నేతల్లో టికెట్‌ గుబులు

Municipal elections Fight In Huzurabad - Sakshi

సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌) : తొందరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల వేడి ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో హుజూరాబాద్, జమ్మికుంట రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. రెండు మున్సిపాలిటీల్లో టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రధాన పార్టీల నేతలకు కత్తిమీద సాముగా మారుతోంది. ఏ సమయంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉండటంతో ఆయా పార్టీల నేతలు టికెట్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 

పెరుగుతున్న ఆశావహులు..
మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ గత 10 రోజులు నుంచి ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారు కానప్పటికీ ఆశావహులు ఇప్పటికే వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నట్లు సమాచారం. పదవిలో ఉన్నప్పుడు వార్డు అభివృద్ధికి పని చేశామని, పార్టీ టికెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతంత్య్ర అభ్యర్థిగానైనా బరిలో దిగుతామని తాజామాజీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ ప్రధాన పార్టీలలో ఆశావహులు చాలా మంది ఉండటంతో ఒక్కో వార్డు నుంచి అభ్యర్థి ఎంపిక విషయం ఆయా పార్టీల ముఖ్య నేతలకు తలనొప్పిగా మారనుంది. 

అధికార పార్టీలో తీవ్రపోటీ... 
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో టికెట్లకు తీవ్ర పోటీ నెలకొంది. రిజర్వేషన్లు ప్రకటిస్తే ఈ పోటీ మరితం తీవ్రం కానుంది. గత ఐదేళ్ల కాలంలో మంత్రి ఈటల రాజేందర్‌ సహకారంతో హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు కోట్ల నిధులు వచ్చాయి. ఈ నిధులతో ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులు జరిగాయి. ఈ క్రమంలో తాము పదవిలో ఉన్నపుడు చేసిన అభివృద్ధి పనులు చేశామని, తమకే టికెట్‌ కేటాయించాలని కోరుతుండగా, పార్టీకోసం పాటుపడుతున్న సీనియర్లమైన మాకే టికెట్‌ ఇవ్వాలని మరికొందరు అధికారపార్టీ ముఖ్య నేతలకు వివరించి టికెట్‌ అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు కొత్తగా పార్టీలో చేరుతున్నవారు తమకు ఈ సారి టికెట్‌ కేటాయించాలని అభ్యర్థిస్తుండటంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో టికెట్లకు తీవ్ర పోటీ నెలకొననుంది. టికెట్‌ రాకపోతే రెబల్‌గా కూడా బరిలో నిలిచేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

టికెట్‌కోసం నియోజకవర్గ స్థాయి నేతలు.. మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచి ఎలాగైనా గెలుపొంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కొందరు నియోజకవర్గ స్థాయి నేతలు ఉన్నారు. నియోజకవర్గంలో హుజూరాబాద్, జమ్మికుంట రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్‌ రిజర్వేషన్‌ అనుకూలంగా వస్తే తప్పకుండా కౌన్సిలర్‌గా బరిలో నిలవాలని అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.  రిజర్వేషన్‌ అనుకూలంగా రాకపోతే మహిళకు రిజర్వేషన్‌లో భార్యలను పోటీలో నిలుపడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు మున్సిపోల్స్‌పై నజర్‌ పెట్టాయి. రిజర్వేషన్లు ప్రకటిస్తే ఎవరిని బరిలో నిలపాలి అనే దానిపై ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు మండలాలవారిగా సమాచారం తెప్పించుకుంటున్నట్లు సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top