సొంతూళ్ల బాటలో...

Migrant Workers Walking Hyderabad to Maharashtra With Center Permission - Sakshi

కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌తో నగరంలోని వలస కార్మికుల్లో ఆనందం

ఊరి బాట పట్టేందుకు ఉత్సాహం

ఇప్పటికే నగరం దాటిన సగానికి సగం మంది

సాక్షి,మేడ్చల్‌ జిల్లా /సిటీబ్యూరో:  పొట్ట చేత పట్టుకుని నగరానికి వలస వచ్చిన వారంతా ఇప్పుడు...సొంతూళ్లకు తిరుగు పయనమవుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏ పనీ లేక వలస కార్మికులకు బతుకు భారమైంది. అన్నం మెతుకులు కూడా దొరక్క కొంతమంది అన్నార్తులపై ఆధారపడ్డారు. మరికొందరు  కాలినడనక సొంతూళ్లకు బయలుదేరగా,  ఇందరు ఇక్కడే ఉండిపోయారు. బుధవారం కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటనతో లాక్‌డౌన్‌లో చిక్కుకున్న వలస కార్మికులకు కొంత ఊరట లభించింది. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించింది. అయితే  ఇందుకు రెండు రాష్ట్రాల అనుమతి అవసరం. కరోనా వైద్య పరీక్షలు చేశాకే, సొంత రాష్ట్రాల్లోకి అనుమతించనున్నారు. సొంత రాష్ట్రాలకు చేరుకోగానే వారంతా హోంక్వారంటైన్‌లోకి వెళ్లాలి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళుతున్న వారిని ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా పర్యవేక్షించి వారందరినీ ఆ యాప్‌తో అనుసంధానం అయ్యేలా చూస్తారు.  (వలసజీవులకు ఎట్టకేలకు విముక్తి)

లాక్‌డౌన్‌తో... లాక్‌డౌన్‌తో లక్షలాది మంది వలస జీవులు
ఉపాధి కోల్పోయారు. తినడానికి తిండిలేక పూట గడవడం కష్టమైంది. ఉండేందుకు సరైన నీడ లేకుండాపోయింది. బతుకు బండి నడవకపోవడంతో పాటు లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారో నమ్మకం లేక మూటముల్లె సర్దుకొని  కాలినడికన కొందరు, లారీలు, సైకిళ్లపై  మరికొందరు స్వస్థలాల బాటపడ్డారు. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు చేరుకోగా, మరికొంత మంది సరిహద్దుల్లో, షెల్టర్లలో గడుపుతూ తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి కార్మికులు అక్కడే ఉండాలని, స్థానిక ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినా,  కార్మికులు వినే పరిస్థితి కనిపించడం లేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సుమారు 30 శాతం పైగా వలస కార్మికులు ఇంటిబాట పట్టినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా హైదరాబాద్‌ మహా నగరం  వలస కార్మికుల అడ్డా. ఉపాధి కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, బిహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఇలా వచ్చినవారు సుమారు ఐదు లక్షల వరకూ ఉన్నారు. ఒక్కనిర్మాణ రంగంలోనే రెండు  లక్ష మందికిపైగా ఉంటారని అధికారులు అంచనా.  

కొంతమందికి చేయూత
లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకున్న కార్మికులు ఆకలితో అలమటించకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినా,  సగం మందికి  కూడా సాయం అందలేదు.  948 ప్రాంతాల్లో  భవన నిర్మాణ సైట్‌ల వద్ద సుమారు 95,859 కార్మికులు పని చేస్తున్నట్లు గుర్తించారు. అందులో  41,740  మంది కార్మికులను సుమారు 284 కేంద్రాల్లో ఆశ్రయం కల్పించి ఆహారం, ఇతర సౌకర్యాలు అందిస్తున్నారు. మిగిలిన కార్మికులకు 12 కిలోల బియ్యం, 500లను అందించాలని నిర్ణయించారు. కేవలం 35 వేల కార్మికులను బియ్యం,నగదు అందించి  అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో  వలస కార్మికులు ఉపాధితో పాటు  తిండి గింజలు కరువై  ఇంటిబాట పట్టారు.  

వలసకార్మికులు ఇలా..
1,50,000 హైదరాబాద్‌
1,05,000 రంగారెడ్డి జిల్లా
92,040 మేడ్చల్‌
2,00,000 అధికారికంగా ఇంకా గుర్తించని వలసకార్మికుల సంఖ్య

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top