జగిత్యాల.. ఇక జిల్లా!

జగిత్యాల.. ఇక జిల్లా! - Sakshi


- తొలి విడతలో ఖరారు

- ప్రతిపాదనలు పంపాలని భూపరిపాలనశాఖకు ఆదేశాలు

- నెరవేరనున్న  కేసీఆర్ హామీ

- రెండో విడతలో రామగుండం?

సాక్షి, కరీంనగర్ : జగిత్యాల.. ఇక త్వరలోనే కొత్త జిల్లాగా అవతరించనుంది. పరిపాలనా సౌలభ్యం.. ప్రజల ఆకాంక్ష మేరకు అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు... లేదా 15 లక్షల జనాభాకో జిల్లా ఉండేలా పునర్వవ్యస్థీకరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ మేరకు అడుగులేస్తోంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం తొలివిడతగా రాష్ట్రంలో వికారాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, మంచిర్యాల జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.



ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాలని భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌కు గురువారం ఆదేశాలు జారీ చేసింది. జగిత్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని ఇటీవలే హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని నెరవేర్చే పనిలో ఉన్నారు. ప్రభుత్వం తొలివిడతగా ప్రకటించనున్న ఏడు జిల్లాల్లో జగిత్యాల ఉండడంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాలు జగిత్యాల చుట్టూ ఉన్నాయి.



రెండో విడతలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాల జాబితాలో రామగుండం పేరు తప్పకుండా ఉంటుందని అధికార పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంచిర్యాల జిల్లా చేస్తుండడంతో రామగుండంను అందులో కలుపుతారా? ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తారా? అనే చర్చ మొదలైంది. మెదక్ జిల్లాలో ఉన్న సిద్దిపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే సిరిసిల్ల నియోజకవర్గాన్ని అందులో చేరుస్తారనే ప్రచారముంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని చర్చ జరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top