వారక్కడ లేరు!

Maoist Leaders are Safe - Sakshi

సేఫ్‌జోన్‌లోనే మావోయిస్టు అగ్రనేతలు   

ఎన్‌కౌంటర్‌లో మరణించారనేది ప్రచారమే

సాక్షి ప్రతినిధి, వరంగల్, భద్రాచలం : తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌ మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలెవరూ లేరని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీంతో ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ అలియాస్‌ యాప నారాయణ, ఆయన భార్య సమ్మక్క, కేకేడబ్ల్యూ కమిటీ కార్యదర్శి దామోదర్‌ అలియాస్‌ బడే చొక్కారావు, ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి గోపన్న ఆలియాస్‌ కొయ్యాడ సాంబయ్యలు మృతి చెందారంటూ జరిగినదంతా ప్రచారమేనని స్పష్టమైంది.

తొలుత ఎన్‌కౌంటర్‌ స్థలంలో ఏకే 47 తుపాకీ లభించడంతో అగ్రనేతలెవరో చనిపోయి ఉంటారన్న అభిప్రాయం వెలువడింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు కూడా పోలీసు శాఖ నుంచి స్పష్టమైన సమాచారమేదీ రాలేదు. దాంతో మావోయిస్టు అగ్రనేతల కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల వివరాలను శనివారం మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ ప్రకటన విడుదల చేశారు.

దండకారణ్యంలోనే నేతలు..
కొంతకాలంగా తెలంగాణలో పార్టీని బలోపే తం చేసేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే గోదావరి తీరం లో రాకపోకలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా డివిజన్‌ కమిటీ సభ్యుడు దడబోయిన స్వామి అలియాస్‌ ప్రభాకర్‌ నేతృత్వంలో తెలంగాణ సరిహద్దుల్లో కేడర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ కమిటీ, కేకేడబ్ల్యూ కమిటీలతో పాటు ఇతర కమిటీలకు చెందిన ముఖ్యనేతలందరూ దండకారణ్యంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఆకురాల్చే కాలం కావడంతో అగ్రనేతలంతా దండకారణ్యంలో సేఫ్‌జోన్‌గా భావించే కాంకే డ్, నారాయణ్‌పూర్, దర్భ ప్రాంతాల్లో ఉండే మాడ్‌ ఏరియాలో ఉన్నట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దడబోయిన సాంబయ్య 2001లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఖమ్మం డివిజన్‌ కమిటీ సభ్యుడిగా, సెంట్రల్‌ రీజనల్‌ బ్యూరోతో పాటు మావోయిస్టు పత్రిక క్రాంతి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


తడపలగుట్ట.. తడబాట్లెన్నో..!
తడపల గుట్ట వద్ద శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌ నుంచి శనివారం మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం వరకు ఎన్నో ఘటనలు జరిగాయి, మరెన్నో రకాలుగా ప్రచారం జరిగింది. శుక్రవారం తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్, మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ మృతిచెందాడంటూ బ్రేకింగ్‌ న్యూస్‌లు.. ఆ వెంటనే మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం.. కొంతసేపటికే మృతుల్లో మావోయిస్టులు బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి, గోపన్న ఉన్నారంటూ ప్రచారం.. శనివారం ఉదయం వరకు ఎన్నో ఊహాగానాలు కొనసాగాయి. ఇంత జరుగుతున్నా పోలీసు శాఖ నుంచి వివరణగానీ, స్పష్టతగానీ రాలేదు. చివరికి మావోయిస్టు పార్టీయే మృతుల వివరాలతో ప్రకటన విడుదల చేసింది.

వ్యతిరేకత రాకుండా పోలీసుల వ్యూహం!
తడపలగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసుల ప్రణాళిక బెడిసికొట్టడంతోనే.. అగ్రనేతలు ఉన్నారంటూ లీకులు ఇచ్చి గందరగోళంలోకి నెట్టేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల గోదావరి తీరం వెంబడి జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో.. అటు తెలంగాణ సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ గ్రామాల్లోనూ మావోయిస్టుల కదలికలు పెరిగాయి.

దీంతో నిఘా పెంచిన పోలీసులు.. సరిహద్దుల్లో అగ్రనేతలు మకాం వేసినట్లు సమాచారం అందుకున్నారు. నాలుగు గ్రేహౌండ్స్‌ దళాలతో గాలింపు చేపట్టారు. తడపలగుట్ట వద్ద మావోయిస్టులు తారసపడటంతో ఎన్‌కౌంటర్‌ జరిగింది. పదిమంది మరణించగా.. అందులో ఏడుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వారంతా ఆదివాసీలే కావడంతో ప్రజాసంఘాలు, జనం నుంచి వ్యతిరేకత తగ్గించుకునేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారని.. ప్రజల దృష్టి మళ్లించేందుకు అగ్రనేతల పేర్లను ప్రచారంలోకి తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కలవరం రేపుతున్న ‘ఇన్‌సాస్‌’రైఫిళ్లు
మహదేవపూర్ ‌: అత్యాధునికమైన ‘ఇన్‌సాస్‌’రైఫిళ్లను మావోయిస్టులు వినియోగిస్తుండటం పోలీసుల్లో కలవరం రేపుతోంది. శుక్రవారం తడపలగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ స్థలంలో ఒక ఏకే 47తో పాటు ఐదు ఇన్‌సాస్‌ రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్, రెండు సింగిల్‌ బ్యారెల్‌ రైఫిళ్లు, పాయింట్‌ 303 రైఫిల్, మూడు క్లెమోర్‌ మైన్లు, ఆరు రాకెట్‌ బాంబులు లభించాయి. అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ’ఉత్పత్తి చేస్తున్న ఇన్‌సాస్‌ రైఫిళ్ల సైనిక బలగాలు వినియోగిస్తుంటాయి. అలాంటివి మావోయిస్టుల వద్ద లభించడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌లో అధికారంలో ఉన్న మావోయిస్టు ప్రభుత్వం.. ఆ ఆయుధాలను సరఫరా చేస్తోందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫోరెన్సిక్‌ నిపుణుడి అసంతృప్తి?
మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం చేసే క్రమంలో వరంగల్‌ నుంచి ఫోరెన్సిక్‌ నిపుణుడు వచ్చారు. మార్చురీలో నిబంధనలకు అనుగుణంగా వసతుల్లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఓ ఐపీఎస్‌ అధికారి జోక్యం చేసుకుని.. ‘పైపైన పోస్టు మార్టం పూర్తిచేసి నివేదిక ఇవ్వండి’అన్నట్లు సమాచారం. దానికి అంగీకరించని ఫోరెన్సిక్‌ నిపుణుడు.. హైకోర్టు న్యాయమూర్తిని ఫోన్‌లో సంప్రదించారని, వారు సుప్రీం కోర్టు న్యాయవాదికి ఫోన్‌ చేశారని.. ఈ క్రమంలో పోలీసులు కొంత వెనక్కి తగ్గార ని తెలిసింది. చివరికి స్థానిక ఆస్పత్రికి చెందిన ఓ వైద్యుడు కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగిందని సమాచారం.

మరోసారి కాల్పులంటూ ప్రచారం
శనివారం ఉదయం ఎనిమిది గంటలకే మావోయిస్టుల మృతదేçహాలు భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నాయి. పది గంటల తర్వాత పోస్టుమార్టం ప్రక్రియ మొదలైంది. అదే సమయంలో కోడిపుంజులగుట్ట వద్ద మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయంటూ మరోసారి లీకులు అందాయి. దాంతో అందరి దృష్టీ అటువైపు మళ్లింది. కానీ కొద్దిసేపటికే అదేమీ లేదని వెల్లడికావడం గమనార్హం.

పోస్టుమార్టం సందర్భంగా ఉద్రిక్తత
తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌ మృతదేహాలను శనివారం ప్రత్యేక హెలికాప్టర్‌లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం ప్రక్రియ ఈ సందర్భం గా ఆస్పత్రి పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశా రు. మావోయిస్టుల కుటుంబ సభ్యులు, పౌరహక్కుల సంఘాల నేతలు ఆస్పత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులను కూడా దూరంగా పంపించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

భద్రాచలం మేజిస్ట్రేట్, ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ రాజేంద్ర కుమార్, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు తహసీల్దార్లు పీవీ రామకృష్ణ, ఎలిజబెత్, సురేశ్, శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో పోస్టుమార్టం జరిగింది. మృతుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు ఒకరు ఉండగా.. మిగతా వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని భద్రాద్రి జిల్లా ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝా వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన కానిస్టేబుల్‌ సుశీల్‌కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వస్థలానికి పంపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top