ప్రాణం పోయినా మాట తప్పను 

Minister Niranjan Reddy Inaugurated the Pension Distribution Program at Wanaparthi - Sakshi

రెండేళ్లలో ప్రతి పేదవాడికి ఇల్లు కటిస్తా 

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి టౌన్‌: పట్టణంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రాణం పోయినా పేదలకు ఇచ్చే మాట తప్పనని, రెండు రోజులు అటో..ఇటో జరగచ్చు కానీ, ఇచ్చిన మాటను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పను అని పేర్కొన్నారు. పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు శనివారం జిల్లాకేంద్రంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ, కౌన్సిలర్ల జోక్యం ఉండదని, పూర్తి పారదర్శకతతో అధికారులే చేపట్టేలా చూస్తానన్నారు. పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. కేసీఆర్‌ గెలిచినా పింఛన్‌ పెంచడం లేదని పలువురు అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు.

పొడిచే  పొద్దు మారినా.. కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పబోరని, ఎన్నికల కోడ్‌ నిబంధనల కారణంగా పింఛన్ల పెంపులో జాప్యం జరిగిందన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కుట్రలను భగ్నం చేసి విలువైన ఆస్తులను కాపాడి ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కబ్జాలను నిర్మూలించేందుకు కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారని కొనియాడారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించనుందన్నారు. కొత్త పురపాలక చట్టం ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధుల్లో బాధ్యత పెంచిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శ్వేతామహంతి, జెడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ లక్ష్మయ్య, గొర్రెల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, పుర మాజీ చైర్మన్, అధికారులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

వనపర్తి పేరు నిలబెట్టాలి 
వనపర్తి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డిపో లీజుకు ఇచ్చిన పెట్రోల్‌ బంక్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ మేరకు రిబ్బన్‌ కట్‌ చేసిన ఆయన మాట్లాడుతూ డిపోను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు వ్యాపార సముదాయ దుకాణాల ఏర్పాటుకు అనుగుణంగా రూపొందించాలని డీఎం దేవదానంకు సూచించారు. కార్యక్రమంలో కల్వరాజు, జ్యోతిబాబు, డిపో అధికారులు దేవేందర్‌గౌడ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top