మజ్లిస్‌...ముందస్తు వ్యూహం

Mujlis Targets To Women Votes In Telangana - Sakshi

ముస్లిం మహిళల ఓటింగ్‌శాతం పెంచడంపై  దృష్టి

సమస్యలపై మహిళలతో గ్రూప్‌ మీటింగులు

గ్రూప్‌ల వారీగా ముఖాముఖి చర్చ

హాజరవుతున్న పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

సాక్షి,సిటీబ్యూరో:  హైదరాబాద్‌ పాతబస్తీని రాజకీయంగా శాసిస్తున్న మజ్లిస్‌ పార్టీ ముందస్తు ఎన్నికలను ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల వరకూ ప్రచార అస్త్రాలుగా పాదయాత్రలు, ఇంటింటిæ ప్రచారం, ర్యాలీలు, సభలు, భావోద్వేగ ప్రసంగాలకే పరిమితమైన మజ్లిస్‌ ఈసారి  సరికొత్త వ్యూహాలను అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రధానంగా ముస్లిం మహిళా ఓటర్లను  కదిలించి పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఏకంగా వారితో ప్రత్యేకంగా గ్రూప్‌ సమావేశాలకు శ్రీకారం చుట్టింది. సమావేశాలకు పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ హాజరవుతున్నారు. సమస్యలు వినడం చర్చించడం, హమీలతో  భరోసా కల్పించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే చార్మినార్, కార్వాన్, బహదూర్‌పురా, మలక్‌పేట్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలతో ప్రత్యేక సమావేశాలు పూర్తయ్యాయి. మంగళవారం ముస్లిం మహిళలతో నాంపల్లి నియోజకవర్గ గ్రూప్‌ మీటింగ్‌ జరిగింది. 

ఎన్నికల్లో మహిళల పోలింగ్‌ శాతం తక్కువే
పాతబస్తీలో మజ్లిస్‌పార్టీకి గట్టి పట్టు ఉంది. గణనీయమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. ఇక్కడి ఎన్నికల్లో అభ్యర్థి కంటే పార్టీ ప్రభావం ఎక్కువ. మజ్లిస్‌కు వార్‌ వన్‌సైడే అన్నట్టుగా గంపగుత్తగా ఓట్లు పడుతుంటాయి. కానీ పురుష ఓటర్లతో పోల్చితే మహిళా పొలింగ్‌ శాతం  ప్రతి ఎన్నికల్లో తక్కువగా నమోదవుతోంది. సాధారణంగా  ఇంటి పనులతో తీరక లేకపోవడం, కట్టుబాట్లు, ఇతరత్రా కారణాలతో  ప్రత్యేక సమయం కేటాయించి బయటకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొనేందుకు మహిళలు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. మజ్లిస్‌ పార్టీ నేతలు పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం చేసినా మహిళలతో సమస్యలపై మమేకంకావడం తక్కువే. దీంతో మహిళలకు కూడా ఓటింగ్‌ పట్ల పెద్దగా ఆసక్తి  ఉండడం లేదు. దీనిని గుర్తించిన మజ్లిస్‌ పార్టీ  ఈసారి మహిళా ఓటర్లపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. వారిని కదిలించడానికి సిద్ధమైంది. గ్రూపుల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళల  సమస్యలపై చర్చిస్తోంది.

విద్య, వైద్యం. గృహవసతి
మహిళా గ్రూప్‌ సమావేశాల్లో  ప్రధానంగా విద్య, వైద్యం, గృహ వసతిపై మజ్లిస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవంగా పాతబస్తీలోని పేద కుటుంబాలకు అతిపెద్ద సమస్యలు వైద్య చికిత్స, సొంత గృహ నివాసం. అదే విధంగా పిల్లల చదువు, ఉపాధి అవకాశాలు. అత్యధిక శాతం పేద కుటుంబాలు అద్దె గృహాల్లో నివసిస్తుం టాయి. అక్షరాస్యత అంతంతే. దీంతో మజ్లిస్‌ పార్టీ మూడు, నాలుగు  ప్రధాన అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాతబస్తీలోని  ఏడు, ఎనిమిది ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూం గృహాల కోసం  నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరిన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ సముదాయాల ప్రాజెక్టులు మంజూరు చేయించడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో  మొదటి విడతగా నివాసాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చి,  మిగిలి గృహాలను స్థానికులైన నిరుపేదలకు కేటాయించేందుకు ప్రయత్నిస్తామన్న భరోసా మహిళకు ప్రత్యేక సమావేశాల ద్వారా కల్పిస్తున్నారు. ఇప్పటికే బస్తీ దవాఖానాల పేరుతో ఉచిత వైద్య సహాయం అందుబాటులోకి వచ్చింది. మరిన్ని క్లినిక్‌లను ప్రారంభిస్తామని  మహిళలకు హమీ  ఇస్తున్నారు. మహిళల కోసం వృత్తి నైపుణ్యంలో శిక్షణ కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. టైలరింగ్, ఇతరత్రా శిక్షణ పొం దిన మహిళలకు  ప్రభుత్వ పక్షాన కుట్టుమిషన్ల పంపిణీ, ఆర్థికసాయం అందించారు. వృత్తి నైపుణ్య అంశం మజ్లిస్‌ పార్టీకి మరింత కలిసి వస్తోంది.

ఓటింగ్‌పై చైతన్యం
ప్రధానంగా మహిళలకు ఓటింగ్‌పై అవగాహన పెంచుతున్నారు. పురుషుల కంటే తక్కువేమీ కాదని మహిళల్లో మనోధైర్యం నింపుతున్నారు. మహిళా ఓటర్లు డిసెంబర్‌ 7న పూర్తిస్థాయిలో బయటకు రావాలని,  ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top