కేంద్రాన్ని శాసించడమే లక్ష్యం

KTR to address Medak TRS workers on Mar 8 - Sakshi

రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలుస్తాం: హరీశ్‌

మెదక్‌ జోన్‌: రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను కైవసం చేసు కుని కేంద్రాన్ని శాసించడమే టీఆర్‌ఎస్‌ లక్ష్యమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ నెల 8న టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అధ్యక్షతన మెదక్‌ పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం పట్టణంలో జరుగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హవేళిఘణాపూర్‌ మండల కేంద్రంలోని డైట్‌ కళాశాల పక్కన, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పక్కన, సీఎస్‌ఐ చర్చి మైదానాలను సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులతో కలిసి హరీశ్‌రావు పరిశీలించారు. సన్నాహక సభకు సీఎస్‌ఐ చర్చి మైదానాన్ని ఫైనల్‌ చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎంపీ సీట్లన్నీ భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం టీఆర్‌ఎస్‌పై ఆధారపడే విధంగా గెలుపొంది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. కేం ద్రాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుంటే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. 

25 వేల మందితో సమావేశం... 
సన్నాహక సమావేశానికి మెదక్‌ లోక్‌సభ పరిధిలోని ప్రతి నియోజకవర్గం నుంచి 3 వేల నుంచి 4 వేల మంది కార్యకర్తలను తరలించేలా ఏర్పాట్లు చేయా లని నేతలకు హరీశ్‌ సూచించారు. మెదక్‌ నియోజకవర్గం నుంచి 5 వేల మంది వరకు తరలించాలన్నా రు. మొత్తం 25 వేల మంది కార్యకర్తలతో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సభాస్థలి పరిశీలనలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మురళీధర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హరీశ్‌రావు, ఇతర నేతలు పద్మాదేవేందర్‌రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడి నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులతో కలిసి హరీశ్‌ ఏడుపాయల జాతరకు వెళ్లారు. అంతకు ముందు సభకు వచ్చే నాయకులు, ముఖ్య కార్యకర్తల వాహనాలను ఘన్‌పూర్‌ రోడ్డుతోపాటు ఇందిరాగాంధీ స్టేడియం వైపు పార్కింగ్‌ చేసేలా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top