కేటీఆర్‌.. ట్వీటర్‌ మిలియనీర్‌!

KTR reaches one million followers on Twitter - Sakshi

10 లక్షలకు చేరిన ఫాలోయర్ల సంఖ్య 

సరికొత్త రికార్డు అందుకున్న మంత్రి కేటీఆర్‌ 

‘ఎ మిలియన్‌ థ్యాంక్స్‌’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నేత, మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో సరికొత్త రికార్డు నమోదు చేశారు. ట్వీటర్‌లో పది లక్షల మంది (మిలియన్‌) ఫాలోయర్లు ఉన్న రాజకీయ నేతల జాబితాలో చేరారు. ప్రస్తుతం కేటీఆర్‌ ట్వీటర్‌ ఖాతాను పది లక్షల మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుత తరం రాజకీయ నేతగా కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రభుత్వ పథకాలు, వాటి అమలుతోపాటు రాజకీయ, పరిపాలన అంశాలపైనా కామెంట్లు చేస్తుంటారు. పలువురి వ్యక్తిగత విజ్ఞప్తులపైనా వేగంగా స్పందిస్తుంటారు. సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికార యంత్రాంగానికి ట్వీటర్‌ ద్వారానే ఆదేశాలు ఇస్తుంటారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ, చేనేత, గనులు, ఎన్‌ఐఆర్‌ వ్యవహారాలే కాకుండా సామాన్యులు చేసే ఇతర విజ్ఞప్తులపైనా స్పందిస్తుంటారు. 
    
50 వేల నుంచి..  10 లక్షలకు..! 
కేటీఆర్‌ ట్వీటర్‌ ఖాతా నిర్వహణలో ప్రత్యేక బృందం పని చేస్తోంది. పలువురు తమ సమస్యలను ట్వీటర్‌ ద్వారా తెలియజేస్తే.. ఆయన వెంటనే స్పందిస్తారు. ఆ స్పందనను అమలు చేసే దిశగా ప్రత్యేక బృందం వేగంగా చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మహా నగరపాలక ఎన్నికల సమయంలో ఆయన ట్వీటర్‌ ఖాతాకు కేవలం 50 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. రెండేళ్లలోనే ఈ సంఖ్య పది లక్షలకు చేరింది.  

అభినందనలు కేటీఆర్‌:  బ్రిటిష్‌ హై కమిషనర్‌  
కేటీఆర్‌ ట్వీటర్‌ ఖాతా రికార్డుపై తెలుగు రాష్ట్రాల బ్రిటిష్‌ హై కమిషనర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌ స్పందించారు. ‘కె.టి.రామారావుకు అభినందనలు. ప్రజలతో కేటీఆర్‌కు ఉండే సానుకూల సంబంధాలు, వారితో మాట్లాడే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల కేటీఆర్‌ను కలిసినప్పుడు ఇదే విషయం చెప్పాను’అని ట్వీటర్‌లో పోస్టు చేశారు. ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ సహా పలువురు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్వీటర్‌ ఫాలోయర్ల రికార్డుపై కేటీఆర్‌ కూడా తనదైన శైలిలో స్పందించారు. ‘ఎ మిలియన్‌ థ్యాంక్స్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top