టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత

Mla shobha fight at toll plaza - Sakshi

సిబ్బందితో ఎమ్మెల్యే శోభ వాగ్వాదం

సెల్‌ఫోన్లు లాక్కెళ్లిన అనుచరులు 

ఫిర్యాదు అందలేదు..: సీపీ కమలాసన్‌ రెడ్డి 

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా రేణికుంట టోల్‌ప్లాజా వద్ద మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, ఆమె భర్త గాలన్న, ఇద్దరు గన్‌మన్లు మంగళవారం టోల్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగగా, ఆమె గన్‌మన్‌ కె.రాజు ఏకంగా చేయి చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనపై వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మంగళవారం ఉదయం తన వాహనంలో భర్త గాలన్న, గన్‌మన్లు పెద్ది రాజు, రాజు అనుచరులతో కలసి హైదరాబాద్‌ వెళ్తున్నారు. తిమ్మాపూర్‌ మండలం రేణికుంట శివారులోని టోల్‌ ప్లాజా వద్ద ఓ వాహనం మరమ్మతులకు గురి కావటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఎమ్మెల్యే వాహనం కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. టోల్‌ప్లాజా సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే వాహనం ప్లాజా వద్దకు చేరుకుంది. వెంటనే కారులో నుంచి ఎమ్మెల్యే గన్‌మన్‌ రాజు కిందకు దిగి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. టోల్‌ షిఫ్ట్‌ ఇన్‌చార్జి జీవన్‌ ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్నామని దురుసుగా, దుర్భాషలాడటంతో ఎమ్మెల్యే వారిని మం దలించే ప్రయత్నం చేయగా, ఇదే సమయంలో గన్‌మన్‌ రాజు షిఫ్ట్‌ ఇన్‌చార్జ్‌ జీవన్‌పై చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే భర్త, అనుచరులు కూడా కారు దిగి వచ్చి వారితో మాట్లాడుతుండగా, ఈ దృశ్యాలను అక్కడే ఉన్న మరో సూపర్‌వైజర్‌ రాజు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.  గమనించిన గాలన్న, ఎమ్మెల్యే అనుచరులు అతడి సెల్‌ ఫోన్‌ లాక్కోవడానికి యత్నించగా, రాజు పారిపోయే ప్రయత్నం చేశాడు. ఎమ్మెల్యే సిబ్బంది వెంబడించి సెల్‌ఫోన్‌ లాక్కున్నాడు. అనంతరం అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. అయితే, గొడవ విషయాన్ని టోల్‌ ప్లాజా సిబ్బంది ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్‌ఐ కృష్ణారెడ్డి, కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ ఉషరాణి  వచ్చి... సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు.  వివరాలు అడిగి తెలుసుకున్నారు.     

దురుసుగా ప్రవర్తించారు
టోల్‌ప్లాజా సిబ్బంది మా వాహనాన్ని గమనించలేదు... మా వాహనానికి అడ్డంగా వాహనం నిలిపి ఉంచడంతో ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాలని అతనికి చెబుతుండగానే గుర్తించకుండా అసభ్యకరంగా మాట్లాడాడు. తనను, తన భర్తను దురుసుగా మాట్లాడారని, దీంతో వారిని పద్ధతి మార్చుకోమని బుద్ధి చెప్పామే తప్పా ఎవరిపై చేయి చేసుకో లేదు. తమ పొరపాటును తెలుసుకున్న సిబ్బంది  క్షమాపణలు చెప్పారు. ‘టోల్‌ప్లాజాలో ఉద్యోగం చేసుకుని బతికే వాళ్లు.. వారిపై సానుభూతితో బుద్ధిమాట చెప్పాం... అంతే తప్ప వేరే లేదు’ అన్నారు.     
– ఎమ్మెల్యే బోడిగ శోభ 

ఎలాంటి ఫిర్యాదు రాలేదు
రేణికుంట టోల్‌ప్లాజా వద్ద జరిగిన సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందుకే ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఫిర్యాదు చేస్తే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు.       
– సీపీ కమలాసన్‌రెడ్డి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top