నిర్భయంగా చెప్పమ్మా..!

Metoo Movement Increased Sexual Assault On Women - Sakshi

తను డిగ్రీ సెకండియర్‌.. కాలేజీలో అందరితో కలుపుగోలుగా ఉంటుంది. కానీ.. ఆ ఒక్క సార్‌ మాత్రమే మరోలా ఉన్నాడు. వయసులో తనకంటే చాలా పెద్దోడు. అందరి దృష్టిలో మంచోడనే పేరూ ఉంది. తరగతి గదిలో, కళాశాల ఆవరణలో అందరూ ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడే.. మాటతీరు, అతడి ప్రవర్తన మారుతోంది. అందంగా ఉన్నావంటూ వ్యంగ్యంగా, అసభ్యకరమైన రీతిలో మాట్లాడుతున్నాడు. ద్వంద్వ అర్థం వచ్చేలా సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు చేస్తున్నాడు. ఒకట్రెండు సార్లు చేతులనూ పట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆమెలో తెలియని భయం ఏర్పడింది. ఇదంతా ఇంట్లో వాళ్లకో.. స్నేహితులకో.. కళాశాల యజమాన్యానికో చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. ఎక్కడ తనది.. తన కుటుంబానిదీ పరువు పోతుందోనన్న భయం. మరోవైపు అతడిని ఎదిరించినా.. లేదా ఇలాగే మౌనంగా ఉన్నా ఇంకేం చేస్తాడోనన్న భయాందోళన.. వీటిమధ్య తనలో తానే కుమిలిపోతోంది.

నిర్మల్‌ : ప్రతి చోటా మహిళలపై వేధింపులు సర్వసాధారణమయ్యాయి. రోజూ ఆటోలో ఉద్యోగానికి వెళ్తున్న ఓ ఉద్యోగిని ఆటోడ్రైవర్‌ వేధింపులతో ఇబ్బంది పడుతోంది. ఓ పెద్ద దుకాణంలో పనిచేస్తున్న మరో యువతి యజమాని నుంచి వేధింపులు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ కార్యాలయాలోనూ వేధింపులకు గురవుతున్న ఉద్యోగినుఎందరో. అడుగడుగునా అతివలు ఇబ్బందులు పడుతున్నా తమలో తామే కుమిలిపోతున్నారు. తమ పైకి వస్తున్న మృగాడిని తనను వదిలేయాలంటూ అమాయకురాలిలా వేడుకుంటున్నారే తప్పా.. అపరచండిలా అతడిని ఎదిరించే సాహ సం చేయడం లేదు. ఇప్పుడిప్పుడే మృగాళ్ల ఆకృత్యాలను బయటపెట్టే గొంతులు వినిపిస్తున్నాయి.

ఒక్కొక్కరుగా తమకు జరిగిన, జరుగుతున్న వేధింపులపై పెదవి విప్పుతున్నారు. ఎక్కడో అమెరికాలో ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు మన దేశం, మన రాష్ట్రానికి విస్తరిం చింది. ఇక మన జిల్లా, మండలం, గ్రామం, గల్లీలోనూ.. తల్లీచెల్లీ తమకు జరుగుతున్న దారుణంపై గొంతు విప్పాల్సిన సమయం వచ్చింది. నిర్భయంగా దీనిపై మహిళాలోకం గొంతెత్తాలని స్త్రీవాదులు పిలుపునిస్తున్నారు.

అమాయకత్వమే ఆసరాగా..
చదువు, తెలివితో రాణిస్తూ ఆకాశంలో.. అవకాశాల్లో ఆమె సగమైంది. కానీ ఇప్పటికీ చాలా విషయాల్లో అబల అమాయకురాలిగా, అశక్తురాలిగానే ఉంటోంది. కుటుంబం, సమాజం, పిల్లలు, డబ్బు, ఉద్యోగం, పరువు.. ఇలా ఏదో ఒక బలహీనత ఆమెలోని శక్తిని హరించేస్తోంది. ఇదే.. ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించే వాళ్లకు ఆసరాగా మారుతోంది.  చాలామంది చట్టాలు, సెక్షన్లు తెలిసిన ప్రభుత్వ ఉద్యోగినులు సైతం పరువు పోతుందన్న బాధతోనే వేధింపులను పంటి బిగువన పట్టి ఉంచుతున్నారు. 

పనిచేసే ప్రతిచోటా.. 
‘మీ టూ’ గురించి ఈ మధ్య చదువుతున్న, వింటున్న స్థానికులు చాలామంది మన దగ్గరా ఇలాంటివి జరుగుతుంటాయా.. అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. అక్కడ, ఇక్కడ అని కాదు.. మహిళలపై ప్రతిచోటా లైంగిక వేధింపులు పెరుగుతుండడం ఆందోళనకరం. ప్రధానంగా జిల్లాలో ఇటీవల కాలంలో ఇలాంటి వేధింపులు వేగంగా పెరుగుతున్నాయి. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో వివిధ దుకాణాలు, హోటళ్లు, ప్రైవేటు కార్యాలయాల్లో యువతులు, మహిళలు పనిచేస్తున్నారు. ఇలాంటి చోట్లలో చాలామంది వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారు. బయటకు వచ్చి చెప్పుకుంటే.. పరువుతోపాటు ఉన్న ఉపాధి పోతుందన్న భయం బాధితుల నోరు తెరువనివ్వడం లేదు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు, కెరీర్‌ గైడెన్స్‌ ఇవ్వాల్సిన అధ్యాపకులు సైతం తమ స్టూడెంట్లపై కన్నేయడం, వేధించడం దారుణం. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. 

తానే ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని..
ఓ శాఖకు చెందిన ఉద్యోగిని తన పై అధికారి నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. సంబంధిత శాఖపనిపైన కాకుండా పర్సనల్‌ విషయాలను మాట్లాడడం, చొరవ తీసుకోవడం చేశాడు. సెల్‌ఫోన్‌కు రాత్రిపూట మెసేజ్‌లు పంపించడం, ఫోన్లు చేయడం వంటివీ కొనసాగించాడు. ఎంత నచ్చజెప్పినా సదరు సారులో మార్పు కనిపించలేదు. దీంతో సదరు ఉద్యోగిని తనపై జరుగుతున్న వేధింపులను అప్పటి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చివరకు సదరు అధికారి విషయం తెలుసుకుని కాళ్లబేరానికి వచ్చినా.. అక్కడ ఉండ డం ఇష్టం లేక సదరు ఉద్యోగిని దూరంగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని వెళ్లిపోయారు. మరోశాఖలోనూ ఓ స్థాయి అధికారి ఇదే తీరుగా తన కింది ఉద్యోగిని పట్ల ప్రవర్తించిన విషయంపై విచారణ వరకూ వెళ్లినా.. అధికారులు బయటకు రానివ్వలేదన్నది సమాచారం.

చట్టం అమలులో ఉంది..
వేధింపుల భరతం పట్టేందుకు అతివలు అపర కాళీలా మారాల్సిన పనిలేదు. తన స్వేచ్ఛ, హక్కులను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటే సరిపోతుంది. మహిళలు పనిచేసే చోటే ఎక్కువగా లైంగిక వేధింపుల బారిన పడుతున్నారు. రాజ్యాంగంలోని 14, 15 ఆర్టికల్స్‌ ప్రకారం లైంగిక వేధింపులు అనేవి స్త్రీ ప్రాథమిక హక్కులను ఉల్లఘించేవి. ఈ నేపథ్యంలో ‘పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నిషేధ చట్టం–2013’ అమలులోకి తీసుకువచ్చారు. 2013 డిసెంబర్‌ 9నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం మహిళలు పనిచేసే చోట వారికి ఎదురయ్యే వేధింపులు, సమస్యలపై విచారించేందుకు ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులపై 90రోజుల వ్యవధిలో కమిటీ విచారణ పూర్తిచేయాలి. చట్టం ప్రకారం ఈ విచారణ గోప్యంగా ఉంచాలి. ఒకవేళ ఎవరైనా బహిర్గత పరిస్తే అందుకు తగిన జరిమానా ఉంటుంది.

విచారణ తర్వాత నివేదికను జిల్లా అధికారి(కలెక్టర్‌/స్త్రీ శిశు సంక్షేమశాఖాధికారి)కి పంపించాలి. వారు 60రోజులలోపు దానిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లా అధికారి తమ జిల్లాలో ఈ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బాధిత మహిళలు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి సఖి కేంద్రాలు సహకరిస్తాయి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక ఆదిలాబాద్‌లోనే ఉంది. మహిళలతోపాటు 18ఏళ్లలోపు బాలికలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు జిల్లాలో పలువురు సభ్యులతో కలిపి ‘కాన్సిట్యూషన్‌ ఆఫ్‌ మల్టీ డిసిప్లినరీ టీమ్‌’ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే తరచూ కమిటీల సమావేశాలను ఏర్పాటు చేస్తూ.. చట్టాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

పట్టించుకోని అధికారులు..
జిల్లాలో మహిళలపై వేధింపుల నిరో«ధానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. చట్టాలపై అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. చాలా శాఖలు, కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, దుకాణాలు, ఇతరత్రా పనిప్రదేశాల్లో మహిళల కోసం ఇప్పటి వరకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను వేయనేలేదు. జిల్లా స్థాయి కార్యాలయాల్లోనే ఇప్పుడిప్పుడు కమిటీలు వేస్తుండడం గమనార్హం. ప్రభుత్వ పరంగా అతివలకు చేయూత ఇంత దారుణంగా ఉన్నందునే వారు నిర్భయంగా ముందుకు వచ్చి తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోలేక పోతున్నారు. కానీ.. ఇటీవల దేశంలో వస్తున్న ‘మీ టూ’ ఉద్యమం ఎంతోకొంత మార్పును తీసుకువస్తుందని స్త్రీవాదులు ఆశిస్తున్నారు.

ధైర్యంగా ముందుకు రావాలి..
మహిళలు, యువతులు, విద్యార్థినులు తమకు ఎదురవుతున్న వేధింపులను ఎదుర్కొనేందుకు ధైర్యంగా ముందుకు రావాలి. జిల్లాలో తమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కానీ.. ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను, వివరాలను గోప్యంగా ఉంచుతాం.
అంజమ్మ, మహిళా ఎస్‌ఐ, నిర్మల్‌

సుమోటోగా తీసుకోవచ్చు..
మహిళలతోపాటు పద్దెనిమిదేళ్ల లోపు బాలికలపై లైంగిక వేధింపులు జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బాలికలపై జరుగుతున్న వేధింపులపై విచారణ జరిపేందుకు సదరు కేసును సుమోటోగా తీసుకోవచ్చు. మహిళలు, విద్యార్థినులూ చట్టాలను తెలుసుకోవాలి.
– దేవీ మురళి, డీసీపీఓ, నిర్మల్‌

కమిటీలు ఏర్పాటు..
జిల్లాలోని అన్ని శాఖల కార్యాలయాలు, సంస్థల్లో మహిళల రక్షణ కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేసేలా చూస్తున్నాం. ఇప్పటికే చాలా శాఖల్లో కమిటీలు ఉన్నాయి. తమకు జరుగుతున్న అన్యాయంపై ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. అప్పుడే విచారణ తర్వాత తగిన చర్యలకు అవకాశం ఉంటుంది.
– విజయలక్ష్మి, జిల్లా  మహిళా సంక్షేమ అధికారి, నిర్మల్, 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top