తెలంగాణకు 50.. ఏపీకి 60 టీఎంసీలు

Krishna river water Consumption  - Sakshi

లభ్యత జలాలపై కృష్ణా త్రిసభ్య కమిటీ నిర్ణయం

అధిక వినియోగంపై తర్వాత చర్చిద్దామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాల వినియోగంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 133.75 టీఎంసీల్లో తెలంగాణ 50, ఆంధ్రప్రదేశ్‌ 60 టీఎంసీల నీరు వినియోగించుకునే అవకాశం కల్పించింది. బుధవారం జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లోని లభ్యత జలాల కేటాయింపులు, వచ్చే జూన్‌ వరకు నీటి అవసరాలపై భేటీలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ పలు అంశాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ‘రెండు ప్రాజెక్టుల్లోని 357.25 టీఎంసీలను ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు వినియోగించుకున్నాయి. ఒప్పం దం ప్రకారం ప్రకారం తెలంగాణ 121.46, ఏపీ 235.79 టీఎంసీలు వినియోగించుకోవాలి. కానీ ఏపీ కాస్త ఎక్కువగా 254.57 టీఎంసీలు వినియోగించుకుంది’అని వివరించింది.

ఆ నీటిని సర్దుబాటు చేసి తమకు కేటాయింపులు పెంచాలని కోరింది. బోర్డు స్పందిస్తూ.. లభ్యతగా ఉన్న 133.75 టీఎంసీల్లో వాటా ప్రకారం తెలంగాణకు 60.33 టీఎంసీలు, ఏపీకి 73.42 టీఎంసీలు దక్కుతాయని.. ఇందులో తెలంగాణ 50 టీఎంసీ, ఏపీ 60 టీఎంసీలు అవసరాలకు తగ్గట్లు వాడుకోవాలని సూచించింది. ఆ వినియోగం పూర్తయ్యాక అధిక వినియోగంపై తేలుద్దామనగా ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి.  

పోతిరెడ్డిపాడు లెక్కల్లో..
శ్రీశైలం నుంచి తక్షణమే సాగర్‌కు నీరు విడుదల చేయాలని తెలంగాణ కోరగా ఏపీ నిరాకరించింది. చెన్నై తాగు అవసరాలకు శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు ఇవ్వాల్సి ఉందని, అది పూర్తయిన వెంటనే సాగర్‌కు విడుదల చేస్తామని తెలిపింది. పోతిరెడ్డిపాడు లెక్కల్లో చూపిస్తున్న దానికి మించి ఏపీ వినియోగం చేస్తోందని, అందుకే 25 టీఎంసీల మేర తేడా వస్తోందని బోర్డు దృష్టికి తెలంగాణ తీసుకెళ్లింది.

దీనిపై బోర్డు స్పందిస్తూ.. అధిక వినియోగంపై బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తోందని, మరో వారంలో కమిటీ నివేదిక వస్తుందని, రాగానే ఆ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. సాగర్‌ ఎడమ కాలువ కింద ఏపీ అవసరాలకు కేటాయించిన, వినియోగిస్తున్న నీటికి తేడా ఉంటోందని, దాన్ని పూడ్చాలని ఏపీ కోరింది.

తెలం గాణ బదులిస్తూ.. సరఫరా నష్టాల వల్ల అలా జరుగుతోందని, దానిపైనా కమిటీ నియమించినందున, నివేదిక వచ్చాక నిర్ణయానికి రావాలని సూచించింది. ఇక టెలిమెట్రీ వ్యవస్థలను త్వరగా కార్యాచరణలోకి తీసుకురావాలని రెండు రాష్ట్రాలు కోరగా బోర్డు అంగీకరించింది. సమావేశంలో సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు వెంకటేశ్వర్‌రావు, మురళీధర్, ఏపీ సీఈలు నారాయణరెడ్డి, జబ్బార్, సాగర్‌ సీఈ సునీల్, డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌లు నరహరి, రామచంద్రలు హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top