పురపోరు.. ప్రచార హోరు!

Municipal Election Campaign Increased - Sakshi

ఊపందుకున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం..

చారంలో నిమగ్నమైన ప్రధాన పార్టీల నేతలు

పరస్పర విమర్శలు, సవాళ్లు–ప్రతిసవాళ్లతో రాజుకుంటున్న వేడి

సోమవారంతో ముగియనున్న ప్రచార పర్వం.. 

సాక్షి, హైదరాబాద్‌ : పుర పోరులో ప్రచార హోరు ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ప్రచారానికి మూడ్రోజులే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీల నేతలు, స్వతంత్ర అభ్యర్థుల ప్రచా ర సంరంభం సాగుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పరస్పర విమర్శలు, సవాళ్లు–ప్రతిసవాళ్లతో ప్రచార పర్వం వేడెక్కుతోంది. అన్ని పార్టీల నేతలు ఇంటింటి ప్రచారం, బహిరంగసభలతో హోరెత్తిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీల ముఖ్యనేతలు స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పక్షాన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి,  రాజ్‌గోపాల్‌రెడ్డి, సీతక్క, పోడెం వీరయ్య, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, వీహెచ్, ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార బాధ్యతలను పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మం త్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇక ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.  

కేటీఆర్‌ పర్యవేక్షణ.. 
టీఆర్‌ఎస్‌ పక్షాన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్‌లు, సమీక్షలతో జిల్లాల్లోని, మున్సిపాలిటీల్లోని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపల్‌ ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనకపోవచ్చుననే ఊహాగానాలు పార్టీ వర్గాల్లో సాగుతున్నాయి. కేటీఆర్‌ కూడా ఈ నెల 20న దావోస్‌ పర్యటనకు వెళ్తుండటంతో ఆయన అక్కడ ఉండగానే మున్సిపల్‌ ఎన్నికలు ముగుస్తాయని, అక్కడి నుంచే ముఖ్య నేతలతో సమన్వయం చేసుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. కేటీఆర్‌ ఇప్పటికే సిరిసిల్ల నియోజకవర్గం, జిల్లా పరిధిలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచా రాన్ని నిర్వహించి వచ్చారు. మంత్రులంతా ఎక్కడికక్కడ తమ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇతర నేత లు వివిధ జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top