ఫోన్‌ కొట్టు.. డ్రగ్స్‌ పట్టు!

ఫోన్‌ కొట్టు.. డ్రగ్స్‌ పట్టు! - Sakshi


కాల్‌ చేసిన వెంటనే వెళ్లి డ్రగ్స్‌ సరఫరా చేసిన మైక్‌ కమింగ

కస్టడీలో కీలక అంశాలను రాబట్టిన ఎక్సైజ్‌ సిట్‌ అధికారులు

పలు స్కూళ్లలో డ్రగ్స్‌ దందా.. హైదరాబాద్‌ యువతితో వివాహం

ఎవరికీ అనుమానం రాకుండా రాకపోకలు

విద్యార్థులను విచారించడంతో కమింగ పేరు వెలుగులోకి..




సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డ్రగ్స్‌ వ్యవహారంలో నెదర్లాండ్స్‌ దేశస్తుడు మైక్‌ కమింగ పాత్ర మొత్తం బయటపడుతోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, ప్రముఖ కాలేజీల విద్యార్థులకు డ్రగ్స్‌ సరఫరా చేసింది అతడేనని వెల్లడైంది. విద్యార్థులు కేవలం ఫోన్‌ చేస్తే చాలు.. నేరుగా స్కూల్‌ వద్దకే వెళ్లి డ్రగ్స్‌ సరఫరా చేశాడని తేలింది. గత నెల 25న కమింగను సిట్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని కోర్టు అనుమతి మేరకు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. మూడు రోజుల పాటు ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో సోమవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీలో విచారణ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.



నేరుగా స్కూలు వద్దకే వెళ్లి..

అసలు డార్క్‌నెట్‌ నుంచి నేరుగా విద్యార్థుల చేతికి డ్రగ్స్‌ ఎలా అందాయని సిట్‌ కూపీ లాగింది. డ్రగ్స్‌కు బానిసైన పలువురు విద్యార్థులకు కౌన్సెలింగ్‌ చేసింది. ఈ సందర్భంగా మైక్‌ కమింగ తమకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టుగా విద్యార్థులు వెల్లడించినట్లు తెలిసింది. డ్రగ్స్‌ కావాలని ఫోన్‌ చేసి అడగగానే నేరుగా స్కూల్‌ వద్దకు వచ్చి ఇచ్చేవాడని చెప్పినట్లు సమాచారం. కమింగ ఒక్కో స్ట్రిప్‌ ఎల్‌ఎస్‌డీకి రూ.4 వేల చొప్పున వసూలు చేసినట్టుగా దర్యాప్తులో తేలిందని సిట్‌ అధికారులు తెలిపారు. ఇక కమింగ హైదరాబాద్‌కు చెందిన యువతిని వివాహం చేసుకుని.. తన రాకపోకలపై అనుమానం కలుగకుండా డ్రగ్స్‌ దందాను నడిపాడని వెల్లడించారు. ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ, డీఎంటీ తదితర డ్రగ్స్‌ను హైదరాబాద్‌లోని 8 ప్రముఖ స్కూళ్లు, 6 కాలేజీలకు తన నెట్‌వర్క్‌ ద్వారా సరఫరా చేసినట్టుగా గుర్తించినట్లు తెలిపారు.



అన్నీ డిలీట్‌..

కెల్విన్, జీశాన్, అబ్దుల్‌ వహీద్, ఖుదూస్, నిఖిల్‌షెట్టిలను అరెస్టు చేసిన సిట్‌ కమింగను చాకచక్యంగా అదుపులోకి తీసుకోగలిగింది. సిట్‌ అధికారులు జూన్‌ 25న కమింగను అదుపులోకి తీసుకోవడానికి నానక్‌రాంగూడలోని అతడి నివాసంపై దాడి చేశారు. కానీ ఆ సమయంలో కమింగ, అతడి భార్య ఇంట్లో లేరు. బంధువులు మాత్రమే ఉండగా.. అధికారులు ఆ ఇంట్లో రెండు గంటల పాటు సోదాలు చేసి, వెళ్లిపోయారు. దీంతో సిట్‌ దాడి విషయం తెలుసుకున్న కమింగ.. తన వ్యక్తిగత ఐప్యాడ్, కంప్యూటర్, సోషల్‌ మీడియా ఖాతాలకు సంబంధించిన సమాచారం మొత్తాన్నీ డిలీట్‌ చేసేశాడు. ఎక్సైజ్‌ అధికారులు వెళ్లిపోయాక నాలుగు గంటల తర్వాత తన ఇంటి వద్దకు చేరుకున్నాడు. అయితే దాడులు ముగించుకొని వెళ్లినట్టే వెళ్లిన సిట్‌ అధికారులు.. కాపుకాసి కమింగను అరెస్టు చేశారు. అతడి నుంచి 2.8 గ్రాముల డీఎంటీ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top