కృష్ణమ్మ తియ్యగా..గోదావరి చప్పగా..! 

Krishna And Godavari Rivers Qualit Are Up To The Standards Of World Health Organization - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజధాని నగరానికి ప్రస్తుతం కృష్ణా.. గోదావరి జలాలే దాహార్తిని తీర్చే వరదాయినిగా మారాయి. కృష్ణా జలాలు తియ్యగా, తేటగా ఉండగా, గోదావరి జలాల కాఠిన్యత స్వల్పంగా అధికంగా ఉండటంతో కొంచెం చప్పగా ఉంటున్నాయి. అయితే రెండు జలాల నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఉండటం విశేషం. ప్రస్తుతం జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నా వీటిని పరిమితంగానే తాగునీటి అవసరాలకు వాడాలని ప్రభుత్వం జలమండలిని ఆదేశించింది. అలాగే సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నగరానికి వస్తున్న నీటిని సైతం సర్కారు ఉమ్మడి మెదక్‌ జిల్లా తాగు, సాగునీటి అవసరాలకే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో మహానగరం తాగునీటి అవసరాల కోసం కృష్ణా, గోదావరిపైనే ఆధారపడుతోంది. 

ఆయా జలాశయాల నుంచి రోజువారీగా 440 మిలియన్‌ గ్యాలన్ల నీటిని సేకరించి శుద్ధి చేసి సరఫరా చేస్తోంది. కాగా, తాగు నీటి నాణ్యతపై సోమవారం ’సాక్షి’ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. పలుచోట్ల నల్లా నీటి నమూనాలను సేకరించి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సిస్టం ప్రయోగశాలలో పరీక్షించింది. ప్రధానంగా నీటి గాఢత, కరిగిన రేణువులు, కరిగిన ఘన పదార్థాలు, కాఠిన్యత, క్లోరైడ్స్, క్లోరిన్, లవణీయత తదితర పరీక్షలు నిర్వహించి ఫలితాలను పరిశీలించగా, ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ (ఐఎస్‌ఓ) ప్రమాణాల మేరకు ఉన్నట్లు తేలింది. అంతేకాదు గ్రేటర్‌ పరిధిలో సుమారు 300 వరకు ఉన్నసర్వీసు రిజర్వాయర్ల పరిధిలోని 9.65 లక్షల నల్లాలకు సరఫరా అవుతున్న నీరు ప్రమాణాల మేరకు ఉండటంతో గతేడాది జలమండలి ఐఎస్‌ఓ ధ్రువీకరణ సాధించడం 3 దశాబ్దాల వాటర్‌ బోర్డు చరిత్రలో ఓ రికార్డు. కృష్ణా, గోదావరి జలాలను శుద్ధి చేసే ఫిల్టర్‌ బెడ్స్‌ వద్ద ఆలం అనే రసాయనంతోపాటు నీటిని నిల్వచేసే స్టోరేజి రిజర్వాయర్ల వద్ద బూస్టర్‌ క్లోరినేషన్‌ ప్రక్రియను నిర్విరామంగా చేపడుతుండడంతో నీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది.  

నీటి నాణ్యతలో స్వల్ప తేడా.. 

  •  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు గరిష్ట నీటి కాఠిన్యత ప్రతి లీటర్‌కు.. 200మిల్లీగ్రాములు
  • గోదావరి జలాల్లో ఉన్న కాఠిన్యత లీటర్‌కు..152 మిల్లీగ్రాములు 
  • కృష్ణా జలాల్లో ఉన్నకాఠిన్యత లీటర్‌కు.. 120 మిల్లీగ్రాములు
  • ఎల్లంపల్లి నుంచి నగరానికి నిత్యం సరఫరా అయ్యే గోదావరి జలాలు : 172(మిలియన్‌ గ్యాలన్లు)
  • పుట్టంగండి నుంచి సిటీకి నిత్యం సరఫరా అయ్యే కృష్ణా జలాలు : 270 (మిలియన్‌ గ్యాలన్లు)
  • కృష్ణా, గోదావరి నీటికి సంబంధించి ప్రతి 1000 లీటర్ల శుద్ధికి జలమండలి చేస్తున్న ఖర్చు : 45–50 (రూపాయలు)
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top