మాది కుటుంబ పాలనా?

KTR Fires on Congress Leaders - Sakshi

ఆ మాట అనడానికి సిగ్గుండాలి..

నెహ్రూ నుంచి రాహుల్‌ వరకు మీది కుటుంబ పాలన కాదా? 

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు లేరా?

కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ మీదొక థర్డ్‌ క్లాస్‌ పార్టీ అని ధ్వజం

వనపర్తి బహిరంగ సభలో ప్రసంగించిన మంత్రి

సాక్షి, వనపర్తి :  రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ నాయకులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారకరామారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుటుంబ పాలన గురించి మాట్లాడటానికి కాంగ్రెస్‌ నాయకులకు సిగ్గుండాలని వ్యాఖ్యా నించారు. శుక్రవారం వనపర్తి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. తొలుత ఆయన జిల్లాలోని మదనాపురం మండల కేంద్రంలో 160 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఆ తర్వాత జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ‘ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చిందెవరు.. ఇక్కడి ప్రజలను వలసకు పంపిన ఘనత మీది కాదా.? మేము అధికారంలోకి వచ్చాక ఇక్కడి ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తుంటే కోర్టుల్లో కేసులు వేసి పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తారా..’అని కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు కట్టి తీరుతామని స్పష్టం చేశారు.  

ఉత్తమ్‌ ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు లేరా? 
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కశాశాల మైదానంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ, తమది కుటుంబ పాలన అంటున్న కాంగ్రెస్‌ నేతలకు.. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మోతీలాల్‌ నెహ్రూ నుంచి నేటి రాహుల్‌ గాంధీ వరకు కుటుంబపాలన కొనసాగుతున్న థర్డ్‌ క్లాస్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఈ నాయకులు కుటుంబ పాలన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ కోసం కొట్లాడి, జైలుకు పోయి కేసులతో ఇబ్బందులు ఎదుర్కొన్న తాము పదవుల్లో కొనసాగడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా అవసరమైతే పదవులను వదులుకోవడానికి కూడ సిద్ధమేనన్నారు. కాంగ్రెస్‌ పాలకులు కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రాల వాటాను ఎందుకు తేల్చలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం గోదావరి నదిపై కాళేశ్వరం, కృష్ణానదిపై పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను చేపడుతున్నామని వెల్లడించారు. 

కాంగ్రెస్‌ హయాంలో 29 లక్షల మందికి కేవలం రూ.800 కోట్ల పింఛన్లు ఇస్తే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక 42 లక్షల మందికి ఏటా రూ.5,500 కోట్లకు పైగా పింఛన్లకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు పట్టిన ఏలిన నాటి శని వంటిందని.. ఆ పార్టీని, నాయకులను తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి నేడు కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారని.. ఇన్నిరోజుల పాటు వారు గుడ్డిగుర్రాలకు పళ్లు తోమారా అని మంత్రి ఎద్దేవా చేశారు.  

నాలుగేళ్ల పాలనలో హామీలు నెరవేర్చలేదని తమను విమర్శిస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. యాభై ఏళ్ల వారి పాలనలో ఏం చేశారో చూసుకోవాలని ప్రశ్నించారు. ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదని.. బుల్లెట్‌ దిగిందా, లేదా అనేదే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, రాజేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

చేనేతకు చేయూతనిస్తాం
చేనేత కార్మికులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. కొత్తకోటలోని వీవర్స్‌ కాలనీలో చేనేత కార్మికులను కలసిన మంత్రి కేటీఆర్‌ వారి బాగోగులను తెలుసుకున్నారు. డ్రైయింగ్‌ యూనిట్‌ను పరిశీలించి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కోసం రూ.1,270 కోట్లు కేటాయించామని, వారు ఉపయోగించే రసాయన పదార్థాలపై 50 శాతం సబ్సిడీ ఇచ్చామని, చేనేత కార్మికులకు సంబంధించి రూ.40 కోట్ల రుణాలు మాఫీ చేయించామని అన్నారు. కొత్తకోట సిల్క్‌ చీరల చేనేత సంఘాల రుణాలు సైతం మాఫీ చేయిస్తామని మంత్రి ప్రకటించారు. కొత్తకోట, గద్వాల, నారాయణపేట నేత కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే కొత్తకోట నేతన్నలు తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాలకు కొత్తకోట, వనపర్తిలో టెస్కో షోరూంలు ఏర్పాటు చేస్తామని, కొత్తకోట సిల్క్‌ వస్త్రాల ప్రచారానికి చర్యలు తీసుకుంటామని, డిజైన్‌లలో మెళకువలు నేర్పించేందుకు డిజైనర్లను ఇక్కడికి పంపిస్తామని చెప్పారు. చేనేత ఉత్పత్తులను అమెజాన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top