ఖరీఫ్‌ దిగుబడులపై అనుమానాలు

Less Rainfall In Medak District - Sakshi

ఖాళీకుండల్లా చెరువులు, కుంటలు

జిల్లాలో మత్తడి పోసినవిఏడు మాత్రమే.. 

90 శాతం జలాశయాల్లో సగానికి తక్కువగా నీరు

వరుణుడిపైనే భారంవర్షాకాలం మొదలై రెండున్నర నెలలు కావొస్తున్నా.. జిల్లాలోని జలాశయాలు ఇంకా బోసిగానే దర్శనమిస్తున్నాయి. 90 శాతానికి పైగా చెరువులు, కుంటలు సగంలోపే నిండి వరుణదేవుడి కటాక్షం కోసం వేచి చూస్తున్నాయి. ఈ క్రమంలో పంటలు చేతికొస్తాయా అనే మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు పెద్దగా లోటు వర్షపాతం లేనప్పటికీ.. చిన్న నీటి వనరుల ఆధారంగా పంటలు వేసిన వారు దిగాలుగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. 

సాక్షి, మెదక్‌: నైరుతి రుతుపవనాలు ముగింపు దశకు చేరుకుంటున్నా.. జిల్లాలో చెరువులు, కుంటలు నిండలేదు. వర్షాకాలం సీజన్‌కు సుమారు ఒక నెలే మిగిలి ఉండగా.. ఇప్పటివరకు ఏడు మాత్రమే మత్తడి పోస్తున్నాయి. జిల్లా పరిధిలో మొత్తం 2,681 చెరువులు ఉన్నట్లు సర్వేలో అధికారులు తేల్చారు. ఇందులో 2,455 చెరువులు సగంలోపే నిండినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 90 శాతానికి పైగా చెరువులు, కుంటలు పొలాలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి కింద పంటలు సాగు చేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మత్తడి పోస్తున్న వాటిలో అధిక శాతం రెండు, మూడు వర్షాలకే పొంగిపొర్లేటివి. మిగిలినవి నిండాలంటే జిల్లాలో భారీ వర్షాలు కురవాల్సిందే.

దోబూచులాట..
జూన్‌లో వర్షాకాలం సీజన్‌ మొదలైంది. రెండు నెలలుగా వరుణదేవుడు కరుణించలేదు. ఆగస్టు నెల మొదట్లో మాత్రం కొంత నయం అనిపించేలా జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలో మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం వారానికిపైగా చినుకు పడిన దాఖలాలు లేవు. అంతేకాదు.. వర్షాకాలంలోనూ ఎండ తీవ్రత వేసవి వాతావరణాన్ని తలపించేలా ఉండడం రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

పెద్దగా ‘లోటు’ లేకున్నా.. 
జూన్, జూలైలో వరుణుడు ముఖం చాటేసినా..  నెల మొదట్లో కురిసిన వర్షం పంటలకు ఊపిరిపోసింది. ఆ రెండు నెలల లోటును వరుణుడు ఈ నెలలో భర్తీ చేసినప్పటికీ 90 శాతానికి పైగా చెరువులు, కుంటలు సగం కూడా నిండలేదు. ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 10382.3 మిల్లీమీటర్లు కాగా.. 9897.3 మి.మీ కురిసినట్లు రికార్డులు చెబుతున్నాయి. జిల్లా సగటును లెక్కలోకి తీసుకుంటే 519.1 మీ.మీల వర్షం కురవాల్సి ఉండగా.. 494.9 మి.మీలు కురిసింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే పెద్దగా లోటు లేదని స్పష్టమవుతోంది. వరుస కరువు పరిస్థితులు, భూతాపంతో వచ్చిన నీరు వచ్చినట్లే ఇంకిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గతంతో పోల్చితే..
జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించి 2017లో సగటు సాధారణ వర్షపాతం 622.9 మి.మీలు కాగా.. 482.9 మి.మీ  కురిసింది. 2018లో 482.9 మి.మీ.. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు 494.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అంటే మూడేళ్లలో ఈ మూడు నెలల్లో మొత్తంగా ఏ ఒక్కసారి కూడా సాధారణ వర్షపాతాన్ని మించి నమోదు కాలేదని అర్థమవుతోంది. ఈ ఏడాది కొంత నయం అనిపించినప్పటికీ.. చెరువుల్లో తగినంత నీరు చేరకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

50 శాతానికి పైగా నిండినవి 219 మాత్రమే..
మత్తడి పోస్తున్న ఏడు మినహా 50 నుంచి 75 శాతం వరకు నీరు చేరిన చెరువులు, కుంటలు 121.. 75 నుంచి 100 శాతం వరకు నిండినవి 98 మాత్రమే ఉన్నాయి. సగానికి పైగా నీరు చేరిన చిన్న తరహా జలాశయాలు 10 శాతమేనని తెలుస్తోంది. దీన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిపోతోంది. ఈ క్రమంలో చెరువులు, కుంటల ఆధారంగా పంటలు వేసిన రైతులు సెప్టెంబర్‌పైనే ఆశలు పెట్టుకున్నారు.

చెరువు నిండితేనే పంట పండేది..
ఊర చెరువు కింద మా భూమి ఉంది. ఈ భూమిలో పంట పండించాలంటే చెరువే దిక్కు. చెరువు నిండితేనే పంట పండేది. 10, 15 ఏళ్లుగా ఈ చెరువు నిండింది లేదు. మేము పంట పండించింది లేదు.. సంపాదించింది లేదు. ఆశతో ఎకరంలో మాత్రమే మొక్కజొన్న సాగు చేశా. ఇప్పటివరకు చెరువు సగం కూడా నిండలేదు. దిగుబడి వచ్చేది అనుమానమే. కట్టు కాల్వలు ధ్వంసం కావడంతో చెరువు నిండడం లేదు. – గానుగు సత్తయ్య, కాళ్లకళ్, మనోహరాబాద్‌ 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top