డీజీపీగా ఆ ఘనత అనురాగ్‌శర్మకే: మహేందర్ రెడ్డి

Mahender Reddy takes office as telangana dgp - Sakshi

తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్ : శాంతి భద్రతల విషయంలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్న రాష్ట్ర పోలీస్ శాఖకు బాస్‌గా బాధ్యతలు చేపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి. డీజీపీగా మహేందర్‌రెడ్డి ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీకి అనురాగ్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన అనురాగ్ శర్మ వీడ్కోలు సభలో నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ పోలీస్‌ను నెంబర్ వన్‌గా నిలబెట్టిన ఘనత డీజీపీగా అనురాగ్‌శర్మకు దక్కిందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పోలీసులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు.

కొత్త రాష్ట్రంలో అన్ని ఇబ్బందులను అధిగమించినట్లు చెప్పారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని తెలంగాణ పోలీసులు నిరూపించారని కొనియాడారు. పోలీసులు శాంతి భద్రతలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నరని తెలిపారు. రాష్ట్ర పోలీసులు టెర్రరిజం, నక్సలిజం సమస్యలను ధీటుగా ఎదుర్కొంటున్నట్లు మహేందర్ రెడ్డి చెప్పారు. ప్రజలకిచ్చే సేవల నాణ్యత, అన్ని పోలీసు కమిషనరేట్లలో ఒకేలా ఉండేలని అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్ అయినా.. హైదరాబాద్ అయినా ఒకే విధంగా పోలీసు వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అధ్యయనశీలి.. అనుభవశాలి..
డీజీపీగా నియమితులైన ఎం మహేందర్‌రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం. 1962 డిసెంబర్ 3న రైతు కుటుంబంలో జన్మించారు. వరంగల్ ఆర్‌ఈసీ నుంచి బీటెక్ (సివిల్) పూర్తిచేశారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చదువుతుండగానే 1986లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. సైబరాబాద్ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, గ్రేహౌండ్స్ ఐజీగా వ్యవహరించారు. 2014 జూన్ 2 నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న మహేందర్‌రెడ్డి.. సిటీ పోలీస్‌ను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చారన్న పేరుతెచ్చుకున్నారు.

కరీంనగర్, గుంటూరు, ఆదిలాబాద్, నిజామాబాద్, కర్నూల్ జిల్లాల్లో మహేందర్‌రెడ్డి వివిధ హోదాల్లో పనిచేశారు. ఇంటెలీజెన్స్ చీఫ్, గ్రేహౌండ్స్ ఐజీగా, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్‌గా మహేందర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడళ్లను అందుకున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేశారు. యూఎస్, యూకే దేశాల్లో పోలీస్ వ్యవస్థపై అధ్యయనం చేసివచ్చారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా శ్రీనివాసరావు
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ గా వి.వి. శ్రీనివాసరావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. డీజీపీగా ఉన్న అనురాగ్ శర్మ ఉద్యోగ విరమణ చేయడం, నగర పోలీస్ కమిషనర్ గా ఉన్న మహేందర్ రెడ్డి నూతన డీజీపీగా నియమింపబడడంతో ఖాళీగా ఉన్న పోలీస్ కమిషనర్ స్థానంలో శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top