ఓ వలస కుటుంబం కన్నీటి గాథ

Migrant Family Sad Story in Hyderabad - Sakshi

సొంతూరు దారిలో అంతులేని వ్యథ

దూలపల్లి చౌరస్తా వద్ద నిలువరింపు

సహాయక కేంద్రానికి తరలింపు

రైలులో పంపిస్తామని సీఐ హామీ

కుత్బుల్లాపూర్‌: సోమవారం అర్ధరాత్రి 12 గంటలు.. అది మెహిదీపట్నం.. ఓ వలస కుటుంబం.. చోటోలాల్, సరస్వతి దంపతులతో పాటు వారి కుమార్తె.. వినోద్, జయసుధ వారి చిన్నారి, మరో జంట లాలారామ్, సబిత. వీరి స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాంపూర్‌. వీరంతా కొన్నాళ్ల క్రితమే పొట్ట చేతపట్టుకుని నగరానికి వలస వచ్చారు. మెహిదీపట్నం బృందావన్‌ కాలనీలో భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. జతకు రోజుకు వచ్చే రూ.900తో కుటుంబాలను నెట్టుకొచ్చేవారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో 43 రోజులుగా కూలిపనులు లేకుండాపోయాయి. బతుకు బండి నడిచే పరిస్థితి లేకపోవడంతో భార్యాబిడ్డలు.. ముల్లే మూటలతో సొంతూరుకు కాలినడకన ఇలా బయలుదేరారు.

కుత్బుల్లాపూర్‌లోని దూలపల్లి చౌరస్తా వద్ద వలస కార్మికులతో మాట్లాడుతున్న సీఐ మహేష్‌
ఈ మూడు జంటల్లో జయసుధ అనే మహిళ నడవ లేని స్థితిలో ఉండగా ఆమె భర్త వినోద్‌ భార్యను, కుమార్తెను వీల్‌ చైర్‌పై తీసుకువెళ్తుండటం స్థానికులను కలచి వేసింది. తమను కలిసిన ప్రతి ఒక్కరినీ వేడుకుంటూ ఏదైనా వాహనం వస్తే ఎక్కించమని బతిమిలాడుతూ ముందుకు సాగారు. రహదారిపై ఇలా వస్తుండగా మంగళవారం ఉదయం 9 గంటలకు ‘సాక్షి’ వీరిని పలకరించగా.. తమ కన్నీటి వ్యథను వెలిబుచ్చారు. ‘ఎంతకష్టమైనా సరే ఇంటికి చేరుకుంటాం.. 43 రోజులుగా అష్టకష్టాలు పడ్డాం.. మమ్మల్ని తీసుకొచ్చిన కాంట్రాక్టర్‌ 10 కిలోల బియ్యం ఇచ్చి పత్తా లేకుండాపోయాడు. ఇక్కడ మాకు దిక్కు ఎవరూ లేరు. చేసేదేమీ లేక ఇంటి దారి పట్టాం’ అని ఆవేదన వ్యక్తంచేశారు. దూలపల్లి చౌరస్తా వద్ద సీఐ మహేశ్‌ తనిఖీల్లో భాగంగా ఈ కుటుంబాలతో మాట్లాడారు. రైలు ద్వారా స్వస్థలానికి పంపిస్తామని హామీ ఇచ్చి వారిని సహాయక కేంద్రానికి తరలించారు. 

మేడ్చల్‌ హైవేలో ఇలా సొంత ప్రాంతాలకు వెళ్తున్న వలసకూలీలు
వెళ్తామో.. చస్తామో..  
అర్ధరాత్రి నుంచి నడక సాగించిన మరికొందరు తూప్రాన్‌ వైపు వెళ్లారు. వీరిలాగా ఎంతో మంది వలస కూలీలు పిల్లా పాపలను వెంటబెట్టుకుని నడక సాగిస్తూ అరిఘోస పడుతున్నారు. సుచిత్ర చౌరస్తా నుంచి కొంపల్లి, మేడ్చల్‌ మీదుగా తూప్రాన్‌ వరకు నడుస్తూ తమ గమ్యాస్థానాలకు వెళ్తున్న వీరిని ‘సాక్షి’ పలకరించగా.. తమ దీనగాథను చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తాము ఇళ్లకు చేరుకుంటామో.. లేక మధ్యలోనే ప్రాణాలు విడుస్తామోనని భయంగా ఉందని.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వలసకూలీలు ఆవేదన చెందారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top