సోయా విత్తనాల లారీ పట్టివేత 

Lorry Seized For Distributing Fake Seeds In Bichkunda, Kamareddy - Sakshi

అనుమతి లేకుండానే విక్రయాలు

రోజుకో కంపెనీ పేరుతో విక్రయిస్తున్న వైనం  

సాక్షి, బిచ్కుంద (కామారెడ్డి): ఖరీఫ్‌ ప్రారంభమైన తరుణంలో నకిలీ విత్తనాల దందా మళ్లీ ఊపందుకుంది!. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా వివిధ కంపెనీల విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఇటీవల అనుమతి లేకుండా సోయా విత్తనాలు విక్రయిస్తూ ఓ లారీ పట్టుబడిన ఉదంతం మరవక ముందే తాజాగా మరో లారీ పట్టుబడింది. మండలంలోని ఫత్లాపూర్‌లో లారీలో విత్తనాలు తీసుకొచ్చి విక్రయిస్తుండగా వ్యవసాయ అధికారులు సోమవారం పట్టుకుని, లారీని సీజ్‌ చేశారు. అంకాపూర్‌ కేంద్రంగా విత్తనాల దందా కొనసాగుతుందని అధికారులు గుర్తించారు. దీనిపై గట్టి నిఘా పెట్టినట్లు వారు తెలిపారు.

అక్రమంగా విక్రయాలు.. 
వితనోత్పత్తి పథకం కింద కంపెనీ పేరుతో విత్తనాలు అమ్మడానికి అనుమతి తీసుకోవాలి. అలాగే, గ్రామాల్లో ఏజెన్సీ ద్వారా విక్రయించడానికి లైసెన్సు కావాలి. కానీ, వీటన్నిటిని తుంగలో తొక్కి యథేచ్ఛగా సోమవారం ఫత్లాపూర్‌ గ్రామంలో లారీలో 500 బస్తాలు తీసుకొచ్చి విక్రయిస్తుండగా ఏవో పోచయ్య పట్టుకున్నారు. ఈ నెల 15వ తేదీన గుండెకల్లూర్‌లో పట్టుబడిన అంకాపూర్‌ విఘ్నేశే.. తాజాగా ఫత్లాపూర్‌లో విత్తనాలు విక్రయిస్తూ దొరికిపోయాడు. కమీషన్‌ పేరుతో గ్రామంలో ఒకరిద్దరిని మచ్చిక చేసుకుని విత్తనాలు విక్రయిస్తున్నారు.

రకరకాల కంపెనీల పేర్లతో.. 
విఘ్నేశ్‌ మొన్న గుండెకల్లూర్‌లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుణోదయ ఆగ్రో సీడ్స్‌ కంపెనీ విత్తనాలు విక్రయించాడు. తాజాగా ఫత్లాపూర్‌లో హై దరాబాద్‌కు చెందిన వర్ధ కంపెనీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. రకరాకల కంపెనీల పేరుతో విత్తనాలు విక్రయించడంపై అధికారులు విగ్నేష్‌ని విచారించగా, పలు విషయాలు వెల్లడించాడు. అంకాపూర్‌ గ్రామంలో గోదాం ఉందని, అక్కడ సుమాంజలి, అరుణోదయ, వర్ధ తదితర 10 రకాల కంపెనీల విత్తనాలు ఉన్నాయని చెప్పా డు. అక్కడి నుంచి విత్తనాలను తీసుకొచ్చి జుక్క ల్, బిచ్కుంద, మద్నూర్‌ మండలాల్లో విక్రయిస్తున్నామని వివరించాడు. మూడు మండలాల్లో వివిధ కంపెనీల పేరుతో సుమారు 4 వేల బస్తాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు.

బిల్లుపై అనుమానం.. 
ఫత్లాపూర్‌ గ్రామ కమిటీ పేరుతో 500 వస్తాలు ఉన్నాయని బిల్లులో రాసి ఉంది. అయితే, విత్తనాలకు సంబంధించిన డబ్బులు ఎన్ని, విలువ ఎంత, జీఎస్టీ ఎంత అనేది మాత్రం అందులో రాయలేదు. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ స్పందించి విచారణ జరిపించి రైతులు కోరుతున్నారు.

లారీ సీజ్‌.. 
రెండ్రోజుల క్రితం గుండెకల్లూర్‌లో, తాజాగా ఫత్లాపూర్‌లో సోయా విత్తనాలు విక్రయిస్తుండగా లారీని పట్టుకున్నామని ఏడీఏ ఆంజనేయులు ‘సాక్షి’కి తెలిపారు. అంకాపూర్‌ విగ్నేశ్‌ అనే వ్యక్తి లైసెన్సు, ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకుండానే వివిధ కంపెనీల విత్తనాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడని, దీంతో లారీ (టీఎస్‌16 యూబీ 3632)ని సీజ్‌ చేశామని చెప్పారు. గుండెకల్లూర్‌లో పట్టుకున్నప్పుడు లైసెన్సు తీసుకొచ్చి చూపిస్తామని చెప్పిన విఘ్నేశ్‌ మూడు రోజులైనా తీసుకురాలేదని తెలిపారు. తాజాగా ఫత్లాపూర్‌లో విత్తనాలు అమ్ముతుండగా పట్టుకున్నామని వివరించారు. అనుమతి లేకుండా ఎక్కడైనా విత్తనాలు విక్రయిస్తే సీజ్‌ చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతులు మోసపోకుండా ఉండడానికి గట్టి నిఘా పెట్టామని, రైతులు ఇతరుల మాటలు మోసపోవద్దని సూచించారు.

రైతులు జాగ్రత్తపడాలి.. 
ప్రభుత్వం అందిస్తున్న ధరకే విక్రయిస్తున్నామంటూ రైతులను మభ్యపెట్టి విత్తనాలు అంటగడుతున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా విక్రయిస్తున్నారు. అయితే, ఆ విత్తనాలు మొలకెత్తక పోయినా, దిగుబడి సరిగా రాకపోయినా రైతులు ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే, విత్తనాలు తీసుకునే సమయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top