స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయండి

స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయండి


కేంద్రానికి పోచారం విజ్ఞప్తి

నకిలీ విత్తనాల నియంత్రణకు చట్టం తేనున్నట్లు వెల్లడి  




సాక్షి, న్యూఢిల్లీ: పంటల ఉత్పాదకత పెంచి, గిట్టుబాటు ధర కల్పించేందుకు స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను అమలు చేయాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో భారత వ్యవసాయ పరిశోధన మండలి 88వ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యవసాయ రంగంలో ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలు రైతులకు ఏ మేరకు లాభం చేకూర్చాయి, విభిన్నమైన భౌగోళిక, నైసర్గిక పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో పంటల ఉత్పాదకతను పెంచడానికి ఎలాంటి పరిశోధనలు అవసరం అన్న అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో మంత్రి పోచారం పాల్గొని ప్రసంగించారు.


రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, పంటకు అయిన పెట్టుబడి కంటే అధికంగా అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయంపై స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని, దీనిపై ప్రధాని మోదీ కూడా హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పటికైనా కమిషన్‌ సిఫార్సులను అమలు చేసి రైతులకు ప్రయోజనం కల్పించాలని కోరారు.



కేంద్ర మంత్రితో భేటీ

సమావేశంలో ప్రసంగించిన అనంతరం అక్కడే కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో పోచారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి రైతు పొలంలో భూసార పరీక్షలు నిర్వహించాలని, దీని కోసం తెలంగాణకు మినీ భూసార పరీక్షల లేబోరేటరీలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనలో ఒక జిల్లాలో ఒక పంటను విలేజ్‌ యూనిట్‌గా పరిగణించి.. మిగతా పంటలను మండల యూనిట్లుగా పరిగణించడం అశాస్త్రీయమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒక జిల్లాకు ఒక పంటను విలేజ్‌ యూనిట్‌గా పరిగణించడంతో రైతులకు పరిహారం అందడంలో ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో.. జిల్లాకో కృషి విజ్ఞాన కేంద్రాన్ని కేటాయించాలని కోరారు.



మిరప విత్తన చట్టం తెస్తాం..

రాష్ట్రంలో నకిలీ విత్తనాలను సరఫరా చేసే ఏజెంట్లు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అందుకు అనుగుణంగా ప్రత్యేక చట్టాలను రూపొందిస్తామని పోచారం తెలిపారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో మిరప విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోతే.. ఆ మేరకు సంబంధిత సంస్థల నుంచి పరిహారం వసూలు చేసి, రైతులకు అందించేలా నిబంధనలు చేర్చుతామని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top