4లక్షల ఐటీ కొలువులు

KTR Releases ITEC Dept's Annual Report - Sakshi

రూ.1.2 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు..

ఇదీ 2020 నాటికి తెలంగాణ లక్ష్యం  

9.32% వృద్ధి నమోదు: కేటీఆర్‌ 

ఐటీ శాఖ వార్షిక నివేదిక విడుదల

సాక్షి, హైదరాబాద్‌ : ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణ దూకుడు కొనసాగింది. 2017–18లో 9.32 శాతం వృద్ధి రేటుతో రూ. 93,442 కోట్ల ఐటీ, ఐటీ ఆధారిత సేవోత్పత్తుల ఎగుమతిని రాష్ట్రం సాధించింది. జాతీయ సగటు వృద్ధి రేటు (7–9 శాతం) కంటే కూడా ఇది ఎక్కువ. 2020 నాటికి 16 శాతం వృద్ధి రేటుతో రూ.1.2 లక్షల కోట్ల వార్షిక ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు సాధించి 4 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు సృష్టించాలని, మరో 20 లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2017–18లో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ పురోగతిపై రూపొందించిన వార్షిక నివేదికలో ఈ మేరకు పేర్కొంది. పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం ఈ నివేదికను ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2013–14తో పోలిస్తే గతేడాది ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం 15.6 శాతం వృద్ధి రేటు సాధించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

గత నాలుగేళ్లలో 1.5లక్షల కొత్త ఐటీ ఉద్యోగాలొచ్చాయని, పరోక్షంగా మరో 4.5 లక్షల మంది దాకా ఉపాధి పొందారని వివరించారు. ‘‘గతేడాది కొత్తగా 43,417 ఐటీ ఉద్యోగాలొచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 4,75,308కు పెరిగింది. మరో 7.5 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ వచ్చాక 5 ఏళ్లలో ఐటీ ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేస్తామన్న ప్రకటనను సాకారం చేసే దిశగా రాష్ట్ర ఐటీ రంగం వృద్ధి కొనసాగుతోంది. 2013–14లో రూ.52,258 కోట్లున్న ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు గతేడాది రూ.93,442 కోట్లకు చేరడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శక్తిమంతమైన, సుస్థిర విధానాల వల్లే ఇది సాధ్యమైంది. ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు గతంలో రాష్ట్రంలో 15 శాతం, జాతీయ స్థాయిలో 10 శాతముండేది కాగా ఈసారి రాష్ట్ర రేటు 9.32 శాతానికి క్షీణించి జాతీయ రేటును సమీపించిందని విలేకరులు ప్రశ్నించగా ఐటీ రంగ వృద్ధి అంతర్జాతీయంగా తాత్కాలికంగా క్షీణించిందని, మళ్లీ పుంజుకుంటుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

త్వరలో ‘లుక్‌ ఈస్ట్‌’పాలసీ 
తూర్పు హైదరాబాద్‌ పరిధిలోని ఉప్పల్, నాగోల్, పోచారం తదితర ప్రాంతాల్లో కొత్త ఐటీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు త్వరలో కొత్తగా ‘లుక్‌ ఈస్ట్‌’విధానాన్ని ప్రకటించనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ‘‘మెట్రో రైలు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎస్సార్డీపీ ఫ్లై ఓవర్‌ నిర్మాణంతో తూర్పు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడం ఐటీ పరిశ్రమలకు కలిసొస్తుంది. ఐటీ పరిశ్రమలన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైతే ఉద్యోగుల సంఖ్య పెరిగి ట్రాఫిక్‌ చిక్కులే గాక జీవన ప్రమాణాలూ పడిపోతాయి. సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలో చాలా పరిశ్రమలు మూతబడ్డాయి. వాటి స్థానంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే ప్రోత్సహిస్తాం. బుద్వేల్‌లో ఐటీ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రం సహకరించకపోవడంతో ఐటీఐఆర్‌ ప్రాజెక్టును పక్కన పెట్టాల్సొచ్చింది. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ విస్తరణలో భాగంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో ఐటీ టవర్లను ప్రభుత్వమే నిర్మించింది. త్వరలో మహబూబ్‌నగర్‌లోనూ నిర్మించనున్నాం. ప్రైవేట్‌ కంపెనీల ఆధ్వర్యంలో కామారెడ్డి, జనగామ, హుజూరాబాద్‌ వంటి చిన్న పట్టణాల్లోనూ బీపీఓ పరిశ్రమలొచ్చాయి. టీఎస్‌ఐఐసీ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ నియామకంలో అవినీతి జరిగిందని కాగ్‌ తప్పుపట్టడంపై ఐటీ శాఖ ఇప్పటికే వివరణ ఇచ్చింది’’అని వివరించారు 

టీ–యాప్‌ ఫోలియోతో వెయ్యి రకాల సేవలు  
రాష్ట్రంలో ఐటీ ఆధారిత పాలనను ప్రోత్సహించేందుకు గతేడాది టీ వాలెట్, టీ వర్క్స్, వీ హబ్, టీ యాప్‌ ఫోలియో, టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ నెట్‌వర్క్, స్టెట్‌ ఇన్నొవేషన్‌ సెల్‌ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్‌ గుర్తు చేశారు. ‘‘నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన టీ వాలెట్‌ను 3.4 లక్షల మంది వినియోగించుకుంటున్నారు. ఇప్పటిదాకా రూ.221 కోట్లు లావాదేవీలు జరిగాయి. టీ యాప్‌ ఫోలియో యాప్‌ను 2 లక్షలకు పైగా వాడుతున్నారు. ప్రస్తుతం దీని ద్వారా 160 రకాల ప్రభుత్వ సేవలందిస్తున్నాం. వీటిని త్వరలో వెయ్యికి పెంచుతాం. వీ హబ్‌ ఇంక్యుబేటర్‌లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో 300 స్టార్టప్‌లు ఏర్పాటవుతాయి. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్‌), ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ వంటి ప్రతిష్టాత్మక సదస్సులను విజయవంతంగా నిర్వహించాం’’అని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శాలిని మిశ్రా తదితరులు పాల్గొన్నారు. 

ఇది చివరి నివేదిక.. మళ్లీ కొత్త ప్రభుత్వంతో వస్తా! 
‘తెలంగాణ ఏర్పడ్డాక ఐటీ శాఖ పనితీరుపై మూడేళ్లుగా వార్షిక నివేదికలు విడుదల చేశా. ఇది నా చివరి నివేదిక’అని కేటీఆర్‌ చమత్కరించారు. 2019లో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మళ్లీ వార్షిక నివేదిక విడుదల చేస్తానన్నారు. పరిశ్రమల శాఖ పనితీరుపై వచ్చే సోమవారం, పురపాలక శాఖపై వారం తర్వాత వార్షిక నివేదికలు విడుదల చేస్తామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top