జిగేల్‌ లైటింగ్‌

Lighting Effects to Durgam Cheruvu Cable Bridge - Sakshi

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జికి అత్యాధునిక వెలుగులు

మీడియా డిస్‌ప్లే, నోడ్‌ లైటింగ్‌తో కొత్త అందాలు  

కేబుల్‌ స్టేబ్రిడ్జిపై రూ.5 కోట్లతో పనులు

టెండరు ప్రక్రియ పూర్తి

చైనా సహకారంతో పనులు చేయనున్న ఎంబీఈ

పంద్రాగస్టు రోజున మన జాతీయ జెండా...అక్టోబర్‌ 2న జాతిపిత చిత్రం...జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ ముఖచిత్రం...జాతీయ నేతల పుట్టిన రోజు వేళ వారి ఫొటోలు....ఇవన్నీ విద్యుత్‌ కాంతుల రూపంలో దర్శనమివ్వబోతున్నాయి. ఎక్కడో తెలుసా...దుర్గంచెరువు వద్ద. అవును...సిటీకే ఐకానిక్‌గా ఇక్కడ నిర్మిస్తున్న కేబుల్‌ స్ట్రేబిడ్జిపై దేశంలోనే మొదటిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో  ‘మీడియా డిస్‌ప్లే..నోడ్‌ లైటింగ్‌ సిస్టం’ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సిస్టం ద్వారా బ్రిడ్జి కొత్త తరహాలో వెలుగులు విరజిమ్మనుంది. సందర్భానుసారంగా వంతెనపై లైటింగ్‌ను మార్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు చైనా సాంకేతిక సహకారం తీసుకుంటున్నారు. ఇంతకు ముందు ఈ తరహా లైటింగ్‌ గోవాలో ఉండగా...‘మీడియా డిస్‌ప్లే’ మాత్రం దేశంలో మన దగ్గరే  మొదటిసారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

సాక్షి, సిటీబ్యూరో: పనుల ప్రారంభోత్సవం నుంచే పలు ప్రత్యేకతలతో అందర్నీ ఆకర్షిస్తోన్న దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేక వెలుగుజిలుగులను అద్దుకోనుంది. ఓవైపు నిర్మాణంలోనూ పలు ప్రత్యేకతలు కలిగిన ఈ బ్రిడ్జిపై ప్రత్యేక దీపకాంతులద్దనున్నారు. ఇవి మామూలు వెలుగులనే ఇవ్వవు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయపతాకం బ్రిడ్జిపై ప్రత్యక్షమవుతుంది. బతుకుమ్మ పండుగ రోజున బతుకమ్మ ఉత్సవాలు విద్యుత్‌ వెలుగుల్లో కనిపిస్తాయి. అంతే కాదు.. జాతీయ నేతలు, ఇతర ముఖ్యుల  జన్మదినాల సందర్భంగా వారి చిత్రాలు కూడా విద్యుత్‌ వెలుగుల్లో మెరిసిపోతాయి. కేబుల్‌బ్రిడ్జిపై ఏర్పాటు చేస్తున్న ‘మీడియా కంటెంట్‌ డిస్‌ప్లేతో ఇలా ఏ చిత్రమంటే ఆ చిత్రం..ఏ ఉత్సవమంటే ఆ ఉత్సవం..ఏ బొమ్మ అంటే ఆ బొమ్మ దుర్గం చెరువుపై రాత్రివేళల్లో తళుకులీనుతాయి. చేయి తిరిగిన చిత్రకారుడు తన కుంచెతో కాన్వాస్‌పై చిత్రించినట్లుగా విద్యుత్‌ నోడ్స్‌తోనే ఇవి సాధ్యం కానున్నాయి. ఇందుకుగాను ప్రత్యేకమైన డీఎంఎఫ్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. ఇందుకుగాను దాదాపు రూ.5 కోట్లు ఖర్చుకానుంది. ఎంబీఈ ఏజెన్సీ చైనా సహకారంతో ఈ ప్రత్యేక లైటింగ్‌ను ఏర్పాటు చేయనుంది. తద్వారా బ్రిడ్జి సౌందర్యం మరింత ఇనుమడించనుంది. రెండు దశల్లో లైటింగ్‌ ఏర్పాట్లు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. తొలిదశలో రూ.5 కోట్ల వ్యయంతో బ్రిడ్జి కేబుళ్లు, టవర్లకు లైటింగ్‌ పనులు పూర్తిచేస్తారు. రెండోదశలో దుర్గం చెరువులో నీళ్లు మిలమిల మెరిసేలా ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాట్లు చేస్తారు. రానున్న దసరాలోగా బ్రిడ్జి పనులు పూర్తయ్యేనాటికే ఈ ప్రత్యేక విద్యుత్‌ వెలుగుల పనులు కూడా పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. గోవాలో రంగులు మారే ఏర్పాట్లు మాత్రమే ఉండగా, మీడియా డిస్‌ప్లే మాత్రం దేశంలో ఇదే మొదటిది కానుంది.

హైదరాబాద్‌కే ఐకానిక్‌గా...
హైదరాబాద్‌ నగరానికే ప్రత్యేక ఐకానిక్‌గా ప్రభుత్వం చేపట్టిన దుర్గంచెరువుపై కేబుల్‌బ్రిడ్జి దక్షిణ భారతదేశంలోనే తొలి కేబుల్‌బ్రిడ్జి. ఈ హ్యాంగింగ్‌ బ్రిడ్జి అంచనా వ్యయం రూ.184 కోట్లు. ఇప్పటికే పలువురి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బ్రిడ్జి పనులు పూర్తయితే దుర్గంచెరువు ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా మారనుంది. స్టీల్‌ లేకుండా ఎక్స్‌ట్రా డోస్ట్‌ కేబుల్‌ స్టే ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌ బ్రిడ్జిల్లో ప్రపంచంలో ఇదే పొడవైన బ్రిడ్జిగా కూడా రికార్డు కానుంది. ఈ కేబుల్‌బ్రిడ్జిపై మూడు లేన్ల వాహనాల రహదారితో పాటు వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లుంటాయి. కేబుల్‌ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్‌–జూబ్లీహిల్స్‌ మధ్య దూరం గణనీయంగా తగ్గడమే కాక జూబ్లీహిల్స్‌ నుంచి మైండ్‌ స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు రెండు కి.మీ.ల దూరం తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top