పెద్దలకు చెప్పలేక.. ప్రేమను చంపుకోలేక


ఇల్లంతకుంట: మతాలు వేరైనా మనసులు ఒక్కటయ్యాయి.. ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామనుకున్నారు.. కానీ, ఈ విషయాన్ని కుటుంబ పెద్దలకు చెప్పుకోలేక.. ప్రేమను చంపుకోలేక మదనపడ్డారు. ఈ జన్మలో తమ వివాహాం కాదని.. కనీసం చావుతోనైనా ఒకటవుదామనుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో శుక్రవారం వేకువజామున జరిగింది. గ్రామానికి చెందిన వొల్లాల రవి(26), అదే గ్రామానికి ఎండీ సమ్రీన్‌(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.ఇటీవల తన ప్రేమ విషయాన్నిరవి స్నేహితుల వద్ద చర్చించాడు. ఇద్దరి మతాలు వేరుకావడంతో వివాహానికి రెండు కుటుంబాల సభ్యులు ఒప్పుకోరని స్నేహితులు చెప్పారు. ఇదే విషయాన్ని రవి, సమ్రీన్‌ చర్చించుకున్నారు. పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించకపోతే ఇక చావే పరిష్కారమని నిర్ణయించుకున్నారు. తొలుత సమ్రీన్‌ తన ఇంట్లో వేకువజామున 3 గంటలకు పురుగుల మందు తాగింది. అదే సమయంలో రవి తన వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగాడు. వారి వారి కుటుంబసభ్యులు వేర్వేరుగా ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న రవి, సమ్రీన్‌ కుటుంబ సభ్యులను ఎస్సై లక్ష్మారెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Back to Top