'వియ్‌' హబ్‌తో మహిళలకు ప్రోత్సాహం

Khammam IT WE Hub For Encouraging Women Entrepreneurs - Sakshi

ఖమ్మంలో ఐటీ విస్తరణకు చర్యలు

ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌

సాక్షి, ఖమ్మం: మహిళా చైతన్యం గల ఖమ్మం జిల్లాలోని మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వియ్‌–హబ్‌ ద్వారా అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఐటీఈఅండ్‌సీ శాఖ ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రారంభించిన వియ్‌–హబ్‌ అవగాహన సదస్సును గురువారం భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో ఖమ్మంలో ఐటీ హబ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న వియ్‌–హబ్‌ను కూడా జిల్లాలకు విస్తరింపజేయాలనే ఆలోచనతో  మొదట ఖమ్మం జిల్లాను ఎంపిక చేశారని తెలిపారు. మహిళల స్వయం శక్తిని గుర్తించి వారికి ఆసక్తి గల వ్యాపారం, పారిశ్రామిక రంగాలను ప్రొత్సహించేందుకు 8 నెలల శిక్షణకు ప్రభుత్వం సుమారు రూ.90 లక్షల ఖర్చు చేస్తోందని చెప్పారు. నూతనంగా వ్యాపారం, పరిశ్రమలు స్థాపించే వారికి వియ్‌–హబ్‌ ద్వారా శిక్షణ ఇస్తారన్నారు.

కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి, ప్రొత్సహించేందుకు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన వియ్‌–హబ్‌ ఏర్పాటుకు ఖమ్మం జిల్లాను ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. జర్మన్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీతో కలిసి చేపట్టిన వియ్‌–హబ్‌ ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలతో పాటు నూతనంగా వ్యాపార, పరిశ్రమలు స్థాపించే వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోందని, ఆసక్తి గల మహిళా పారిశ్రామికవేత్తలు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కోరారు.

వియ్‌–హబ్‌ సీఈవో దీప్తి రావుల మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల మహిళా పారిశ్రామికవేత్తలకు చేరువయ్యేందుకు చేసిన పరిశోధనలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు గమనించామని, అందుకే ఇక్కడి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వియ్‌–హబ్‌ ద్వారా హెచ్‌ఈఆర్‌ అండ్‌ నౌ ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ మేయర్‌ పాపాలాల్, జిల్లా పరిషత్‌ సీఈఓ ప్రియాంక, శిక్షణ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, నగర పాకల సంస్థ కమిషనర్‌ జె.శ్రీనివాసరావు, డీఆర్డీఓ బి.ఇందుమతి, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణారావు, కార్పొరేటర్లు కమర్తపు మురళి, నీరజ, దోరేపల్లి శ్వేత, లక్ష్మీసుజాత, ప్రశాంతలక్ష్మీ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top