సెక్యులర్‌ శక్తులన్నీ ఏకం కావాలి

సెక్యులర్‌ శక్తులన్నీ ఏకం కావాలి - Sakshi


బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అత్యంత ప్రమాదకరమైనవి

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ మాటలతో మోసం చేస్తున్నారు

తెలంగాణ సోనియా దయతోనే వచ్చింది

అంబేడ్కర్‌కు పూలమాలవేసే తీరిక కేసీఆర్‌కు లేదు

తాండూరులో బడుగు, బలహీనవర్గాల గర్జన సభ

మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలి: లోక్‌సభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే




సాక్షి, వికారాబాద్‌: మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి సెక్యులర్‌ శక్తులన్నీ ఏకం కావాలని లోకసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 126వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ‘బడుగు, బలహీనవర్గాల గర్జన’సభను గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఎంతో ప్రమాదకరమైనవని, వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.



 ఆ పార్టీ నేతలు గతంలో అంబేడ్కర్‌ పేరును కూడా ప్రస్తావించడానికి ఇష్టపడేవారుకాదని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పథకానికి ఆయన పేరుపెడుతున్నా.. దళితులకు, బలహీనవర్గాల ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. అంబేడ్కర్‌ సమాజంలోని అన్నివర్గాల ప్రజల ఉన్నతికోసం కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్‌పార్టీ 70 ఏళ్లుగా దేశానికి ఏం చేసిందని మోదీ అంటున్నారని, తాము చేసిన కృషి ఫలితమే నేటి దేశాభివృద్ధి అన్నారు.



లక్షల కిలోమీటర్ల రోడ్లు, వేల కిలోమీటర్ల రైల్వేలైన్లు వేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. 13 ఏళ్లు గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీ ఆ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. గుజరాత్, తెలంగాణలో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణలో రైతుల రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేశానని కేసీఆర్‌ అనుకుంటున్నారని, వాస్తవానికి ఆ డబ్బు వడ్డీకే సరిపోయిందన్నారు. తెలంగాణ సోనియా చలవతోనే వచ్చిందని, కేసీఆర్‌ మాత్రం తన దీక్షా ఫలితంగా వచ్చిందని డాంబికాలు పలుకుతున్నారన్నారు. చాయ్‌వాలా ఈ దేశానికి ప్రధాని అయ్యారని మోదీ గొప్పలు చెబుతుంటారని, కాంగ్రెస్‌ హయాంలోనూ ఎంతో మంది పేదలు, బలహీనవర్గాలవారు ఉన్నత పదవులు సాధించారని గుర్తుచేశారు.



 గోరక్ష పేరుతో ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలతో కేసీఆర్‌ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారని ప్రజలు ఇది గమనించాలని తెలిపారు. అమలుకు వీలుకాని మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టి వారిని మభ్యపెడుతూ ఓట్లకోసం మోసం చేస్తున్నారని ఆరోపించారు.



రాజ్యాంగంలో 50శాతం వరకు మాత్రమే రిజర్వేషన్ల అమలుకు వీలుందని, కేసీఆర్‌ మాత్రం బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందదని తెలిసి కూడా అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టారన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అంబేడ్కర్‌ జయంతి రోజు రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్‌ సైతం పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని, కేసీఆర్‌కు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసే తీరిక లేకుండా పోయిందని విమర్శించారు.



2019లో అధికారం కాంగ్రెస్‌దే: ఉత్తమ్‌

2019లో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయఢంకా మోగిస్తుందని టీపీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో రాహుల్‌గాంధీ హామీ ఇచ్చినట్లుగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించడమేకాకుండా అదనంగా మరో గదిని నిర్మించి ఇస్తామన్నారు. నిరుద్యోగులకు భృతిని అందజేస్తామని హామీ ఇచ్చారు.



 మెదక్, హైదరాబాద్‌లో కొన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టి రాష్ట్రం మొత్తం కట్టినట్లు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని కేసీఆర్‌ తీరును దుయ్యబట్టారు. స్వాతంత్య్రానంతరం ఇంతగా దోచుకున్న కుంటుంబం ఏదైనా ఉందంటే.. అది కేసీఆర్‌ కుటుంబమేనని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇబ్బడిముబ్బడిగా దోపిడీ చేస్తున్నారని, కమీషన్ల కోసమే కొత్త పథకాలు, కాంట్రాక్టులు ప్రవేశపెడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ కోసం కూలీ పనిచేస్తామని బయలుదేరిన కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవిత లక్షలు దండుకుంటున్నారని ఆరోపించారు. 50శాతం మహిళా జనాభా ఉంటే ఒక్క మంత్రి పదవి కూడా వారికి ఉండదా? అని ఉత్తమ్‌ నిలదీశారు.



మైనార్టీల రిజర్వేషన్లు కేసీఆర్‌ రాజకీయ ఎత్తుగడ: దిగ్విజయ్‌సింగ్‌

మైనార్టీల రిజర్వేషన్లను కేసీఆర్‌ ప్రభుత్వం రాజకీయ ఎత్తుగడగా మార్చిందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ విమర్శించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రిజర్వేషన్లతో మైనార్టీలకు ఒక దారిచూపెట్టారని గుర్తుచేశారు. కేసీఆర్‌ చేసిన రిజర్వేషన్ల పెంపు న్యాయస్థానంలో నెగ్గదన్నారు. తన బాధ్యతను కేసీఆర్‌‡ కేంద్రంపై నెట్టారే తప్ప...ఇందులో నీతి, నిజాయితీ లేదని స్పష్టం చేశారు. మోదీ అబద్ధాలతో పాలన చేస్తున్నారని విమర్శించారు. నోట్ల రద్దుతో నల్లడబ్బు వెనక్కువస్తుందా? అని ప్రశ్నించారు. నిద్రపోతున్న సమాజాన్ని అంబేడ్కర్‌ మేల్కొలిపారని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top