కేసీఆర్‌ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక


హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి, ప్రస్తుత అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణల తర్వాత ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి  శుక్రవారం ఎన్నికల వివరాలను అధికారికంగా ప్రకటించారు.


పన్నెండు సెట్ల నామినేషన్లు వచ్చాయని, అయితే అందరూ కేసీఆర్‌ అధ్యక్షుడు కావాలని కోరుకున్నారన్నారు. ఎన్నికలకు సహకరించిన అందరికీ నాయిని ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. కాగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసిఆర్‌ తిరిగి ఎన్నికయిన ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. మరోవైపు కేసీఆర్‌ ఎన్నికతో మంత్రులు, ఎంపీలు తెలంగాణ భవన్‌లో మిఠాయిలు పంచుకున్నారు.మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి పదహారో ప్లీనరీ సమావేశాలకు కొంపల్లిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ అధికార పీఠాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ కావడంతో ఈ మూడేళ్ల తమ పాలనలో జరిగిన అభివృద్ధి నివేదికను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ప్లీనరీ వేదికను ఉపయోగించుకోనున్నారు.

Back to Top