గులాబీ గూటిలో.. కొత్త ముచ్చట్లు!

Kodad MLA Constancy Candidate List Pending By KCR - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : గులాబీ పార్టీలో కొత్త ముచ్చట్లు వినిపిస్తున్నాయి. సుమారు రెండు నెలల కిందట టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో పదిచోట్ల అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాలుగా ఉన్న కోదాడ, హుజూర్‌నగర్‌లను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఈ రెండు నియోజకవర్గాలనుంచి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ దంపతులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ అభ్యర్థులను ప్రకటించని కారణంగా ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న చర్చ పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ప్రధానంగా హుజూర్‌నగర్‌నుంచి ఎవరు పోటీ చేస్తారన్న అంశంపై పలువురు నాయకుల పేర్లు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. రోజుకో పేరు చొప్పున జరుగుతున్న ప్రచారంతో పార్టీ స్థానిక శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. 

గంట సేపు మంతనాలు
ఈ పరిణామాల నేపథ్యంలో ఆ నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాలనుంచి స్థానిక నాయకులు బుధవారం రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిశారు. హుజూర్‌నగర్‌నుంచి పోటీ చేయడానికి ముందుకు రావాలని, ఈ విషయంపై చర్చించేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత తనయుడు కేటీఆర్‌తో తమకు అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని వారంతా కోరారు. సుమారు గంట సేపు వీరంతా ఎంపీ గుత్తాతో సమావేశమై ఒత్తిడి తెచ్చారు. అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వారిని గెలిపించేందుకు శ్రేణులన్నీ కలిసిగట్టుగా పనిచేయాలని వారికి నచ్చచెప్పి పంపించారు. ‘మంత్రి కేటీఆర్‌ను కలవడానికి ప్రయత్నిస్తాం. అపాయింట్‌మెంట్‌ లభిస్తే.. హుజూర్‌నగర్‌ టికెట్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఇవ్వాలని కోరతాం. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని ఎదుర్కునేందుకు దీటైన అభ్యర్థి కావాలని వివరిస్తాం.’ అని ఎంపీ గుత్తాను కలవడానికి వచ్చిన హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు.

కొలిక్కిరాని అభ్యర్థిత్వం!
సెప్టెంబరు 6వ తేదీన పది మంది అభ్యర్థులను ప్రకటించి కోదాడ, హుజూర్‌నగర్‌ స్థానాలను పెండింగ్‌లో పెట్టడంపై పెద్ద చర్చ జరిగింది. ఇక, ఆ తర్వాతి రోజు నుంచి కొత్త కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇక్కడినుంచి పోటీ చే యడానికి వస్తున్నారని కొద్ది రోజులు ప్రచారం జరి గింది. అంతకుముందు నుంచే ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో పోటీ చేస్తారని కూడా జోరుగా చర్చ జరిగింది. ఎంపీ గుత్తా పేరుతోపాటు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహారెడ్డి పేరూ ప్రచారంలోకి వచ్చింది. ఒకవైపు ఆయా నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చిన తరుణంలోనే ఈ స్థానాన్ని తనకే కేటాయించాలని నియోజకవర్గ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

ఇప్పటికీ తాను టికెట్‌ రేసులో ఉన్నానని, ఎవరి పేరునో సూచించాల్సిన అవసరం లేదని తన అనుచరవర్గం వద్ద ప్రస్తావిస్తున్నారు. మరోవైపు తనకు టికెట్‌ కేటాయించాలని, లేదంటే ఇండిపెండెంటుగా బరిలో ఉంటానని సామల శివారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అదే సమయంలో ఎన్‌ఆర్‌ఐ అప్పిరెడ్డి, సైదిరెడ్డి పేర్లూ తెరమీదకు వచ్చాయి. ప్రస్తుతం సైదిరెడ్డి టికెట్‌ రేసులో ముందున్నట్లు చెబు తున్నారు. ఈ తరుణంలో పార్టీకి చెందిన పలువురు స్థా నిక నాయకులు గుత్తా సుఖేందర్‌రెడ్డి పోటీకి రావాలని కోరుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో హుజూర్‌నగర్‌ అభ్యర్థిత్వం ఓ కొలిక్కి రాలేదని చెబుతున్నారు. స్థానిక నేతల డిమాండ్‌ మేరకు పార్టీ నాయకత్వం గుత్తాను పోటీకి పంపుతుందా..? లేదా..? అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ గందరగోళ పరిస్థితి వల్ల నియోజకవర్గంలో ప్రచారం అన్నది నామ మాత్రంగానే సాగుతోంది. అభ్యర్థి తేలితే కాని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి, ముఖ్య కార్యకర్తలకు చేతినిండా పని దొరికేలా లేదు.

అయోమయంలో.. కోదాడ!
మరోవైపు కోదాడ అభ్యర్థిత్వం కూడా డైలమాలోనే ఉందని అంటున్నారు. అయితే, అధిష్టానం ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసుకున్నా.. ప్రకటన విషయంలో మాత్రమే ఆలస్యం జరుగుతోందని చెబుతున్నారు. పార్టీ ఇన్‌చార్జ్‌ శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావులు టికెట్‌ రేసులో ఉన్నారు. కానీ, ఇంకా ఎవరికి టికెట్‌ ప్రకటించకపోవడంతో పార్టీ ప్రచారం అనుకున్న రీతిలో ముందుకు సాగడం లేదు. వివిధ సర్వేలు, కుల సమీకరణలు, కాంగ్రెస్‌ బలాలు, బలహీనతలు తదితర అంశాలను విశ్లేషిస్తున్న పార్టీ అగ్ర నాయకత్వం అభ్యర్థి ప్రకటన విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కపెడుతోంది. ఒకటీ రెండు రోజుల్లోనే ఈ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top