తూర్పు నుంచి హస్తినకు

KCR Tour From Ap To Delhi - Sakshi

ఏపీ నుంచి శ్రీకారం.. కుటుంబంతో కలసి విశాఖ శారదా పీఠంలో పూజలు 

అదే రోజు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో సమావేశం 

24న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతతో భేటీ 

25 నుంచి రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే మకాం 

మాయావతి, అఖిలేశ్‌లతోనూ సమావేశం 

ప్రధాని మోదీతో మర్యాదపూర్వక భేటీ  

ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోనూ భేటీ 

టీఆర్‌ఎస్‌ కోసం నెలపాటు ప్రత్యేక విమానం 

మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం    

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా తలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రత్యక్ష కార్యాచరణకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే చర్యల్లో భాగంగా ఆదివారం నుంచి రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రత్యక్ష కార్యాచరణ మొదలుకానుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో పర్యటన అనంతరం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ వేదికగా రెండు, మూడు రోజులు ఫెడరల్‌ ఫ్రంట్‌ కార్యాక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. తెలంగాణకు సంబంధించిన కీలకాంశాలపై అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.

శారదాపీఠం రాజశ్యామల ఆలయంలో పూజలు...
సీఎం కేసీఆర్‌ ఈ నెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో పర్యటించనున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్, టీఆర్‌ఎస్‌ తరుపున ఇతర కార్యక్రమాల కోసం నెలరోజులపాటు ప్రత్యేక విమానం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం పది గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరుతారు. విశాఖపట్నంలో శారదా పీఠాన్ని సందర్శించి రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుంటారు. ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం నుండి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ బయలుదేరుతారు. సాయంత్రం ఆరు గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌తో ఆయన నివాసంలోనే సమావేశం అవుతారు.

ఆ రోజు అక్కడి ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే బస చేస్తారు. 24న ఉదయం రోడ్డు మార్గంలో కోణార్క్‌ దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడి జగన్నాథ దేవాలయానికి వెళ్తారు. పూజల అనంతరం భువనేశ్వర్‌ చేరుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమవుతారు. అనంతరం కాళీమాత ఆలయాన్ని సందర్శిస్తారు. అదేరోజు రాత్రి ఢిల్లీకి వెళ్తారు. 25వ తేదీ నుంచి రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉంటారు. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌తోనూ కేసీఆర్‌ సమావేశమవుతారు. ఢిల్లీ పర్యటనలోనే పలువురు ఇతర కీలక పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరుపుతారు. బీఎస్పీ చీఫ్‌ మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తోనూ భేటీ అవుతారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలపై పలువురు కేంద్ర మంత్రులను కలసి చర్చిస్తారు.

మంత్రివర్గ విస్తరణ ఆలస్యం...
జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర లక్ష్యంగా కేసీఆర్‌ చేపట్టనున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ కార్యక్రమాల నేపథ్యంలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్‌ ఈ నెల 23 నుంచి 28 వరకు వివిధ రాష్ట్రాల పర్యటనలో ఉంటారు. ఈ నేపథ్యంలో 28 తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. ముహూర్తాల ప్రకారం జనవరి 4 వరకే మంచి రోజులు ఉన్నాయని... ఆలోగా కేబినెట్‌ విస్తరణ పూర్తి కాకుంటే ఫిబ్రవరి 7 తర్వాతే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కీలకమైన వారం రోజులు సీఎం కేసీఆర్‌ రాష్ట్రాల పర్యటన ఉండటంతో మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో టెన్షన్‌ పెరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కావస్తున్నా మంత్రివర్గ విస్తరణపై అధికారిక సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top