అన్నదాత.. తీరని వ్యథ..

Mirchi And Rice Crop Farmers Loss With Heavy Rains Khammam - Sakshi

అకాలవర్షంతో తడిసిన ధాన్యం, మిర్చి

నేలరాలిన మామిడి, బొప్పాయి

పంటలను కాపాడుకునేందుకు రైతుల పాట్లు

బూర్గంపాడు: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షం రైతులకు కన్నీళ్లు తెప్పించింది. కల్లాల్లో ఉన్న యాసంగి వరి పంట భారీ వర్షానికి తడిసి ముద్దయింది. ఇంకా కోయాల్సిన పంట నేలకొరిగింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వరికోతలు, ధాన్యం అమ్మకాలు కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 80 శాతం మేర వరి కోతలు పూర్తయ్యాయి. అయితే 50 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద, కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు జోరువాన లోనూ రైతులు నానా పాట్లు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 7వేల ఎకరాలలో పండించిన పంట వర్షార్పణం అయింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి సైతం వర్షానికి తడిసింది.

ఉధృతమైన గాలులతో మామిడి, బొప్పాయి కాయలు నేలరాలాయి. జిల్లాలో సుమారు 500 ఎకరాలలో మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. లక్ష్మీపురం గ్రామంలో యారం లక్ష్మీరెడ్డి అనే రైతు సాగుచేసిన బొప్పాయి తోట పూర్తిగా నేలమట్టమయింది. దీంతో రూ.6 లక్షల నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని అంచనా వేయాలని కలెక్టర్‌ ఎం.వి.రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో వారు ఆదివారం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టం అంచనా నివేదికలను సిద్ధం చేశారు. అకాల వర్షంతో సుమారు 1000 ఎకరాల్లో వరిపంట నేలకొరిగిందే తప్ప నష్టం జరగలేదని అధికారులు అంచనా వేశారు. ఉద్యావవన పంటలైన మామిడి, బొప్పాయికి మాత్రం నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. కల్లాలో తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకుంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పిస్తున్నారు. కల్లాల్లో ధాన్యం కూడా 30 శాతం మాత్రమే తడిసిందని అంటున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షం పడే సూచనలు ఉండటంతో టార్పాలిన్లు, పరదాలు అందుబాటులో ఉంచుకుని ధాన్యం, మిర్చి పంటలను కాపాడుకోవాలని  సూచిస్తున్నారు.

రూ.6 లక్షల మేర నష్టం
అకాల వర్షంతో ఆరు ఎకరాల్లో వేసిన బొప్పాయి పూర్తిగా నేలమట్టమైంది. ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.6 లక్షల నష్టం వాటిల్లింది. మొత్తం చెట్లన్నీ నేలమట్టమయ్యాయి. పంట చేతికి వచ్చే సమయంలో జరిగిన ఈ నష్టం పూడ్చుకోలేనిది. ప్రభుత్వం సాయం అందించాలి.– యారం లక్ష్మీరెడ్డి, లక్ష్మీపురం

పంట తడిసినా పెద్దగా నష్టం లేదు
అకాల వర్షంతో కల్లాల్లో ఆరబోసిన పంట తడిసింది. 1000 ఎకరాల్లో కోతకు వచ్చిన పంట నేలకొరిగింది. అయితే ఎక్కడా పెద్దగా నష్టం జరగలేదు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటే వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.  – కె.అభిమన్యుడు, డీఏఓ

జిల్లాలో తీరని పంట నష్టం
సూపర్‌బార్‌(కొత్తగూడెం): జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షంతో అరటి, బొప్పాయి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. అశ్వారావుపేట మండలంలో అరటి తోటలు 6 హెక్టార్లు, దమ్మపేటలో 10 హెక్టార్లు, జూలూరుపాడులో 2 హెక్టార్లు, ములకలపల్లిలో 10 హెక్టార్లు, బూర్గంపాడులో బొప్పాయికి 4 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టం అంచనాలు ఉన్నతాధికారులకు నివేదించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top