మారిన మకాం..! 

MLA Candidates Waiting for Congress List Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న ఆశావహులందరూ చివరి ప్రయత్నంగా హస్తినకు చేరారు. కాంగ్రెస్‌ నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితా కొలిక్కి వస్తుండడం.. ఒకటి, రెండు రోజుల్లో పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉండడంతో అందులో తమ పేరు ఉండేలా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఆశావహులకు పిలుపు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కొందరికి టికెట్‌ విషయంలో ఈసారికి పట్టుపట్టొద్దని నచ్చజెప్పి.. బుజ్జగింపు కోసం పిలిచారని ప్రచారం జరుగుతుండగా.. మరికొందరికి టికెట్‌ ఖరారయ్యే విషయాన్ని చెప్పేందుకు పిలిచారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల్లో అనేక మంది ఇప్పటికే ఢిల్లీ చేరుకుని.. పార్టీలో తమకు వెన్నుదన్నుగా ఉన్న నాయకుల ద్వారా అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారమవుతోంది.

జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయడం ఖాయమేనని తేలినా.. అభ్యర్థి ఎవరో ఖరారు కాకపోవడంతో జాబితాలో తమ పేరు ఉండేలా ప్రయత్నం చేస్తుండగా.. మరికొన్ని నియోజకవర్గాల్లోని ఆశావహుల పరిస్థితి కొంత అయోమయంగా ఉంది. తాము టికెట్‌ ఆశిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందా? మహాకూటమి భాగస్వామ్య పక్షాలకు కేటాయిస్తుందా? అనే అంశం కొలిక్కి రాకపోవడంతో ఆయా నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ పోటీ చేసేలా అధిష్టానాన్ని ఒప్పించే పనిలో పడ్డారు. మహాకూటమి భాగస్వామ్య పక్షాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, సీపీఐ జిల్లా నుంచి ఒక్కో పార్టీ మూడు స్థానాలు కోరుతుండగా.. వీటిలో కాంగ్రెస్‌ భాగస్వామ్య పక్షాలకు ఎన్ని కేటాయిస్తుంది? ఆ నియోజకవర్గాలు ఏమిటనే అంశంపై ఢిల్లీలో మకాం వేసిన ఆశావహులకు సైతం ఇప్పటికీ స్పష్టత రానట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, కొత్తగూడెం టికెట్‌ ఆశిస్తున్న ఎడవల్లి కృష్ణలకు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ చేరుకున్నట్లు ఆయా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇక ఎవరికి వారే టికెట్‌ ప్రయత్నాల కోసం మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. ఖమ్మం నుంచి మహాకూటమి భాగస్వామ్య పక్షాల్లో ఏ పక్షం పోటీ చేస్తుందన్న అంశం తేలకపోవడం, కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడి అభ్యర్థిత్వం పెండింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతుండడంతో.. ఇక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్న నేతల ఉత్కంఠకు తెరపడడం లేదు.

కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఖమ్మం టికెట్‌ ఆశిస్తున్న వద్దిరాజు రవిచంద్ర, పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, ఇల్లెందు టికెట్‌ ఆశిస్తున్న హరిప్రియ నాయక్, పాలేరు టికెట్‌ ఆశిస్తున్న కందాల ఉపేందర్‌రెడ్డి, రాయల నాగేశ్వరరావు తదితరులు ఢిల్లీలో మకాం వేసి.. తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

10వ తేదీన అధికారికంగా అభ్యర్థులు ఖరారయ్యేంత వరకు ఏ నియోజకవర్గంలో కూటమిలోని ఏ భాగస్వామ్య పక్షం పోటీ చేస్తుందన్న అంశంపై ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే భాగస్వామ్య పక్షాలైన సీపీఐ ఉమ్మడి జిల్లాలోని  వైరా, కొత్తగూడెం స్థానాల కోసం పట్టుపడుతుండగా.. టీడీపీ తమ సిట్టింగ్‌ స్థానమైన సత్తుపల్లితోపాటు ఖమ్మం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఇచ్చి తీరాల్సిందేనని భీష్మించింది. టీడీపీ కోరుతున్న మూడు స్థానాలు దాదాపు ఖాయమయ్యాయని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

సత్తుపల్లి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలో దిగడం దాదాపు ఖాయమేనని, నామినేషన్ల ముహూర్తం కోసం వారు సమాయత్తమవుతున్నారని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top