
సత్వర సహాయక చర్యలు చేపట్టండి
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో జరిగిన ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో జరిగిన ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆదివా రం కేబినెట్ సమావేశం జరుగుతుండగానే ఆయన ఈ సమాచారం అందుకున్నారు. వెంటనే అక్కడి అధికారులను సంప్రదించి సత్వర సహాయక చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలను ఆదేశించారు. అక్కడ చిక్కుకున్న విద్యార్థినీవిద్యార్థులకు తగిన బస ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
నీటిలో కొట్టుకుపోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసేలా అక్కడి అధికారులతో మాట్లాడుతూ అవసరమైన చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సమాచారాన్ని తెలియజేయడానికి వీలుగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.