబితా ప్రకారం చూస్తే మున్సిపల్‌ పరిధిలో 1,21,704 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఎస్‌ఈసీ నుంచి ప్రస్తుత ఓటరు జాబితా అందితేనే బల్దియా పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారనే విషయం చెప్పొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగనున్న బల్దియా సాధారణ ఎన్నికల్లో రోస్టర్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అమలు చేయనున్నారు. ఓటర్ల గణనన పూర్తి అయిన వెంటనే మున్సిపల్‌ వార్డు, చైర్‌పర్సన్‌ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ జనాభా ధామాషా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మున్సిపాలిటీలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా, ఎస్సీ, ఎస్టీ కోటా పోగా, మిగిలిన స్థానాలను బీసీలకు కేటాయిస్తారు. అయితే చైర్‌పర్సన్‌ రిజర్వేషన్‌ ప్రభుత్వం ప్రకటించనుండగా, వార్డుల రిజర్వేషన్లు కలెక్టర్‌ ఆమోదం తెలిపి ప్రకటించనున్నారు. ఇందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నా.. అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. 

ఆర్నెళ్లుగా ఎదురుచూపులు 
ఈసారి జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కొన్ని విచిత్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. శివారు గ్రామాలు విలీనం కావడం, కొత్త వార్డులు ఏర్పడడం, వార్డు సంఖ్య పెరగడంతో పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శివారు గ్రామాలను కలుపుకొని కొత్తగా ఏర్పడిన వార్డులపై ఆసక్తి పెరగగా, కొత్తగా ఏర్పడిన వార్డుల్లో ఎలాగైన గెలిచి తమ సత్తా చాటాలని ఆశావహులు భావిస్తున్నారు. కాగా గతంలో 36 వార్డులు ఉన్నప్పుడు చైర్‌పర్సన్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఆయా ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడగా, ఈ సారి 49 వార్డులకు పెరగడంతో ఇంకాస్తా ఎక్కువ పోటీ నెలకొనే అవకాశం కన్పిస్తోంది. కాగా బల్దియా పాలకవర్గాల గడువు గత జూలైతో ముగిసిపోవడంతో అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. జూన్, జూలైలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేసినా.. కోర్టులో కేసు కారణంగా సమయం పట్టింది. ఈ ప్రక్రియ గత అర్నెళ్లుగా కొనసాగుతూ వస్తుండడంతో ప్రధాన పార్టీలతో పాటు ఆశావహులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top