మెట్రో టికెట్లు..టోకెన్లు..స్మార్ట్‌కార్డులు ఇలా వినియోగించండి

metro tickets, tokens, smart cards details - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు స్మార్ట్‌ కార్డులు, టోకెన్లు, టిక్కెట్ల కొనుగోలు, వినియోగం విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఇలా పరిష్కరించుకోవాలని నిర్మాణ సంస్థ ఒక ప్రకటనలో పలు సూచనలిచ్చింది.  

మెట్రో రైళ్ల పనివేళలు ఇవీ.. 

  • ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో ప్రతి 10–15 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రూట్లలో మొత్తం 14 రైళ్లు అందుబాటులో ఉంటాయి. 
  • ప్రతి స్టేషన్‌లో ఉదయం 6 గంటల నుంచే టిక్కెట్‌ విక్రయాలు ప్రారంభమవుతాయి. 
  •  రాత్రి 10 గంటలకు నాగోల్, మియాపూర్, అమీర్‌పేట్‌ స్టేషన్ల నుంచి చివరి రైలు బయలుదేరుతుంది.  
  • చివరి రైలులో ప్రయాణించేందుకు 30 నిమిషాల ముందుగా..రాత్రి 9.30 గంటల వరకే టిక్కెట్లను విక్రయిస్తారు.
     

సింగిల్‌ జర్నీ టోకెన్‌ వినియోగించండిలా.. 

  • నాగోల్‌– మియాపూర్‌ మార్గంలో ఏదేని రెండు స్టేషన్ల మధ్యన ప్రయాణించేందుకు దీన్ని వినియోగించాలి. 
  • ఉపయోగించని టోకెన్‌ను కొనుగోలు చేసిన 30 నిమిషాల్లో వాపసు ఇస్తే..అడ్మిన్‌ ఫీజులో సర్దుబాటు చేస్తారు. స్టేషన్‌లో అడ్మిన్‌ఫీజు మార్చి 31 వరకు ఉచితమే. 
  • టోకెన్‌ 120 నిమిషాల పాటే చెల్లుబాటు అవుతుంది. 
  • మీరు కొనుగోలుచేసిన టోకెన్‌ను చూపి పెయిడ్‌ ఏరియాలోకి ఎంటర్‌ అయితే మీ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు. 
  • ఈ రోజు కొనుగోలు చేసిన టోకెన్‌ను మీరు కావాలనుకుంటే ఈరోజే వాపసు ఇవ్వాలి. మరుసటి రోజు ఇస్తే తీసుకోరు. 

స్మార్ట్‌ కార్డు ఇలా.. 

  • స్మార్ట్‌ కార్డు ధర రూ.200. ఇందులో కార్డు ధర రూ.100, స్టోర్‌ వ్యాల్యూ రూ.100. వెంటనే స్మార్ట్‌ కార్డును తిరిగి ఇచ్చేస్తే మీకు రూ.80 మాత్రమే చెల్లిస్తారు. మరో రూ.20 అడ్మిన్‌ ఫీజులో సర్దుబాటు చేస్తారు. స్టోర్‌ వ్యాల్యూ కింద మీరు చెల్లించిన రూ.100 ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మీకు తిరిగిరాదు. 
  • స్మార్ట్‌కార్డు ద్వారా ప్రయాణిస్తే ప్రయాణ ఛార్జీల్లో 5 శాతం రాయితీ లభిస్తుంది. మార్చి 2018 వరకు ఈ సౌలభ్యం ఉంది. 
  • స్మార్ట్‌ కార్డులను పోగొట్టుకున్నా..ఎవరైనా మీ కార్డు దొంగిలించినా..కార్డు చెడిపోయినా రీఫండ్‌ రాదు. 
  • స్మార్ట్‌ కార్డులో కనీస రీఛార్జీ రూ.100..గరిష్టంగా రూ.3000  
  • కార్డు కాలపరిమితి 365 రోజులవరకు ఉంటుంది. 
  • స్మార్ట్‌కార్డుల రీఛార్జీకి పేటీఎం, లేదా టీ సవారీ మొబైల్‌ యాప్,హెచ్‌ఎంఆర్‌ ప్యాసింజెర్స్‌ వెబ్‌సైట్, లేదా స్టేషన్లలో చేసుకోవచ్చు. 

ప్రయాణ సమయం... 

  • గరిష్టంగా ప్రయాణ సమయం 180 నిమిషాల వరకే అనుమతిస్తారు. 
  • ఒకే స్టేషన్‌లో 30 నిమిషాల సమయం కంటే అధికంగా గడపరాదు. 

టిక్కెట్‌లేని ప్రయాణికులపై జరిమానా ఇలా.. 

  • టిక్కెట్‌లేని ప్రయాణికులపై రూ.50 జరిమానా విధిస్తారు. లేదా గరిష్ట టిక్కెట్‌ ధరను జరిమానాగా వసూలు చేస్తారు. 
  • అధిక సమయం స్టేషన్లలో గడిపితే గంటకు రూ.10.. గరిష్టంగా రూ.50 వరకు జరిమానా కట్టాల్సిందే. 
  • మూడేళ్ల వయసు లోపుగల చిన్నారులకు మెట్రోలో ఉచిత జర్నీకి అనుమతిస్తారు. 

స్మార్ట్‌ కార్డుతో జర్నీ హాయి.. 

  • ప్రయాణికులు స్మార్ట్‌ కార్డులేదా టోకెన్‌తో టిక్కెట్ల గోల లేకుండా మెట్రోలో సాఫీగా ప్రయాణించవచ్చు. స్మార్ట్‌ కార్డులను కొనుగోలుచేయాలని నిర్మాణ సంస్థ ప్రయాణికులకు విజ్ఙప్తి చేస్తోంది. 

టోకెన్లను ఇలా వినియోగించండి

  • మెట్రో స్టేషన్లలో ప్రయాణించేందుకు కొనుగోలుచేసే టోకెన్‌ను కాంటాక్ట్‌లెస్‌ స్మార్ట్‌ టోకెన్‌ అని పిలుస్తారు. ఈ టోకెన్‌ లోపల మీడియా చిప్‌ ఉంటుంది. 
  • ఈ టోకెన్లను స్టేషన్‌లో టిక్కెట్‌ ఆఫీస్‌/ వెండింగ్‌ యంత్రం, పోర్టబుల్‌ టిక్కెట్‌ అనలైజర్, లేదా కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చు. 
  • టోకెన్లు కొనుగోలుచేసే సమయంలోనే మీరు చేరాల్సిన గమ్యస్థానాన్ని స్పష్టంగా పేర్కొనాలి. 
  • టోకెన్‌ సాయంతో పెయిడ్‌ ఏరియా లేదా ప్లాట్‌ఫాం ఏరియాలోకి ప్రవేశించాలి. 
  • మీరు ప్లాట్‌ఫాంపైకి వెళ్లే సమయంలో..మీరు దిగిన స్టేషన్‌లో ఎగ్జిట్‌ గేటు వద్ద టోకెన్‌ను చూపాల్సి ఉంటుంది.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top