సాహితీ సంగమం

Literary Fest Starts in Hyderabad - Sakshi

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌ నేడే ప్రారంభం  

విభిన్న కళలు, భాషలు, సంస్కృతుల సమ్మేళనం  

మూడు రోజుల వేడుక  బేగంపేట్‌ హెచ్‌పీఎస్‌ వేదిక  

సాక్షి, సిటీబ్యూరో: విభిన్న కళలు, భాషలు, సంస్కృతుల సమ్మేళనంగా నిర్వహించనున్న హైదరాబాద్‌ సాహితీ ఉత్సవం కనుల పండువగా జరగనుంది. బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌)లో మూడు రోజుల పాటు జరగనున్న వేడుక శుక్రవారం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సాహితీ ఉత్సవంలో దేశవిదేశాలకు చెందిన సాహితీప్రియులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, వివిధ రంగాల నిపుణులు భాగస్వాములు కానున్నారు. దాదాపు 12 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. చైనా అతిథి దేశంగా హాజరుకానుంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ రచయిత ఎలాయ్‌తో పాటు మరో ఎనిమిది మంది ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. మరోవైపు భారతీయ భాషగా గుజరాతీ సాహిత్యాన్ని పరిచయం చేయనున్నారు. ముఖ్యంగా గుజరాత్‌ సాహిత్యంపై గాంధీజీ ముద్ర  ప్రధాన చర్చనీయాంశం.

తొలిసారిగా ‘కావ్యధార’ పేరుతో వివిధ భాషల కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. ‘మీ టూ’ ఉద్యమంపై చర్చించనున్నారు. అన్ని వర్గాల అభిరుచులకు అనుగుణంగా వివిధ కార్యక్రమాలను రూపొందించారు. ఇది గాంధీ 150వ జయంతి సంవత్సరం కావడంతో ఆయన తాత్విక చింతన, సిద్ధాంతాలపై కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. తొలిరోజు డీమానిటైజేషన్, ఆధార్‌పై చర్చ జరగనుంది. రెండో రోజు (శనివారం) ‘గాంధీ యాన్‌ ఇంపాజిబుల్‌ పాజిబిలిటీ’పై సుధీర్‌ చంద్ర ప్రసంగిస్తారు. ‘ది చీఫ్‌ అండ్‌ ది చీఫ్‌ మినిస్టర్‌’పై కింగ్‌షుక్‌ నాగ్, షుతాపపాల్‌ తదితరులు మాట్లాడతారు. ఈ మూడు రోజుల్లో 30 వర్క్‌షాపులు నిర్వహంచనున్నారు. పిల్లలకు వివిధ అంశాల్లో శిక్షణనిస్తారు. చర్చలు, క్విజ్‌ పోటీలు, ఫిల్మ్‌ మేకింగ్, డైరెక్షన్, మట్టి పాత్రల తయారీ తదితర అంశాలపై శిక్షణ ఉంటుంది. అలాగే పలువురు రచయితలు రాసిన పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. 

తొలిరోజు ఇలా...   
ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు తెలంగాణ టూరిజం పెవిలియన్‌లో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, హెచ్‌ఎల్‌ఎఫ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రముఖ గుజరాతీ రచయిత సితాన్షు యశశ్‌చంద్ర ‘గుజరాతీ లిటరేచర్‌ బిఫోర్, విత్‌ అండ్‌ బియాండ్‌ గాంధీ’ అనే అంశంపై కీలకోపన్యాసం ఇస్తారు.  
ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:10 గంటల వరకు ‘మీ టూ’ ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా తాము ఎదుర్కొన్న వేధింపులను బయటి ప్రపంచానికి తెలియజేసిన చిన్మయి శ్రీపాద, సంధ్యా మీనన్, షుతపా పాల్‌ ‘మీ టూ – ది వే ఫార్వర్డ్‌’ అనే అంశంపై ప్రసంగిస్తారు.
అదే సమయంలో కార్వే కనోపి వేదికపై ‘చైనా సాహిత్యం – సమకాలీన పరిణామాలు’ అంశంపై ప్రముఖ రచయిత ఎలాయ్, గిషూపింగ్, గాన్‌ రెన్షన్‌ మాట్లాడతారు.  
మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు ‘ది ఆధార్‌ స్టోరీ’పై చార్లెస్‌ ఎసిస్సి, రామ్‌నాథ్‌ ప్రసంగిస్తారు. అదే సమయంలో కార్వీ వేదికపై ‘లివింగ్‌ రిలీజియన్‌’ అంశంపై కవితా బుగ్గన, కె.మాధవనె మాట్లాడతారు.  
మధ్యాహ్నం 2 నుంచి 2:40 గంటల వరకు ‘ఎన్‌–కౌంటరింగ్‌ స్టీరియోటైప్స్‌’పై అండాలీబ్‌ వాజిద్, నెయాజ్‌ ఫారూఖీ ప్రసంగిస్తారు. ‘హేపిలీ ఎవర్‌ ఆఫ్టర్‌’ అంశంపై ఆర్తి వి.రామన్, ఉషా నారాయణన్‌ మాట్లాడతారు.
మధ్యాహ్నం 2:50 నుంచి 3:30 గంటల వరకు ‘మిలియన్‌ ముటినీస్‌’పై నిఖిలా హెన్రీ, రష్మీ సక్సేనా మాట్లాడతారు.  కార్వీ వేదికపై ‘ఈజ్‌ గాంధీ రిలవెంట్‌ టు డే’ అనే అంశంపై సి.శంభుప్రసాద్, సుధీర్‌చంద్ర ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 3:40 నుంచి సాయంత్రం 4:20 గంటల వరకు ‘బాలీవుడ్‌ అండ్‌ బియాండ్‌’పై ఎల్హా హిప్తులా, కేతన్‌ మెహతా, సురేశ్‌ జిందాల్‌ మాట్లాడతారు. ‘డీమానిటైజేషన్‌’పై చార్లెస్‌ ఎసిస్సి, సి.రామ్‌మనోహర్‌రెడ్డి మాట్లాడతారు. సాయంత్రం చైనా, గుజరాతీ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.  

‘కావ్యధార’లో...
ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ‘కావ్యధార’ కవి సమ్మేళనంలో వివిధ భాషలకు చెందిన కవుల కవితా పఠనాలు, నృత్య, చిత్ర రూప ప్రదర్శనలు ఉంటాయి. ఆసియా జహూర్, హోషంగ్‌ మర్చెంట్, జమీలా నిషాత్, మామిడి హరికృష్ణ, రిజియో యొహన్నన్, సితాన్షు యశశ్‌చంద్ర, శ్రీదాల స్వామి, ఎస్‌వీ సత్యనారాయణ తదితరులు తమ కవితలను
వినిపించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top