బేగంబజార్‌.. మధ్యాహ్నం 3 వరకే.. 

Megambazar Merchants who have shrunk their time with fear of Corona - Sakshi

కరోనా భయంతో సమయం కుదించిన వ్యాపారులు 

నేటి నుంచే అమలు..

సాక్షి,హైదరాబాద్‌/అబిడ్స్‌: బేగంబజార్‌.. హైదరాబాదీయులకే కాదు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలవారికి కూడా సుపరిచితమైన ప్రాంతం. ఏ వస్తువైనా చౌకగా లభిస్తుండటంతో చిన్నచిన్న వ్యాపారులంతా ఇక్కడి నుంచే కొనుగోలు చేసి తమ ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. నిత్యం దాదాపు రూ.500 కోట్ల మేర ఇక్కడ లావాదేవీలు జరుగుతుంటాయి. అలాంటి బేగంబజార్‌ కరోనా కారణంగా తల్లడిల్లుతోంది. ఈ వైరస్‌ ముప్పు ఎక్కడ నుంచి ఎలా వస్తుందో అనే భయంతో వ్యాపారస్తులు కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ సమయాన్ని తగ్గించాలని నిర్ణయించారు. శుక్రవారం నుంచి ప్రతిరోజూ ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వర కే హోల్‌సేల్‌ కిరాణా దుకాణాలు తెరిచి ఉంచాలని బేగంబజార్‌ కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ తీర్మానించినట్టు అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠీ తెలిపారు. కరోనా పెరుగుతుండటం తో తమ వ్యాపారస్తులంతా భయంతోనే వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.  

లాక్‌డౌన్‌తో క్రయవిక్రయాలపై ప్రభావం.. 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 22 నుంచి బేగంబజార్‌లోని నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగిలినవన్నీ మూసి ఉంచారు. దీంతో వ్యాపారులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. లాక్‌డౌన్‌లో కూడా నిత్యవసర వస్తువుల దుకాణాలను ఉద యం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వ రకు తెరిచి ఉంచారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచారు. ప్రస్తుతం వినియోగదారులు ఎక్కువగా నిత్యావసర వస్తువులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఎక్ట్రానిక్‌ వస్తువులు, బంగారు ఆభరణాలు, స్టీల్, వెండి, రాగితో పాటు ఇతర వస్తువుల వైపు ఎవరూ చూడటంలేదు. లాక్‌డౌన్‌ అనంతరం కూడా మార్కెట్‌లో పూర్తి స్థాయి లో క్రయవిక్రయాలు జరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. 

గుండుసూది నుంచి గోల్డ్‌ వరకు... 
బేగంబజార్‌లో దొరకని వస్తువంటూ ఉండదు. గుండు సూది నుంచి బంగారు ఆభరణాల వరకు ఏది కావాలన్నా అక్కడ దొరుకుతుంది. అంతేకాదు.. చౌకధరకే వస్తువులు లభించటం బేగంబజార్‌ ప్రత్యేకత. 1770 నుంచే ఇక్కడ మార్కెట్‌ కొనసాగుతోంది. వందల సంఖ్యలో ఉన్న దుకాణాల్లో రోజూ కోట్లలో వ్యాపారం జరుగుతుంది. దుకాణాలన్నీ జనంతో కిటకిటలాడుతుంటాయి. గృహోపకరణా లు, మేకప్‌ వస్తువులు, డ్రైఫూట్స్, మసాలాలు, సు గంధ ద్రవ్యాలు, స్టీల్‌ వస్తువులు, కిరాణా, ట్రాన్స్‌పోర్టు, టపాసులు, ప్లాసిక్‌ వస్తువులు, ఫర్నిచర్, బంగారం.. ఇలా అనేక వ్యాపారాలకు బేగంబజార్‌ ప్రసిద్ధి. జిల్లాల్లో దుకాణాలు నిర్వహించేవారు ఇక్క డి నుంచే కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ దుకాణాలు చూసేందుకు చిన్నగా కనిపిస్తాయి. వీటికి సంబంధించిన గోడౌన్లు మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి. 

కరోనా ప్రభావం పెరగడంతో..
కిరాణా వ్యాపారులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు షాపులు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. వ్యాపారం 50 శాతానికి పడిపోయినా సమయాన్ని కుదించాం. లాక్‌డౌన్‌ తర్వాత వ్యాపారం అంతగా లేకపోయినా కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. దీంతో బేగంబజార్‌లో ఈ మహమ్మారి ప్రబలకుండా చూసేందుకు సమయాన్ని తగ్గించాం. ప్రతి షాపులో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటుచేశాం. ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయడంతోపాటు వినియోగదారులకు చేతి గ్లౌజులు అందజేస్తున్నాం.     
– లక్ష్మీనారాయణ రాఠీ, కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top